పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, పోరు తెలంగాణమా… అని గద్దర్ పాడిన పాటలోని జోష్ ఒక్కసారిగా నరాల్లో ఎంత చైతన్యం నింపేదో కదా… సాహిత్యం వదిలేయండి కాసేపు… ఆ గొంతు అలా పరవళ్లు తొక్కిస్తుంది పాటను…
పోనీ, వందేమాతరం శ్రీనివాస్ పాడిన వందేమాతర గీతం వరస మారుతున్నది అనే పాట ఓసారి గుర్తుతెచ్చుకొండి… ఆయన పాట పాడుతుంటేనే జానపదం గజ్జె కట్టినట్టుంటుంది… ఖంగున మోగి నేరుగా గుండెను కనెక్టవుతుంది… ఓ రాములమ్మా అనే పాట కూడా…
ఒక పాట బాగా కనెక్టవ్వాలంటే… ఒక జోష్ మనల్ని ముంచెత్తాలంటే… సాహిత్యమే కాదు, సరైన బాణీ, పదాల అర్థాలు తెలిసి ఎమోషన్ పలికించగల గొంతు అవసరం… మరీ ప్రత్యేకించి పాట తీరును బట్టి ఇన్‌స్ట్రుమెంట్ వాడాలి… పొడుస్తున్న పొద్దు మీద పాటకు గజ్జెలు, డప్పులు తప్ప బాగా సూటయ్యేవి ఉండవు… ఎందుకూ అంటే దానికి వివరణ దొరకదు… అది జానపదం… పల్లె జనపదం…
Ads
మరి తరతరాలూ తెలంగాణ జాతిగీతంగా వెలుగొందుతూ… జాతిలో నిత్య ఉత్తేజాన్ని నింపాల్సిన అందెశ్రీ ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ ఆ లక్ష్యాన్ని సాధించేలా ఉందా..? తన పాటలో జావళీలు వంటి అనవసర పదాల్ని కాసేపు వదిలేద్దాం… జాన పద జనజీవన జావళీలు జాలువార… అంటాడొక చోట… జావళీలు పదం సూట్ కాదక్కడ… సరైందీ కాదు… ఆ పదం అర్థాల లోతు చర్చలోకి పోవడం లేదిక్కడ…
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర… అంటాడు రచయిత ఓచోట… అంతగా జాగృతపరిచేలా ఈ కొత్త బాణీ సాగిందా..? లేదనే చెప్పుకోవాలి… అంటే కీరవాణి చెడగొట్టాడని కాదు… ఉండాల్సినంత బాగాలేదని..! సరే, కీరవాణి ఎంపిక మీద కూడా రచ్చ నడిచింది… కీరవాణి అయితేనేం, రెహమాన్ అయితేనేం… ఆ గీతం, ప్రయోజనం అర్థం చేసుకుని, దానికి తగినట్టు బాణీ చేకూర్చారా అనేదే ప్రధానం… ఒక బతుకమ్మ పాటకు రెహమాన్ పనికిరాలేదు,.. జయజయహే తెలంగాణ పాటకు కీరవాణి కూడా న్యాయం చేయలేదు…
ఏదో సినిమా పాటలాగా కంపోజ్ చేశాడు తప్ప అందులో తెలంగాణ జానపద ఆత్మ పలకలేదు… తనకు దక్కిన ఓ మంచి అవకాశాన్ని సార్థకం చేసుకోలేదు తను… ట్రిపుల్ ఆర్ వంటి పాటలపై పెట్టిన శ్రద్ధలో అయిదో వంతు పెట్టినా పాట ప్రతి తెలంగాణవాసిని ఇట్టే కనెక్టయ్యేదేమో… పైగా ఇది ఓ బృందగానం… మంచి బేస్ వాయిసున్న గాయకుడిని ఎంపిక చేసుకోవల్సింది… రేవంత్ (సీఎం కాదు, సింగర్) గొంతు బాగుండదని కాదు, కానీ ఈ పాటకు ఆప్ట్‌గా లేదు… తనకుతోడుగా పాడిన హారిక నారాయణ్ గొంతు కూడా మధురమే కానీ ఇక్కడ సరిగ్గా ఇమడలేదు అనిపిస్తోంది… (బతికి ఉంటే బాలు పాడేవాడో లేదో తెలియదు గానీ, తను లేని లోటు కనిపిస్తోంది ఇక్కడ కూడా… రామకృష్ణ కూడా…)
ఇప్పుడు అనేకానేక ఇన్‌స్ట్రుమెంట్లను కంప్యూటర్లలోనే పలికిస్తున్నారు సంగీత దర్శకులు… కృతకంగా ఉంటాయి… వాటికి బదులు లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్… అందులోనూ తెలంగాణ జానపదానికి బాగా నప్పే డప్పు, కంజెర, గజ్జెల్లాంటివి హుషారుగా ధ్వనిస్తే బాగుండేది… బేస్ వాయిస్ ఉన్న గాయకులు ఎందరు లేరు…? పక్కా హైదరాబాదీ, అదే ఆస్కార్ రేంజ్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కాదు, హేమచంద్ర వాయిస్ కూడా దీనికి సూటయ్యేదేమో… ఎహె, వందేమాతరం శ్రీనివాస్ ఆనందంగా, పరవశంగా, తన్మయత్వంతో ఆలపించేవాడు…
జైతెలంగాణ అనే పదాల దగ్గర పాట ఫుల్లు డౌనైపోయింది… సరిగ్గా అక్కడే పాట బాగా పైకి లేవాలి… ప్చ్, కీరవాణి కూర్చిన బాణి పోరాట నేపథ్యమున్న ఓ విముక్త రాష్ట్ర జాతిగీతానికి నప్పలేదు… ఈ పాట ఆత్మను తను పట్టుకోలేకపోయాడనే అనిపించింది… ఐనా, పోనీలే… తినగతినగ వేము అన్నట్టు ఈ బాణి కూడా వినగ వినగ చెరుకువలె తీపెక్కుతుందేమో…!! ఆ పాటలో ఉన్న ఎమోషన్ పవర్ అదీ..!! (ఒక బాణీ, ఒక పాట ఒకరిని నచ్చితే అందరికీ నచ్చాలని ఏమీ లేదు… ఒకరిని నచ్చకపోతే అందరికీ నచ్చలేదని కాదు… ఇదొక రివ్యూ, ఇదొక ఒపీనియన్… అంతే…)
Share this Article