విష్వక్సేనుడు, దేవినాగవల్లి గెటవుట్ వివాదం మీద మొత్తానికి తెలుగు సమాజం రెండుగా చీలిపోయింది… విష్వక్సేనుడికి మద్దతుగా కొందరు… దేవికి మద్దతుగా కొందరు… అయితే టీవీ9 మీద, దేవి మీద ఇతర కారణాలతో ఇప్పటికే వ్యతిరేకత పెంచుకున్న సెక్షన్ ఇప్పుడిక చాన్స్ దొరికింది కదాని విష్వక్సేనుడికి మద్దతుగా నిలుస్తున్నారు…
నిజం చెప్పాలంటే… దేవికి జర్నలిస్టు ప్రపంచం నుంచి, విష్వక్సేనుడికి సినిమా సంఘాల నుంచి పెద్దగా దొరికిన మద్దతేమీ లేదు… ఇదేదో తాము కలుగజేసుకునే వ్యవహారం కాదులే అని వదిలేశాయి… తలసాని, దానం మొదట్లో ఏవేవో వ్యాఖ్యలు చేసినా సరే, తరువాత సైలెంటయ్యారు… తప్పదు కాబట్టి టీవీ9 తమ జర్నలిస్టు దేవికి మద్దతుగానే నిలబడింది… పేరున్న నటులు, దర్శకులు విష్వక్సేనుడికీ మద్దతుగా రావడం లేదు… సరే, ఇదంతా కొన్నాళ్లు గుప్పుగుప్పుమని, పొగలు సెగలు రగిలి, దానంతటదే ఆరిపోతుందిలే గానీ… మధ్యలో అనసూయను లాక్కొచ్చారు కొందరు నెటిజన్లు…
అసలే అనసూయ, వివాదాలంటే మహా ప్రీతి… తను పొట్టిబట్టలతో, రంగమ్మత్త వేషాలు, డాన్సులతో ఒకవైపు నెటిజన్ల నుంచి పంచులు వేయించుకుంటూనే… మరోవైపు తన వేషాలకు సూటవ్వని వింత ఫైట్లు చేస్తుంటుంది… ట్రోలర్లపై విరుచుకుపడుతుంది… అది వేరు, ఇది వేరు అంటారా..? సరే..! అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమాలో కూడా హీరో ఎడాపెడా ఫ భాష వాడుతుంటాడు, తెలుసు కదా… సెన్సార్ వాళ్లు అంగీకరించకపోయినా సరే, ఆ పదాన్ని వాడి తీరుతామంటూ స్టేజీల మీద హీరో ధిక్కార ప్రకటనలు చేశాడు… అదంతా పాత పంచాయితీ… ఆ సినిమాలోనూ యథేచ్ఛగా కొన్ని వెగటు సీన్లను వాడారు…
Ads
అదుగో, అప్పట్లో అనసూయకు మస్తు కోపమొచ్చింది… వాటీజ్ దిస్ భాష, వాటీజ్ దిస్ పోకడలు అంటూ ఇదే దేవి పెట్టిన ఓ డిబేట్‌కు వచ్చి అనసూయ బాగా మండిపడింది… ఇప్పుడు ఆ వీడియోను బయటికి తీసి కొందరు దేవి ప్లస్ అనసూయ మీద కంబైన్డ్ విమర్శల్ని ఎక్కుపెడుతున్నారు… డైరెక్టర్ హరీష్ శంకర్ వాటిని షేర్ చేసి, భలే ఆనందాన్ని పొందుతున్నాడు… ఎవరి వీడియోలనో, పోస్టులనో షేర్ చేయడం దేనికి..?
చేస్తే నేరుగా విష్వక్సేనుడికి మద్దతుగానే పోస్ట్ చేయవచ్చుగా… ఒక సినిమా వ్యక్తికి మరో తోటి సినిమా వ్యక్తి మద్దతును ఎవరైనా అర్థం చేసుకుంటారు… కానీ దేవికి, టీవీ9కు వ్యతిరేకంగా వచ్చే మీమ్స్ పోస్ట్ చేయడం దేనికి..? అలాగే… అప్పట్లో అనసూయ వ్యతిరేకించింది కూడా ఆ ఫ భాషను… ఆ వెగటు దృశ్యాలను… వాటినేమీ సమర్థించలేదు ఆమె… ఒక సినిమా వ్యక్తి అయి ఉండీ, ధైర్యంగా నోరు విప్పి ఆ భాషను, ఆ పోకడను ఓ పెద్ద చానెల్‌లో కూర్చుని అనసూయ వ్యతిరేకించింది కాబట్టి ఆమెను దేవి ఫైటర్ అంటూ మెచ్చుకున్నట్టు కనిపించింది… అంతేతప్ప ఆ డిబేట్‌లో వాళ్లిద్దరూ ఆ ఫ భాషను సమర్థించలేదు…
నిజానికి ఇటు టీవీ9 గానీ… అటు విష్వక్సేనుడు గానీ ఇకపై చేయగలిగిందేమీ లేదు… అనవసరంగా ఈ రచ్చను పొడిగించడం వృథా… అదే చానెల్‌లో అదే సినిమా యాడ్స్ వస్తూనే ఉంటాయి… ఒకవేళ సినిమా సక్సెసయితే ఇదే టీవీకి, ఇదే స్టూడియోకు వాళ్లను పిలిచి ఇంటర్వ్యూలు కూడా చేస్తారు… జర్నలిజం ఓ దందా… సినిమాలు మరో దందా… పరస్పరం సహకరించుకునే దందారాయుళ్లు… మధ్యలో కొన్నాళ్లు సోషల్ మీడియాలో టైంపాస్ డిబేట్లు, వాగ్వాదాలు… అంతే…
Share this Article