ఎన్నికల మాటలోనే ఎన్ని కలలో అన్న అంతరార్థమేదో దాగి ఉన్నట్లు ఉంది. కలలు కంటేనే ఒకనాటికి అవి కల్లలు కాకుండా నిజం కావచ్చు.
బుద్ధిజం, కమ్యూనిజం, టూరిజం లాంటి అనేక ఇజాల్లో పవనిజం ఒకటి. ఇజాల్లో నిజానిజాలు కాలం తేలుస్తుంది. బ్రహ్మ పదార్థాన్ని అనుభవించాలే కానీ- మాటల్లో చెప్పలేం. అలాగే పవనిజం కూడా అనుభవంలోకి రావాలే కానీ- మాటల్లో వర్ణించలేం. అయితే ఎంతో కొంత మాటల్లో చెప్పుకోకపోతే పవనిజం ఇచ్చే ప్రయోజనాలను పొందే నైతిక అధికారం మనం కోల్పోతాం. మూర్తీభవించిన మేధావులు తప్ప అందరూ పవనిజాన్ని చెప్పలేరు. పవనిజం స్వరూప స్వభావాలు లక్షణాలు కొంతవరకు ఇలా ఉండవచ్చు.
Ads
తెలుగువారికి ప్రత్యేకమయిన వేషం పంచెకట్టు. పెద్దల పంచెలు ఊడబెరికి కొట్టాలి. తెలంగాణా ఏర్పడినప్పుడు పదకొండు రోజులు నిద్రాహారాలు మాని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి ఆ తెలంగాణలోనే ఇల్లుకట్టుకుని ఉండాలి. కమ్యూనిస్టుల ఎర్ర కండువా కప్పుకుని నుదుట కాషాయ తిలకం దిద్దుకోవాలి. ఒకరిని గెలిపించాలి. ఒకరిని ఓడించాలి.
ఏకకాలంలో అనేక పార్టీల సిద్ధాంతాల పొత్తులు పొత్తిళ్లలో కత్తులుగా గుచ్చుకుంటున్నా ఏ గాయం రక్తం ఏదో తెలియకుండా నటించాలి. రాజకీయాల్లో జీవిస్తున్నటు నటించాలి. నటన ఇష్టం లేనట్లు జీవించాలి. జీవితం గడవడానికి నటనను మునిపంట భరించాలి. తెలుగు వ్యాకరణ సూత్రాల పుస్తకాలతోపాటు అనేక భావనలను సూత్రీకరించే సిద్ధాంత రాద్ధాంత వేదాంత గ్రంథాలను చుట్టూ పేర్చుకోవాలి.
చాలా సాధారణ జీవితం గడపడానికి చాలా కష్టపడి ఎంతోమందిని పోషించాలి. పంచ్ డైలాగులకు ప్రత్యేక రచయితలు త్రివిక్రములై విజృంభించి రాయాలి. మాటలు అర్థమై కాకుండా మిగలాలి. ఏదో నిగూఢ అర్థం ధ్వనిస్తూ ధ్వని ధ్వనిగా ప్రతిధ్వనించాలి. లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఎప్పటికీ లేవకుండా మనిషిగా మిగిలి ఉండాలి.
అన్నట్లు- తెలంగాణాలో భాగ్యనగరం ఎన్నికల్లో పవనిజం నిలబడడం లేదట. ఎంత చక్కటి అవకాశాన్ని చేజేతులా జారిపోయింది? తెలంగాణ ప్రకటించిన రోజునుండి బాధతో ఏకాదశ దిన ఉపవాస దీక్ష చేసి చిత్తశుద్ధిని చాటుకున్న పవనిజం భాగ్యనగరం ఎన్నికల్లో పోటీ చేసి నూట పదకొండు వార్డులు గెలుచుకుని మేయర్ స్థానం కైవసం చేసుకునేది కదా? ఆపై సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకునేది కదా? ఎలాంటి సువర్ణావకాశం తృటిలో తప్పింది? దేనికయినా రాసిపెట్టి ఉండాలి…
Share this Article