యండమూరి వీరేంద్రనాథ్ కలం ప్రతిభావంతంగా పరుగులు తీసిన ఆ రోజుల్లో ఒక నవల రాశాడు… పేరు పర్ణశాల… డెస్టినీ అంటే ఏమిటో బలంగా చిత్రీకరిస్తుంది అది… అక్వా ఎగుమతులతో కోట్లు సంపాదించిన ఓ కుటుంబం… ఇన్స్యూరెన్స్ కట్టడం మరిచిపోతారు, ఒక్క క్షణం డీప్ ఫ్రీజర్ రూం డోర్ వేయలేని దురవస్థ… తెల్లారేసరికి తల్లకిందులు… కుటుంబం బజారున పడుతుంది… సదరు ఓనర్ కారు డ్రైవర్‌గా చేరతాడు మరోచోట, సాక్షాత్తూ తన భార్యే ఆ కారు ఓనర్‌కు లొంగిపోతుంది…
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయాల్ కథ, వార్తలు చదువుతున్నకొద్దీ పదే పదే ఆ పర్ణశాలే గుర్తొస్తుంది… ఎంచక్కా గాలిలో ఎగిరిపోతున్న ఆ జెట్ విమానం హఠాత్తుగా క్రాష్ అయిపోయి, ఓ సక్సెస్ స్టోరీ కాస్తా డిజాస్టర్ అయిపోయిన సీన్ కళ్ల ముందు కదలాడుతుంది… ఈమధ్య కోర్టులో ‘యువరానర్, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది… జీవితంలో ప్రతి ఆశా వదిలేసుకున్నాను’ అని కన్నీళ్లపర్యంతమయ్యాడు… వేల కోట్లను ఆర్జించిన ఓ బడా వ్యాపారి చివరకు అలా శోకతప్తుడవుతున్నాడంటే… దాన్ని రాత అంటామా, గీత అంటామా, టైమ్ అంటామా..?
టైమ్, డెస్టినీ… చాలా బలమైన, ప్రభావమంతమైన పదాలు… ఓ తుప్పుపట్టిన తుపాకీ కాస్తా తెల్లారేసరికి తోపు కావచ్చు… ఈరోజు తోపులా కనిపిస్తున్నది రేప్పొద్దున తుప్పులా తప్పుపట్టిపోవచ్చు… ఏదో ఓ పాతకాలం తుపాకీతో ఆడుకుంటూ పిల్లలు ఓ గోళీని అందులో మరిచిపోతే, అదే తుపాకీ ఉల్టా పేలి విలన్ ప్రాణాలు తీస్తుంది, గుర్తుందా… అంతే…
Ads
మన ప్రభుత్వాలు లక్షల కోట్ల బ్యాంకు రుణాల్ని వసూలు చేయలేక రైటాఫ్ చేస్తున్నాయి,.. వేల కోట్లు మింగిన పెద్ద తలకాయలెన్నో ఎంచక్కా జీవితాల్ని ఎంజాయ్ చేస్తున్నారు… కొందరు విదేశాల్లో తలదాచుకున్నారు… ఇంకొందరు రాజకీయాల్లో చేరి, మరింత సంపాదిస్తున్నారు… కానీ జెట్ ఎయిర్‌వేస్ నరేష్ గోయల్ మాత్రం జైలులో చావు కోసం ఆశగా దేవుడిని ప్రార్థిస్తున్నాడు… సరిగ్గా రాస్తే పెద్ద నవల… విపరీతమైన గీరతో విర్రవీగే ప్రతి ఒక్కడినీ నేలమీదకు దింపగలదేమో…
ప్రస్తుతం నరేష్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు… అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు ఇటీవల ఆయనకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది… ఆయన జైలు నుంచి వస్తున్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది… దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీగా ఉన్న సమయంలో నరేష్ గోయల్ హోదా, వైభోగం ఎలా ఉండేది… ఇప్పుడెలా అయిపోయాడు… ఒక్కసారి ఆయన జీవితం పరికిస్తే…
