రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు … ఒక టేబుల్ పై అసెంబ్లీ సెక్రెటరీ గా సుదీర్ఘ కాలం పని చేసిన రాజా సదారామ్ , సెక్రెటరీగా ఉన్న నరసింహా చారి , పక్కన ch vm కృష్ణారావు , నేనూ , పర్యాద కృష్ణమూర్తి ఇంకొందరం ఉన్నాం . రాజ్యసభ ఎన్నికల సమయం . తనకు మరోసారి పొడిగింపు ఉంటుంది అని కేకేశవరావు ఆశిస్తున్నారు .. రాజ్య సభ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించేది అసెంబ్లీ సెక్రెటరీ …
కేశవరావు ఎప్పుడు ఎన్నికయ్యారు ? ఎప్పటి వరకు పదవీ కాలం అనేది చర్చ …. చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణారావు ఎవరితోనో మాట్లాడుతున్నారు … కృష్ణారావు ఠక్కున కేశవరావు రాజ్యసభకు ఎప్పుడు ఎన్నిక అయ్యారు ? ఏ నెల వరకు పదవీ కాలం ఉందో చెప్పేసరికి కార్పొరేషన్ చైర్మెన్ పర్యాద కృష్ణమూర్తి భార్య ఏం జ్ఞాపక శక్తి, తేదీలతో సహా చెబుతున్నారు ? ఎవరాయన అని ఆశ్చర్యంగా అడిగారు .
****
Ads
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయాక ప్రతిపక్షంలో 47 మంది సభ్యులతో … అసెంబ్లీలో చర్చ … అసెంబ్లీ ఆవరణలోని టీడీపీ ఛాంబర్ లో పెద్ద సంఖ్యలో రిపోర్టర్లు టివిలో లైవ్ చూస్తున్నారు . అనంతపురం టీడీపీ శాసన భ్యులు ఒకరు మాట్లాడుతున్నారు .. ఎవరు మాట్లాడుతున్నారు అంటే కొమ్మినేని శ్రీనివాస్ ఒక పేరు చెప్పారు … అతను కాదు అని సీనియర్ జర్నలిస్ట్ రఘు బదులిచ్చాడు . అతను కాకపోతే ఎవరో మీరే చెప్పండి అని కొమ్మినేని …. ఇంతలో ఛాంబర్ లోకి కృష్ణారావు వస్తుంటే … కృష్ణారావు కరెక్ట్ పేరు చెబుతారు అన్నాను . కృష్ణారావు జ్ఞాపకశక్తి మీద అంత నమ్మకం … లోపలికి అడుగు పెడుతూనే …. మాట్లాడుతున్న ఎంఎల్ఏ పేరు అడగగానే ఫలానావాడు అని ఠక్కున చెప్పేశారు …
****
82 లో టీడీపీ పెట్టినప్పుడు కృష్ణారావు ఈనాడు రిపోర్టర్ … అప్పుడు టీడీపీ అభ్యర్థులను , వారి భవిష్యత్తును నిర్ణయించింది ఈనాడు , ఆ పత్రిక రిపోర్టర్లే … అంతే కాకుండా ఆయన సీనియర్ గా ఉన్నప్పుడు స్ట్రింగర్లుగా పనిచేసిన వారు చాలా మంది మంత్రులు , శాసనసభ్యులు అయ్యారు … దానితో ప్రారంభంలో టివి చర్చల్లో ఒకటి రెండుసార్లు పొరపాటున వాడు అనే ప్రస్తావించే వారు …
****
ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ జరుగుతోంది .. బాబు తన ఛాంబర్ లో ఉన్నారు … ఆ ఛాంబర్ లో కొద్ది మంది రిపోర్టర్లు కూడా ఉన్నారు …నాకు గుర్తున్నంత వరకు హిందూ నగేష్ , కొమ్మినేని , గౌరీశంకర్ , నేనూ ఉన్నాం . కృష్ణారావు ఏదో అడుగుతుంటే బాబు ఇబ్బందిగా మరో గదిలోకి వెళుతుంటే … ఏంటీ నేను మాట్లాడుతుంటే అలా వెళ్లిపోవడమేనా ? అని కృష్ణారావు కోపంగా అడిగాడు … వెంటనే అప్పటి సిపిఆర్ఓ విజయ కుమార్ గది నుంచి వచ్చి బాబుగారు మిమ్ములను రమ్మంటున్నారు అని లోపలికి తీసుకు వెళ్లారు .
