ఫిలిప్పీన్స్ ను మూడు చెర్ల నీళ్లు తాగించాడు! మన డేరాబాబాకు ఏమాత్రం తీసిపోడు!!
మొన్న చెప్పుల బజార్ లో ఆకు రౌడీని కొట్టావంట.. నిన్న కోఠిలో అవిటి రౌడీని కొట్టావంట నీకోసమే చూస్తున్నామంటాడు రౌడీల్లల్లో కాస్త పెద్ద రౌడీ పాత్రలో చలపతిరావు. వెంటనే ఇంకో రౌడీ నేను పాస్తా రౌడీని.. నన్ను ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు ఈ సిటీకి అంటాడు. నేను రాయలసీమ రౌడీని.. మా చైర్మన్ గారు తీసుకొచ్చారు నన్ను ఈ రాష్ట్రానికని ఇంకో గూండా అంటాడు. నేను నైజాం దాదాని.. నాకు మేయర్ గారు మేపుతున్నారు రోజుకో మేకని అంటాడు మరో రౌడీ. వాటన్నింటికీ సమాధానంగా….
మూర్ఖులారా మీరు పేట రౌడీలు, పూట రౌడీలైతే.. నేను రాయలసీమ రుస్తుంని, నైజాం దాదాని, ఆంధ్రా గూండాని.. టోటల్ గా ఈ స్టేట్ రౌడీనంటాడు చిరంజీవి. ఇక సినిమా పేరు చెప్పాల్సిన పన్లేదనుకోండి. అయితే, ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే.. మనమిప్పుడు స్టేట్ రౌడీలో చిరంజీవి తరహాలో.. అటు అమెరికానీ.. మరోవైపు ఫిలిప్పీన్స్ ని ప్రీస్ట్ ముసుగేసుకుని దడదడలాడించిన ఓ అంతర్జాతీయ క్రిమినల్ గురించి చెప్పుకోబోతున్నాం గనుక…
Ads
అవును, అంతర్జాతీయంగా అమెరికా, ఫిలిప్పీన్స్ లతో పాటు.. పలు దేశాలను ముప్పుతిప్పలు పెట్టి.. తనకు తాను దేవుడి కుమారుడిగా పరిచయం చేసుకుంటూ నేరాలకు పాల్పడ్డ అపోలో క్విబోలాయ్ కథ అంతర్జాతీయ నేర సామ్రాజ్యంలో ఇప్పుడు ట్రెండింగ్. ఎందుకంటే ఓ దశలో ఎఫ్బీఐ ఏకంగా 2 వేల మంది అధికారులను అతడిని వెతికే పని కోసం నియమించింది. అంతటి మోస్ట్ వాంటెడ్ ఆ క్విబోలాయ్.
ఇంతకీ ఎవరా క్విబోలాయ్..?
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే సన్నిహిత మిత్రుడు. ఫిలిప్పీన్స్‌లో లక్షలాది మంది అనుచరులను సంపాదించుకున్నఫిలిప్పీన్ పాస్టర్, ప్లస్ లీడర్. కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పేరిట నిర్వహిస్తున్న రెస్టోరేషనిస్ట్ క్యాథడ్రాల్ చర్చ్ పాస్టర్. క్విబోలాయ్ పై.. మానవ అక్రమరవాణా, పిల్లలపై లైంగిక వేధింపుల నుంచి మొదలకుంటే.. స్మగ్లింగ్, నకిలీ వీసాలు, లెక్కకు మించి మోసాలకు పాల్పడుతూ చేసుకునే పెళ్లిళ్లు, మనీ లాండరింగ్ వంటి పలు కేసులు నమోదయ్యాయి.
సోన్ షైన్ మీడియా నెట్ వర్క్ ఇంటర్నేషనల్ పేరుతో… మీడియా కార్యకలాపాలతో ఫిలిప్పీన్ 16వ అధ్యక్షుడైన రోడ్రిగోతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని తానాడిందాట, పాడింది పాట అన్న చందంగా చెలరేగిపోయిన నొటోరియస్ క్రిమినల్. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఫిలిప్పీన్ ప్రభుత్వానికి సహకరించకపోవడంతో..సెనేట్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ 2024, మార్చ్ 19వ తేదీన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ లోకల్ గవర్నమెంట్ క్విబోలాయ్ సమాచారమందించినవారికి కోటీ 43 లక్షల, 32 వేల రూపాయల రివార్డ్ అందిస్తామని 2024, జూలై 8న ప్రకటించింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 8, 2024న రెండు రోజుల క్రితం క్విబోలాయ్ ను అరెస్ట్ చేశాయి ఫిలిప్పీన్ పోలీస్ వర్గాలు.
క్విబోలాయ్ నేపథ్యం!
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లుబావో నుంచి ఫిలిప్పీన్స్ కు బతుకుదెరువు కోసం వచ్చారు క్విబోలాయ్ తల్లిదండ్రులు. 9 మంది పిల్లల్లో అందరికంటే చిన్నవాడైన క్విబోలాయ్ ఏనాడూ తాను ఓ పాస్టర్ అయితానని అనుకోలేదు. ఏరోనాటికల్ ఇంజనీర్ గా, పైలట్ కావాలనే కలలు కనేవాడు. యునైటెడ్ పెంటాకోస్ట్ బైబిల్ ఇనిస్టిట్యూట్ లోనే చదువుకోవడంతో.. తన ఆసక్తి మారింది. అలా పాస్టర్ అయిన క్విబోలాయ్ కి కొంతకాలం తర్వాత యునైటెడ్ పెంటాకోస్ట్ బైబిల్ ఇనిస్టిట్యూట్ లో విభేదాలేర్పడ్డాయి. తనని పాస్టర్ గా పక్కకు జరిపారు.
1985లో కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పేరుతో చర్చ్ ను నెలకొల్పి.. తనకు తానే లీడర్ గా.. పాస్టర్ ఆఫ్ చర్చ్ గా ప్రకటించుకున్నాడు. తను ఆ దేవుడు పంపిన దూతగా.. ఆ దేవుడి కుమారుడిగా అభివర్ణించుకున్నాడు. అలా తన చర్చ్ తో భక్తులు, అభిమానులు, అనుచరగణాన్ని సంపాదించుకున్న క్విబోలాయ్ ఏకంగా తన కింగ్ డమ్ ఆఫ్ నేషన్ గా కూడా తన చర్చ్ ను ప్రకటించుకుని.. తాను చేసే అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా తయారుచేశాడు. మరో సమాంతర ప్రభుత్వాన్నే నడిపాడు.
ప్రీస్ట్ ముసుగు వేసుకుని క్విబోలాయ్ చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేరాడు. పరారీలో ఉంటూ పోలీసులకు, ఎఫ్బీఐకీ చిక్కకుండా తిరుగుతున్న అతగాడిపై ఇంటర్ పోల్ ఉత్తర్వులు జారీ చేశారు. 12 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న బాలికలు, స్త్రీలను లైంగిక అక్రమ రవాణా చేసినందుకు యూఎస్ న్యాయ శాఖ 2021లో అతనిపై అభియోగాలు మోపింది. అతడి దగ్గర పని చేసినందుకు వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
74 ఎకరాల విస్తీర్ణంలో కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ చర్చ్!
74 ఎకరాల విస్తీర్ణంలోని తన చర్చ్ లో రెండు వేల మంది పోలీసులు సోదాలు జరిపారు. రెండు వారాల భారీ పోలీసు ఆపరేషన్ తర్వాతగానీ.. క్విబోలాయ్ ని ఫిలిప్పీన్స్ పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేకపోయింది. అంతేకాదు, ఆ సమయంలో పోలీసులు పెద్ద ప్రతిఘటనే ఎదుర్కొన్నారు. పోలీసులనే నిర్బంధించే ప్రయత్నం చేశారు క్విబోలాయ్ అనుచరులు.
75 వేల మంది ఉండగల్గే సామర్థ్యం కల్గిన స్టేడియంలో ఆ చర్చ్ కు సంబంధించిన స్టేడియంలో సోదాల కొరకు పోలీసులు ఏకంగా హెలిక్యాప్టర్స్ ఉపయోగించాల్సి వచ్చింది. థర్మల్ ఇమేజింగ్ రాడార్స్ వంటి పరికరాలనుపయోగించి.. క్విబోలాయ్ ఆ చర్చ్ కింద ఉన్న బంకర్ లో దాక్కున్నట్టు గుర్తించారు. మొత్తంగా క్విబోలాయ్ ని ఆదివారం రోజు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
అయితే, ఇప్పటికీ క్విబోలాయ్ తాను దేవుడి కుమారుడినేనని… ఈ విశ్వానికి యజమానినేనంటూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడం కొసమెరుపు. అయితే, క్విబోలాయ్ పై యూఎస్ లోనూ కేసులున్న నేపథ్యంలో అతణ్ని అక్కడికి అప్పగించే ముందు ఫిలిప్పీన్స్ లో ప్రాసిక్యూషన్ పూర్తి కావల్సి ఉంటుందని ప్రస్తుత ఫిలిప్పీన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ చెప్పే మాట.
దైవాన్ని ఓ వ్యాపారంగా మార్చి.. నమ్మకాలు బలమైన మూఢ నమ్మకాలుగా తయారైనచోట ఇదిగో ఇలాంటి క్విబోలాయ్ వంటివారు.. నిత్యానందలు.. డేరాబాబాలు పుట్టుకొస్తునే ఉంటారు. దానికి దేశాలతో.. మతాలతో.. కులాలతో సంబంధం లేదు. కేవలం నమ్మకమే పెట్టుబడి… (కొంటికర్ల రమణ)
Share this Article