సగటు హిందూ కుటుంబం అంటే అది బ్రాహ్మణ కుటుంబమే అయి ఉండాలా..? అందులోనూ ఓ సగటు బ్రాహ్మణ కుటుంబం అనగానే మూఢనమ్మకాలు, మితిమీరిన ఆచారాలు, మడి, ఛాందసపోకడలు చూపించాలా..? నామాలు, బొట్టు, జంధ్యం, ఒకరకమైన యాస భాష ఎట్సెట్రా బ్రాండెడ్ లక్షణాలు ఉండి తీరాలా..? ఇతర మతాలను ఈసడించుకునే తత్వాన్ని రుద్దాలా..? ఆధునికతకు ఆమడదూరంలో ఉన్నట్టుగా చిత్రీకరించాలా..? ఎల్లరకూ ఆ కులమే అలుసుగా దొరుకునేల..?! ఏమో, నాని కులం, వివేక్ ఆత్రేయ కులం ఏమిటో తెలియదు…
అంటే సుందరానికీ… అనబడే ఓ తాజా చిత్రరాజాన్ని చూస్తున్నప్పుడు కలగబడే చొప్పదంటు సందేహాలన్నమాట… సరే, దాన్నలా వదిలేద్దాం… హిందూమతానికి సూచికగా చూపించాలనుకుంటే అది ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబాన్నే చూపించాలనే దర్శకుడి అపరిపక్వ సోయికి ఓ పేద్ద దండం పెట్టేద్దాం… సముద్రాలు దాటని సత్ సంప్రదాయం ఏకాలం నాటిది అధ్యక్షా..? తమరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు..?!
అవునూ… ఫాఫం, ఆ అనుపమ పరమేశ్వరన్ ఊసు లేదు ఈ ప్రమోషన్ వీడియోల్లో… ఎందుకు..? ఏరకంగా చూసినా నజిరియాకన్నా ఆమె బెటర్ కదా… ఐనా మనకెందుకు లెండి… కానీ మరీ ఎక్కడా ఆమె పేరు లేకుండా ఈ ప్రచార హంగామా..?! నిజంగా అనుపమను చూస్తే జాలేస్తుంది… ఈ సినిమా నిర్మాతలకు నజిరియా భర్త ఫహాద్ ఫాజిల్‌తో రిలేషన్స్ ఏమిటో మనకు తెలియదు కదా… నిజానికి అనుపమనే ప్రధాన హీరోయిన్‌గా చేసి ఉంటే బాగుండేదేమో… (అనుపమకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు…)
Ads
నజిరియా గురించి కదా చెప్పుకుంటున్నది… అసలు సినిమా ఇండస్ట్రీలో ఆమె పాత్ర నామమాత్రం… మొదట్లో చైల్డ్ ఆర్టిస్టు… యుక్తవయస్సుకు వచ్చిన తరువాత కొన్ని సినిమాల్లో చేసింది, బెంగుళూరు డేస్ చేసేటప్పుడు ఫహాద్‌తో ఇంటిమసీ… ప్రేమ… పెళ్లి… 2014లో పెళ్లి తరువాత ఆమె కెరీర్ లేదు… నాలుగేళ్ల తరువాత, తల్లి అయింతర్వాత ఏదో ఒకటోరెండో సినిమాలు… 2018 నుంచి ఒక్క సినిమా లేదు… పోనీ, పెద్ద అందగత్తె ఏమీ కాదు… అంత ఇంప్రెసివ్ నటన ఏమీ లేదు… ఓ వెటరన్ తల్లిని భలే ఎంచుకున్నావోయ్ నానీ…
సగటు తెలుగు సినిమా హీరోయిన్ కామన్ ఫీచర్స్ ఏమీ లేవు… సాదాసీదా అందం… పెద్దగా నటనలో పరిణతి, అసాధారణ ప్రతిభా అంటే అదీ లేదు… మరి ఆమే ఈ పాత్రకు సరైన ఎంపిక అని నాని మొదటి నుంచీ కలగన్నాడట… బోలెడు ప్రెస్‌మీట్లలో బొచ్చెడు పూలు పెట్టాడు నాని… ఈ సినిమాలోనూ ఆమె పాత్ర పెద్దగా కనెక్టయ్యేది కూడా ఏమీ లేదు… పోనీలే, వాళ్ల సినిమా వాళ్లిష్టం… సినిమా చూడాలి అని మెడ మీద కత్తులేమీ పెట్టడం లేదుగా…