అసెంబ్లీ ఛాంబర్ నుంచి బయటకు వెళ్ళాక అదేంటి బాబును మరీ అలా గద్దించేశారు … అని అడిగితే ఢిల్లీ వస్తే ఎలా ఉండాలో చెప్పింది నేను … నేను మాట్లాడితుంటే అలా వెళ్లి పోతాడా ? అని బదులిచ్చాడు . పైరవీలు చేసుకొనే అలవాటు లేకపోవడం , విషయ పరిజ్ఞానం అలా మాట్లాడే ధైర్యం ఇస్తుంది …
***
ఎర్రంనాయుడు సోదరుడి పెళ్లి … ఆంధ్రభూమికి చెందిన స్ట్రింగర్ ఒకరు పెళ్లి భోజనం వద్ద వడ్డిస్తూ హడావుడి … గోదావరి జిల్లాలకు చెందిన స్ట్రింగర్ … ఒకే ఒకసారి జిల్లా మీటింగ్ లో కృష్ణారావు చూశాడు . ఏం గుర్తు పడతాడులే అని అతను అలానే వడ్డిస్తున్నాడు … కృష్ణారావు ఒక్కసారి అతన్ని చూసి నువ్వు ఫలానా ఏరియా ఆంధ్రభూమి స్ట్రింగర్ వు కదా ? అంటే ఆ కుర్రాడు తేరుకోలేకపోయాడు … ఒక్కసారి చూస్తే పేరు , మనిషిని అలా గుర్తుంచుకునేవారు .
****
కృష్ణారావుకు పరిచయం లేని నాయకుడు , తెలియని విషయం లేదేమో అనిపిస్తోంది . రాజకీయ అంశాలే కాకుండా ఇరిగేషన్ రంగం గురించి మంచి పరిజ్ఞానం .. తెలంగాణ , ఆంధ్ర అనే తేడా లేకుండా విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్ట్ లను గౌరవించే వారు .. పని దొంగలు , బద్దకస్తులు ఎవరో ఈజీగా కనిపెట్టేవారు … పైరవీలు చేసే వారు వణికి పోవలసిందే, ఎందుకంటే ఎక్కడ ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవడానికి విస్తృతమైన నెట్ వర్క్ ఉండేది .. విస్తృతంగా నాయకులతో మాట్లాడడం వల్ల అన్నీ తెలిసేవి … ఇప్పుడు వాట్స్ ఆప్ జర్నలిజం కాలంలో మనిషిని మనిషి కలవడమే తగ్గిపోయింది .. ఇక అనుభవాలు ఎక్కడ ?
***
ఒక నాయకుడు మాట్లాడింది మరో నాయకుడికి చెబుతాడు నారదుని మాదిరి అని కృష్ణారావుపై విమర్శ ఉంది … బహుశా ఆలా చెప్పడం వల్ల మరింత సమాచారం రాబట్టవచ్చు అనే ఉద్దేశం కావచ్చు .. నేను తెలంగాణ , కృష్ణారావు ఆంధ్ర … ఆంధ్రభూమిలో ఉద్యమ కాలంలో ఎడిటర్ నుంచి ఇబ్బంది ఉన్నా నా తెలంగాణవాదాన్ని ఎప్పుడూ దాచుకోలేదు … నీలో అది నాకు బాగా నచ్చింది అని ఈ మధ్య మాట్లాడినప్పుడు కూడా అన్నారు .
