Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగార్జునా… ఈసారి ఎర్రగడ్డలో కెమెరాలు పెట్టిద్దాం… వోకేనా…

December 20, 2023 by M S R

బ్యాడ్ బాస్ ఆడించే బొమ్మలు

కనిపించని బిగ్ బాస్ కు,
కనిపించే అక్కినేని నాగార్జునకు,
ప్రసారం చేసే స్టార్ టీ వీ కి,
ప్రోగ్రాం తయారుచేసిన ఎండమాల్ ఇండియాకు…

మీరు మమ్మల్ను వినోదపరచడానికి సృష్టించిన బిగ్ బాస్ మీరు కోరుకున్నట్లుగా హౌస్ బయటకూడా విధ్వంసం సృష్టించడం కాకతాళీయం కాదు. విపరీత, ఉన్మత్త, పైత్య ప్రకోపాలున్న కొందరిని ఎంపికచేసి…వారిని…కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా వందల కెమెరాలు అమర్చిన ఇంట్లో బంధించి…వారిమధ్య పోటీలు, గొడవలు, ప్రేమలు, కన్నీళ్లు, శిక్షలు, పరిహారాలు, ఎగ్జిట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మొత్తం మానవజాతిమీద మానవజాతికే అసహ్యం పుట్టేలా మీరు రూపొందించిన కార్యక్రమంలో వినోదం ఎంతపాళ్లు ఉందో కానీ…అంతులేని విధ్వంసం మాత్రం తవ్వుకున్నంత, తన్నుకున్నంత ఉంది అనడానికి- మొన్న అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియో ముందు, నడి రోడ్లో పగిలిన ఆర్ టీ సీ బస్సు అద్దాలు సాక్షి. పగిలిన తలలు సాక్షి. విరిగిన అభిమానుల ఎముకలు సాక్షి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీసిన పాదచారులు సాక్షి. పరస్పరం పెట్టుకున్న కేసులు సాక్షి. లోకంలో ఇంకేమీ లా ఆర్డర్ సమస్యల్లేనట్లు మీరు అగ్గి రాజేసి…సృష్టించిన మతిలేని అభిమానుల అల్లర్లు సాక్షి.

Ads

పిచ్చి ప్రోగ్రామును తయారు చేయడానికి ఇన్ని కోట్లు తగలేసే బదులు…నిజంగానే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఇవే కెమెరాలు పెడితే…ఇంతకంటే మంచి ప్రోగ్రాము మహా రంజుగా తయారవుతుంది. పరిశీలించగలరు.

సగటు మధ్యతరగతి ఇళ్లల్లో ముగ్గురుంటే నాలుగు స్మార్ట్ ఫోన్లు ఎలాగూ ఉంటున్నాయి. ఏ ఇంటికి ఆ ఇంటిని బిగ్ బాస్ హౌస్ గా పరిగణించి…జూమ్ కాల్లో బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చి…ప్రతి ఇంట్లో కంటెస్టెంట్లను తయారు చేసి లోకం మీదికి వదలవచ్చు. పరిశీలించగలరు.

మా ఇళ్లలో పూటగడవకపోయినా…బిగ్ బాస్ ఇంట్లో క్షణం క్షణం ముందే రాసి పెట్టుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఉత్కంఠగా జరిగినట్లు చూపే…కృత్రిమ సంకల్పిత సంఘటనలను చూడడంలో మా మానసిక దౌర్బల్యం మీద మీరు చేసేది వినోద వ్యాపారం అయింతవరకు మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడది విధ్వంస కాండలోకి ప్రవేశించింది. హౌస్ బయట సహజ వాతావరణంలో సహజంగా జరిగే విధ్వంసం కూడా బిగ్ బాస్ టాస్క్ లలో భాగమై ఉంటే… దయచేసి ఊరవతల మనుషులు తిరగని…దయ్యాలు నిద్రలేచి ఒళ్లు విరుచుకుని నర్తించేవేళ…షూట్ పెట్టుకోండి. మీరు పిలిస్తే…కంటెస్టెంట్ల తరపున పనీపాటా లేని వేనవేలమంది ఎగబడి వస్తారు. వచ్చి కొట్టుకుంటారు. వారికి పరస్పరం దెబ్బలే దెబ్బలు. మీకు పరస్పరం డబ్బులే డబ్బులే.

నగరం నడిబొడ్డున ఇంత అనాగరికంగా వ్యవహరిస్తే బిగ్ బాస్ కనీసం క్షమాపణ చెప్పాడా? వివరణ ఇచ్చాడా? పశ్చాత్తాపం ప్రకటించాడా?

నాగరికసమాజంలో ఉన్నామా?
బిగ్ బాస్ హౌస్లో ఉన్నామా?

ఈ ఆర్టిక్యులేటెడ్ ఎంటర్టైనింగ్ విధ్వంస ప్రోగ్రామింగ్ లో మొదటి ముద్దాయిలు ఎవరు?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions