.
గ్రహణం, అష్టా చెమ్మా, జెంటిల్‌మాన్… కొంతమేరకు సమ్మోహనం… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను భిన్నమైన దర్శకుడిగా, సోకాల్డ్ పెంట కమర్షియల్ ధోరణులకు భిన్నంగా కనిపిస్తాడు…
కానీ ఏమైందో ఏమో తనకు..? కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు… పట్టాలకెక్కే ప్రయత్నమూ పెద్దగా చేయలేదు… చివరకు చిన్న హీరో ప్రియదర్శిని హీరోగా పెట్టి ఓ భిన్నమైన కథను రాసుకున్నాడు, తీసుకున్నాడు… కానీ మరోసారి బాగా నిరాశపరిచాడు… ఏమంది బాసూ నీకు..?
Ads
నిజానికి ప్రియదర్శి కమెడియనే కాదు, తనలో ఓ నటుడున్నాడు… కానీ తన రేంజుకు సరిపడా పాత్ర పడితే బాగా రాణిస్తాడు… కోర్ట్ సినిమా అదే… కానీ ఈ సారంగపాణి జాతకం సినిమాను తన భుజాన మోసినా సరే… ఇలాంటి సినిమాను ఒక్కడే (కథ ఎలా ఉన్నా) మోయగలడా అని డౌటుండేది… మన డౌట్ నిజమే అని నిరూపిస్తాడు తను…
ఐతే అది తన లోపం కాదు… దర్శకుడిదే… పాత్ర కేరక్టరైజేషన్‌లోనే బలం లేదు, పంచ్ లేదు… ప్రియదర్శి కూడా ఏం చేయగలడు పాపం… ఈ కథ ప్రియదర్శి చుట్టే తిరుగుతుంది, అతనికి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యంపై గుడ్డిగా నమ్మకం…
తన ప్రియురాలు రూపా కొడువాయూర్‌తో నిశ్చితార్థం జరిగినప్పుడు, జ్యోతిష్యం వల్ల వారి సంబంధంలో సమస్యలు ఎలా తలెత్తుతాయనేది కథ… చివరికి, సారంగ తన మూఢనమ్మకాల ప్రభావాన్ని గుర్తించి, వాటి నుంచి ఎలా బయటపడతాడనేది కథాంశం… మొత్తానికి జ్యోతిష్యాన్ని ఓ మూఢనమ్మకంగా తేల్చిపడేశాడు…
రూపా కొడువాయూర్… కథలో ఈమె పాత్ర కీలకమే… కానీ స్క్రీన్ టైమ్ తక్కువ… పాత్ర ప్రాధాన్యమూ తక్కువే…
కాలం మారుతోంది… ప్రేక్షకుల అభిరుచులూ మారుతున్నాయి… ఇంకా పాత ధోరణులతో ఉంటే చెల్లదు… కానీ దర్శకుడికి ఆ నిజం తెలిసీ ఫెయిలయ్యాడు… తాజా ప్రజెంటేషన్ ధోరణులు ప్లస్ న్యూఏజ్ రచనతో చెప్పాలని అనుకున్నా దానికి తగినట్టు తనే మౌల్డ్ కాలేదు, ఫలితంగా కథ, సినిమా, ప్రజెంటేషన్ ఆపాత కాలంలోనే ఉండిపోయాయి…
నిజానికి సరదా, కామెడీ సీన్లపై ఆధారపడితే కథలో లాజిక్కులు అవసరం లేదు… జాతిరత్నాలు సినిమా చూశాం కదా… మామూలుగా చూస్తే ఎవడురా ఈ దర్శకుడు అనిపిస్తుంది, కానీ హిట్… డీజే టిల్లూ… సంక్రాంతికి వస్తున్నాం… కామెడీ వర్కవుట్ అవుతే చాలు, జబర్దస్త్ సినిమాలు అంటారు వీటిని…
ఈ సినిమాలో బామ్మ కామెడీ బ్లాక్, వైజాగ్ హోటల్ సీన్లు ఫ్లాప్… మరీ పాత చింతకాయపచ్చడి జోకులు… సినిమా బోరెత్తించడానికి ప్రధాన బాధ్యుడు దర్శకుడే… ఎవరినీ నిందించే పనే లేదు… సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, వివా హర్ష, తనికెళ్ల భరణి… వీరిలో ఎవరు తక్కువ… సరైన పాత్రలు పడాలే గానీ ఇరగదీసే రకాలు… అందరూ వేస్టయ్యారు… జస్ట్, రచనలో వైఫల్యం కారణంగా.,.
కొంతలో కొంత వడ్లమాని శ్రీనివాస్ అనబడే తండ్రి పాత్రధారి నయం… తన పాత్ర కూడా బలంగా రాయబడలేకపోయినా సరే తన నటనతో కాస్త అట్రాక్ట్ చేశాడు… ఇక సంగీతం… శుద్ధ దండుగ… హఠాత్తుగా ఇంద్రగంటిని నీ సినిమాలో పాటలు ఏమేం ఉన్నాయో చెప్పు ఓసారి అనడగండి, కచ్చితంగా చెప్పలేడు…
సో, కేవలం కొన్ని సరదా సన్నివేశాలు… అంతే… బాగా పాతబడిన రచన, కామెడీ కోసం అల్లిన మరీ పాత చింతకాయ పచ్చళ్లు… వీక్ క్లైమాక్స్… వెరసి ప్రియదర్శికీ, ఇంద్రగంటికీ చేతులు కాలాయి… ఈరోజు ఆరేడు సినిమాలు రిలీజ్… సంపూర్ణేష్ సోదరా సినిమాతో సహా… ఈ సారంగపాణి మీదే కాస్త అందరి దృష్టీ ఉంది… అదీ తుస్సుమంది…!!
Share this Article