***
నేను సంస్థ నుంచి వెళ్లిపోయాక డక్కన్ క్రానికల్ లోనే ఉన్న కృష్ణారావు ఓసారి ఫోన్ చేసి సలహా అడిగారు . బాబు నన్ను ఆంధ్ర ప్రదేశ్ లో సమాచార హక్కు కమిషనర్ గా నియమిస్తాను అని చెప్పారు . ఇప్పుడేమో ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ గా అవకాశం వచ్చింది … నువ్వయితే ఏం చేస్తావు అని అడిగితే …. బాబు హామీలో గ్యారంటీ ఉండదు … ముందు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో చేరండి … ఒకవేళ నిజంగా బాబు కమిషనర్ ను చేయదలుచుకుంటే డక్కన్ క్రానికల్ లో ఉంటేనే చేస్తాను అని ఏమీ అనరు కదా .. ఎక్స్ ప్రెస్ లో ఉన్నా చేస్తారు … రెసిడెండ్ ఎడిటర్ గా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటారు అన్నాను . భూమిలో శాస్త్రిని పంపించేశాక ఆ స్థానంలో కృష్ణారావును ఎడిటర్ గా నియమిస్తారు అని అంతా అనుకున్నారు … కానీ అలా జరగలేదు ..
మిత్రుడు రవిచంద్ సలహాతో కృష్ణారావు టివిలో విశ్లేషకునిగా పాల్గొనడం మొదలు పెట్టారు … ఏ పార్టీ వారు ఏమనుకున్నా నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేవారు … కొంత మంది జర్నలిస్ట్ లకు ఆయన మాట కటువుగా అనిపించేది కానీ ఆ మాటలో నిజాయితి ఉండేది …. వారు పోయాక కాదు, ఉన్నప్పుడు …. నాకు బాస్ గా ఉన్నప్పుడు కూడా ఇదే అభిప్రాయం … జ్ఞాపకాలు రాస్తున్నప్పుడు … మీరు 82 నుంచి టీడీపీని చూశారు బోలెడు జ్ఞాపకాలు ఉంటాయి రాయండి అన్నాను … నువ్వు ఓపికతో భలే రాస్తున్నావు .. ప్రయత్నించాలి అన్నారు . అప్పటి సంగతులు రాయండి అని చెబితే వాట్స్ ఆప్ లో ఓ ఫోటో పంపారు … బాబుతో పాటు నేల మీద కూర్చున్న ఫోటో … ఆ రోజుల్లో అలా ఉండే వాళ్ళం అని ….
వారితో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు … భూమిలో వారం వారం రాసే జనాంతికం వ్యంగ్యాన్ని బాగా ఎంజాయ్ చేసి ఫోన్ చేసి అభినందించే వారు . మన అనుభవాలు , జ్ఞాపకాలు మనతోనే పోతాయి … రాయకపోతే … రాయండి, జ్ఞాపకాలు రికార్డ్ చేయండి అని ఓ రెండు నెలల క్రితం చెప్పాను … రాస్తాను అని మాట ఇచ్చి మాట తప్పి పోయారు .
నా జ్ఞాపకాల్లో ఓ రోజు మీ గురించి రాస్తాను అన్నాను … మా అన్నకు ఆరోగ్య సమస్య వల్ల నెల రోజులు జ్ఞాపకాలు రాసే మూడ్ రాలేదు .. రాయలేక పోయా … ఈ రోజు ఉదయమే ఏదో విషయంపై జాగర్ల మూడి రామకృష్ణ ఫోన్ చేసి కృష్ణారావుకు సీరియస్ అన్నారు … ఈ రోజైనా రాయాలి అనుకున్నాను .. ఓ మూడు గంటలు గడిచాక కృష్ణారావు పోయారు అని తెలిసింది . ఇలా రాయాల్సి వస్తుంది అనుకోలేదు … విషయ పరిజ్ఞానం ఉన్న తరం జర్నలిస్ట్ chvm కృష్ణారావు ….. నాకు లా చేయాలి అని ఉండేది … మా నాన్న ఫీజు కట్టలేదు . దానితో డిగ్రీ చేసి జర్నలిజం వైపు వచ్చాను అని ఓ సారి చెప్పారు …. – బుద్దా మురళి (కృష్ణారావు మృతికి ముచ్చట కూడా నివాళి అర్పిస్తోంది…)
Share this Article