లోకం నాశనమైపోతోంది… ఎక్కడ చూసినా స్వార్థం, దుర్మార్గం ప్రబలిపోతోంది… మనుషుల్లో మంచితనం కొడిగట్టింది… ఇక కలియుగాంతమే మిగిలి ఉంది… ఇదేకదా సర్వత్రా ప్రచారంలో ఉన్నది… అందరూ నమ్ముతున్నది… కాదు, కాదు… నీచమైన మన మీడియా మంచిని ఎప్పుడూ వెలుగులోకి రానివ్వదు,.. చెత్తా రాజకీయ నాయకుల సొల్లు , అబద్ధాలు తప్ప ఇంకేమీ దానికి అక్కర్లేదు… నెగెటివిటీ తప్ప దానికి మరేమీ పట్టదు… కానీ చదువుతుంటేనే మనసు అపరిమితమైన ఆనందానికి లోనయ్యే కొన్ని వార్తలుంటయ్…
ఇదీ అలాంటిదే… అప్పుడప్పుడూ మనిషికి ఇలాంటి పాజిటివ్ వార్తలు అవసరం… మధ్యప్రదేశ్, ధార్… యుగప్రకాష్ తివారీ… భార్య పేరు రాగిణి… ఆయనకు ఇద్దరు కొడుకులు… ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి… జీవితం సాఫీగా సాగిపోతోంది… కానీ కరోనా ఆ కుటుంబంలో అగ్గిపెట్టింది… చిన్నకొడుకు ప్రియాంక్‌ను బలిగొన్నది… కుటుంబంలో ఆనందానికి ఒక్కసారిగా గ్రహణం పట్టింది…
Ads
కోడలి పేరు రిచా… 34 ఏళ్ల వయస్సున్న ఆమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్… అప్పటికే తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది… భోపాల్ దగ్గర మండిదీప్ దగ్గర ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తుంటుంది… ఆమెను చూస్తుంటే ఆ అత్తామామల కడుపు తరుక్కుపోతోంది… మన నీచమైన సీరియళ్లలో చూపించే అత్తామామలు కారు… సీరియళ్ల బుర్రల్లేని రచయితలకు అంతకుమించిన కథలు కూడా చేతకావు… తెలుగు సీరియళ్ల రచయితలు, దర్శకుల బుర్రలు మరీ బురదగుంటలు అని తెలిసిందే కదా… జాతికి పెద్ద వైరసులు…
ఓ నిర్ణయం తీసుకున్నారు ఆ అత్తామామలు… భర్తను కోల్పోయిన కోడలికి మనమే అమ్మానాన్న అవుదాం అని తీర్మానించుకున్నారు… ఓ వరుడిని వెతకడం స్టార్ట్ చేశారు… నాగపూర్‌కు చెందిన వరుణ్ మిశ్రా ఆమె కథ మొత్తం విన్నాడు… నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ముందుకొచ్చాడు… పైసా కట్నం అక్కర్లేదు అన్నాడు… ఆమె బిడ్డ నా బిడ్డే అన్నాడు… గ్రేట్… అక్షయ తృతీయ రోజున ఆ వరుడి కాళ్లు కడిగారు ఆమె అత్తామామలు… కోడలిని ‘‘కన్యాదానం’’ చేశారు…
అప్పటికే తమ కొడుకు ప్రియాంక్ ఓ ఇంటిని కొనుక్కుని ఉన్నాడు… ఆ ఇంటిని కోడలికి కానుక కింద ఇచ్చారు… ఓ కొత్త జీవితం గడుపు తల్లీ అని నిండు మనస్సులతో ఆశీర్వదించారు… తమ బంధుగణాన్ని పిలిచారు… తమ ఇంట్లో తమ బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టుగానే చేశారు… మరణించిన ప్రియాంక్ అన్న పేరు మాయాంక్ తివారీ… తమ్ముడి జ్ఞాపకాలతో ఓ పుస్తకం రాశాడు… మ్యాప్ ఆఫ్ లైఫ్… పెళ్లికి వచ్చినవాళ్లకు పంచారు… ఏదీ దాచే పనిలేదు… కోడలు కొత్త కాపురానికి వెళ్తున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలే,క మనమరాలిని విడిచిపెట్టలేక సతమతం అయ్యారు… వాళ్లు తమ కోడలిని కోరింది ఒక్కటే… అప్పుడప్పుడూ తమ మనమరాలిని చూడటానికి వస్తాము, అనుమతించు తల్లీ అని…!!
ఇలాంటివి జరగలేదా..? బోలెడు జరిగాయి… కానీ ఎప్పటికప్పుడు ఇలాంటివి రాయబడాలి, చదవబడాలి… చర్చల్లోకి రావాలి… అత్తామామలంటేనే పిశాచాలే అనే భావనలు బద్దలవ్వాలి… ఆరు దశాబ్దాల క్రితమే ఫేమస్ హిందీ నటి దుర్గా ఖొటే తన కొడుకు చనిపోతే తన కోడలు విజయ్ మెహతాకు ఇలాగే మరో పెళ్లిచేసింది… అంతెందుకు… మనందరికీ తెలిసిన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కూడా తన కొడుకు శ్రీనివాస్ ప్రసాద్ మరణిస్తే కోడలికి మళ్లీ పెళ్లి చేశాడు… శుభం…
Share this Article