ఒక అల ఎగిసింది… అదే అల విరిగిపడింది… నరేష్ గోయల్ 1967లో పాటియాలా నుంచి ఢిల్లీకి వచ్చాడు… అప్పటికి అయన 18 ఏళ్లు మాత్రమే… కుటుంబం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది… రెండు పూటల భోజనం కూడా కష్టమే… ఆ పేదరికం తనను తన కజిన్ తాతగారి ట్రావెల్ ఏజెన్సీలో పని చేయడం వైపు నడిపించింది… ఈ కంపెనీ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉండేది… ఇక్కడ పని చేస్తూనే ట్రావెల్ ఏజెన్సీ పని నేర్చుకున్నాడు… ఆ తర్వాత క్రమంగా ట్రావెల్ పరిశ్రమలో తన పట్టును విస్తరించుకోవడం ప్రారంభించాడు…
నాలుగు సంవత్సరాలు మాత్రమే పనిచేసిన తర్వాత నరేష్ గోయల్ తన స్వంత ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించాడు… దానికి జెట్ ఎయిర్ అని పేరు పెట్టాడు… అప్పట్లో ట్రావెల్ ఏజెన్సీ పేరు చెప్పి ఎయిర్‌లైన్ కంపెనీ అంటూ కొందరు ఎగతాళి చేసేవారు… అయితే, నరేష్ గోయల్ ఏదో ఒక రోజు తప్పకుండా తన సొంత ఎయిర్‌లైన్ కంపెనీని తెరుస్తానని చెప్పేవాడు… నిజంగానే అతను తన సొంత ఎయిర్‌లైన్ కంపెనీని తెరిచే రోజు రానే వచ్చింది…
నరేష్ గోయల్ 1991లో జెట్ ఎయిర్‌వేస్‌ను ఎయిర్ ట్యాక్సీగా ప్రారంభించాడు… దీని తర్వాత, ఒక సంవత్సరంలో కంపెనీ నాలుగు విమానాలను సమకూర్చుకుంది… జెట్ విమానాల మొదటి ఫ్లైట్ కూడా ప్రారంభించబడింది… 2007లో ఎయిర్ సహారాను స్వాధీనం చేసుకున్న తర్వాత జెట్ ఎయిర్‌వేస్ 2010 వరకు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ… కానీ, నరేష్ గోయల్‌కు ఈ ఆనందం కొద్దికాలమే మిగిలింది. కంపెనీ కష్టాలు పెరగడం ప్రారంభమై 2019 సంవత్సరంలో అతను తన పదవి నుండి వైదొలగవలసి వచ్చింది… అదే సంవత్సరంలో జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి.
అప్పుల ఊబిలో కూరుకుపోయాడు… కెనరా బ్యాంక్‌లో తీసుకున్న అప్పు రూ.538 కోట్లు దాటిపోయింది… బ్యాంకు తనపై మోసం చేసినట్టు కేసు పెట్టింది… దేశంలో ఇలా బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేని వాళ్లు, ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించనివాళ్లు ఎందరు లేరు..? మన తెలుగు రాష్ట్రాల్లోనే బోలెడు మంది… బ్యాంకు కేసుతో గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనను అరెస్టు చేసింది… కేసు బలంగా ఉండేందుకు మనీలాండరింగ్ సెక్షన్లూ పెట్టింది… ఆయన ఉద్దేశపూర్వక ఎగవేతదారు కాదు, ఐతేనేం, విధి ఆయన మీదే పగబట్టింది… ఇలా చేసింది… వందలు, వేల కోట్లను సంపాదించి, అపరిమిత వైభోగాన్ని అనుభవించేవాళ్లు తప్పక చదవాల్సిన కథ ఇది… ఎందుకంటే, ఈరోజు రంగులచిత్రం రేప్పొద్దున వెలిసిపోయి, విరిగిపడవచ్చు..!!
Share this Article