దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఈ విదేశీ టూర్లు ఏమిటీ ప్రధాని గారూ అని కాంగ్రెస్ ప్రశ్నించింది ఓ ట్వీట్‌లో… ఇంకేం..? బీజేపీ క్యాంపుకు కోపమొచ్చింది… మరి ఇదేమిటో చెప్పండి అన్నట్టుగా… ఓ నైట్ క్లబ్బులో రాహుల్ కనిపిస్తున్న వీడియోను వదిలింది… ఈయన ఎవరో తెలుసా అంటూ కపిల్ మిశ్రా ఓ ట్వీట్ వదిలాడు… సోషల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ అనుకూల, వ్యతిరేక పోస్టులతో ఊగిపోతోంది…
రాహుల్ వీడియో సారాంశం ఏమిటయ్యా అంటే… నేపాల్, ఖట్మాండులోని ఓ నైట్ క్లబ్ (lord of drinks) వెళ్లాడు, వెళ్తే వెళ్లాడులే గానీ అక్కడ నేపాల్‌లోని చైనీస్ రాయబారితో కలిసి కనిపిస్తున్నాడు… సో వాట్..? ఇక్కడ నిజంగా రాహుల్ చేసిన తప్పేమిటో అర్థం కావడం లేదు… అక్కడ ఏదో దేశద్రోహం జరిగిపోతోందనీ, చైనాకు దేశరహస్యాలన్నీ అమ్మేస్తున్నాడు, రాహుల్ మీద చైనా హానీట్రాప్ వేసింది అన్నంత భీకరంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు గానీ… అక్కడ వీడియో మాత్రం చాలా ప్లెయిన్‌గా ఉంది…
సీఎన్ఎన్ ఢిల్లీ కరెస్పాండెంట్ సుమ్‌నిమా ఉదాస్ పెళ్లి కోసం రాహుల్ ఖట్మాండు వెళ్లాడని సమాచారం… తనే కాదు, తనతోపాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు… అక్కడ మేరియట్ హోటల్‌లో బస చేశాడు… అక్కడ ఓ పార్టీలో పార్టిసిపేట్ చేశాడు… రాహుల్ జర్నలిస్ట్ ఫ్రెండ్ సుమ్‌నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ గతంలో నేపాల్ ప్రభుత్వ రాయబారిగా బర్మాలో పనిచేశాడు… ఈ పెళ్లికి చాలామంది రాయబారులను ఆహ్వానించారు… ఇదీ నేపథ్యం…
Ads
ఆ వీడియోలో నిజంగానే ఏముందని..? ఏమీ లేదు… రాహుల్ అసభ్యకరమైన పనులేమీ చేయడం లేదు… ఆ ఆంబియెన్స్ చూస్తున్నాడు, ఫోన్‌లో ఏదో పరిశీలిస్తున్నాడు, ఏదో డౌట్ వచ్చి పక్కనున్న ఆమెను ఏదో అడుగుతున్నాడు, ఆమె కూడా మంచినీళ్లు మాత్రమే తాగుతోంది… రాహుల్ చేతిలో ఆ నీళ్ల గ్లాసు కూడా లేదు…
ఒకవేళ నిజంగానే రాహుల్ దేశద్రోహానికి పాల్పడుతున్నాడు అనుకుందాం… ఆ నైట్ క్లబ్బులో డీజేల నడుమ అంత మందిలో రాహుల్ రహస్యాలు పంచుకుంటున్నాడా..? ఐనా తనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా..? అత్యంత రహస్యమైన వివరాల్ని షేర్ చేసుకోవడానికి..? బీజేపీ మరో ప్రశ్న ఏమిటంటే..? రాజస్థాన్ పార్టీలో ఉద్రిక్తతలు పెరుగుతుంటే నువ్వు వేరే దేశానికి పార్టీ చేసుకోవడానికి వెళ్లడం ఏమిటి అని..!
पहचान कौन ? Who are they ? pic.twitter.com/IDKBkjSg5A
— Kapil Mishra (@KapilMishra_IND) May 3, 2022
ప్రశాంత్ కిషోర్‌తో కీలకమైన వ్యూహాలు చర్చిస్తున్నప్పుడే రాహుల్ దేశంలో లేడు… తను అంతే… దేశాలు తిరుగుతూనే ఉంటాడు… అది ఆ పార్టీ అంతర్గత యవ్వారం కదా, బీజేపీకి వచ్చిన నొప్పి ఏమిటట..? వెరసి ఈ వీడియోకు ఏ ప్రాధాన్యతా లేదు… ఉద్దేశపూర్వకంగా ఏదో పూసే ప్రయత్నం తప్ప… నిజంగా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయాలంటే ఇలాంటి ట్రిక్స్ అవసరమా..? బోలెడు అంశాలు ఉన్నయ్… అవి మాట్లాడరు, ఇలాంటివి అయితే హాట్ హాట్‌గా జనంలోకి పంపించి, పలుచన చేయొచ్చు కదా అనుకున్నట్టున్నారు… కరెక్ట్ కాదు..!! (ఐనా.., రాహుల్, కాంగ్రెస్ పార్టీల్ని దెబ్బతీయడానికి ఇన్ని వేషాలు అవసరమా..? ఆ పని పాపం, వాళ్లే చేసుకుంటున్నారు కదా…)
(CNN journalist)
పాత సినిమాల్లో శత్రుగూఢచారులకు రహస్యాల్ని చేరవేసే సీన్లు ఉండేవి… ఏదో నైట్ క్లబ్బులో డాన్సర్లు గుడ్డపీలికలతో అన్నీ ఊపుతూ నర్తిస్తుంటారు… ఓ టేబుల్ వద్ద గుర్తుపట్టకుండా కూర్చుని ఏజెంట్లు సూట్‌కేసులు మార్చుకుంటారు… రహస్యంగా రహస్యాలు అమ్ముకోవడం, చేరవేయడం అన్నమాట… మరీ రాహుల్‌ను ఆ స్థాయిలో చిత్రీకరించడానికి బీజేపీ పాత హిందీ సినిమా మోడల్ ఏదో ప్లాన్ చేసింది… కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు…
ఇది వదిలేస్తే… కేసీయార్‌కు రేవంత్ థాంక్స్ చెప్పాలి… రాహుల్ వచ్చి ఓయూలో విద్యార్థులతో మాట్లాడితే వచ్చే ప్రచారంకన్నా, దాన్ని అనుమతించకుండా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న కేసీయార్ ధోరణితో అంతకుమించిన ప్రచారం వచ్చేసింది… ఒకవేళ నిజంగానే రాహుల్ గనుక చంచల్‌గూడ జైలుకు వెళ్లి అరెస్టయిన విద్యార్థులతో ములాఖత్ వేస్తే ఇంకా రెట్టింపు ప్రచారం వస్తుంది… అఫ్‌కోర్స్, కేసీయార్ దానికీ అనుమతించడు… కానీ ఏదైతేనేం, కాంగ్రెస్‌కు కావల్సిన ప్రచారం వస్తూనే ఉంది కదా… బండి సంజయ్ పాదయాత్రకు వచ్చే మైలేజీ పక్కకుపోయి, కాంగ్రెస్ హైలైట్ అవుతోంది… ఇక వరంగల్ సభకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని కట్టడులు ఉంటాయో చూడాలి…!!
Share this Article