అసలు రెండు గంటల సినిమా అంటేనే చాలా ఎక్కువ నిడివి ఈ రోజుల్లో… అసలు ఓ సాదాసీదా కథ కోసం థియేటర్లకు వచ్చి, నిలువు దోపిడీ ఇచ్చే రోజులు కావివి… అయితేనేం.. ఫాఫం, నానికి చాలా నమ్మకం… ఏకంగా మూడు గంటల సినిమా తెచ్చేశారు… బహుశా ఎడిటర్ ఒక్కసారి కూడా తన కత్తెరకు పనిపెట్టి ఉండడు… ఏ సోయిలో బతుకుతున్నారుర భయ్… సరే, పోనీలెండి… పిల్లజమీందార్, అష్టాచెమ్మా బాపతు హీరో కాదు కదా ఇప్పుడు… పెద్ద హీరో అయిపోయాడు, మరి అవలక్షణాలు అంటకపోతే ఎలా…? వీ అన్నాడు, చెత్తా యాక్షన్‌తో చతికిలపడ్డాడు… టక్ జగదీష్ అన్నాడు, అదో పెద్ద జోక్…
శ్యామ్ సింగరాయ్ అన్నాడు… జనం ఫోఫోవయ్యా అనేశారు… అందుకే పాత నాని తరహా పాత్రల వైపు మళ్లాడు… ఈ తొక్కలో యాక్షన్స్, ఈ ఓవర్ హీరోయిక్ బిల్డప్పులు ఎట్సెట్రా చూసి సర్లేవోయ్ అన్నారు… అందుకే ఓ సరదా పాత్ర… కానీ రోజులు మారాయి… అంత పెద్ద థ్రిల్లింగో, కామెడీయో వర్కవుట్ అయ్యిందా…? ఆ దర్శకుడికే తెలియాలి ఫాఫం… ఫస్టాఫ్ అంతా తెలుగు టీవీ సీరియల్‌లా సాగదీసీ దీసీ… ప్రేక్షకుడికి పెద్ద పరీక్షే పెట్టారు… కరోనా అనంతరం కూడా ప్రేక్షకుల మానసిక స్టామినా బాగుందా లేదా అని పరీక్షించ దలుచుకున్నట్టున్నారు…
చెప్పలేదంటనకపొయ్యేరు… ఈ సంగీతం, ఈ పాటలు ఓ డిజాస్టర్… వాటి చిత్రీకరణ, వాటి ట్యూన్లు గట్రా ఇతర సంగీత దర్శకులకు, దర్శకులకు ఓ పాఠం… సినిమా సంగీతం ఎలా ఉండకూడదో చెప్పడానికి… సరే, ఇవన్నీ ఎలాగైనా పోనివ్వండి… నేను గర్భవతిని అని చెప్పేస్తే వేరే మతమైనా సరే అని చెబుతారా..? నాకు పిల్లలు పుట్టరు, ఐనా ఆమె చేసుకుంటుందట అని చెప్పగానే వోకే వోకే అని తలూపుతారా..? ఏం కామెడీ బాసూ…! ఏమాటకామాట… కొన్నాళ్లుగా ఏక్‌సేఏక్ పాత్రల్ని ఇరగదీస్తున్న నరేష్‌కు అలాంటిదే మరో పాత్ర ఇది… దున్నేశాడు…
చివరగా… ప్రిరిలీజ్ అన్నారు… పవన్ కల్యాణ్‌ను పిలిచారు… ఇదే నిర్మాతలు ‘‘భవదీయుడు భగత్‌సింగ్’’ అని ఓ సినిమా తీస్తున్నారట, ఓవర్‌కే యాక్షన్ నేర్పే హరీశ్ శంకర్ దర్శకుడట… మొహమాటం… తప్పదు కాబట్టి పిలిచారు… అక్కడికి వచ్చాక పవన్ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటూనే ఎప్పటిలాగే తన సుత్తి తను బాదేశాడు… దాన్నెవరూ మార్చలేరు… కాకపోతే పవన్ వ్యతిరేక ప్రేక్షకగణంలో ఈ సినిమా పట్ల కూడా నెగెటివిటీ పెరుగుతుందనే సోయి నిర్మాతకు, హీరోకు, దర్శకుడికీ లేకుండా పోయింది… ఇదంతా బాగానే ఉంది గానీ, సినిమా ఎలా ఉంది అంటారా..? ఇవన్నీ వేర్వేరు అంశాలు మాత్రమే చెబుతుంటే ఇంకా అర్థం కావడం లేదా..? ఫాఫం, నాని… ఎలా ఉండేవాడివి భయ్యా…!!
Share this Article