.
(- కె. శోభ) పిల్లే పిల్ల! కుక్కే కొడుకు!! ……. జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా అన్నారో సినీకవి. ఈ అర్థం బాగా ఒంటపట్టించుకున్నట్టున్నారు ఇప్పటి జెన్ జి/ మిలీనియం తరం జంటలు. పిల్లావద్దు జెల్లా వద్దు ఏ పిల్లినో, కుక్కనో పెంచుకుంటే చాలు అంటున్నారు. సంతానం కని సంతసించే భాగ్యం కన్నా పెంపుడు జంతువుల సాంగత్యమే పదివేలు అంటున్నారు.
పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు కన్నా, పెళ్లి చేసుకుని వెళ్లిపోయే కూతురి కన్నా ఉన్నన్నాళ్లూ విడవకుండా తిరిగే పెట్స్ బెటర్ కదా అంటున్నారు.
Ads
చాలామంది నవయువ దంపతుల్లో పెళ్లయేసరికే కుక్కపిల్ల ఉంటోంది. నాకు నువ్వు నీకు నేను మనిద్దరం సాకడానికి… మన చుట్టూ తిరగడానికి కుక్కపిల్ల అని హాయిగా గడిపేస్తున్నారు. ఇంట్లో పనిచేసే వారినైనా ఒసే, ఒరే అంటారేమో గానీ వారి కుక్కనో పిల్లినో ఎవరైనా పేరుతో పిలవకపోతే అలుగుతారు కూడా. అనేక కమ్యూనిటీల్లో వీటిగురించి పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మానవహక్కులు ముఖ్యం కదా అంటే కుక్కల హక్కుల గురించి ఆపకుండా వాయిస్తారు.
ఒక చోట అనికాదు, ప్రపంచమంతా ఇలాగే ఉంది. అందుకు భారతదేశమూ మినహాయింపు కాదు.
ఇండియాలో పెంపుడుజంతువుల ప్రపంచం మారుతోంది. ముఖ్యంగా మిలీనియం తరంలో 66 శాతం తమ జీవితంలో పెట్స్ కే అధిక ప్రాధాన్యమంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 47 శాతం కావడం గమనించదగ్గ అంశం.
వారిలో 70 శాతం మొదటిసారి పెట్స్ కొనుక్కునేవారే. ఇప్పటికీ కుక్కలను పెంచుకునే వారే ఎక్కువ అయినా పెంచడంలో సులువు, ఎక్కువ అరవకపోవడం వంటి కారణాలతో పిల్లులనూ పెంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
పట్టణాల్లో అపార్టుమెంట్లు, చిన్న ఇళ్లలో పెట్టుకునే జంతువుల పెంపుడు తల్లిదండ్రులకు స్థలం సమస్యగానే ఉన్నా ఇండోర్ పాటీ, డాగ్ ఆక్సిసరీస్ వంటి సౌలభ్యాలు వాడుకుని కాలం గడుపుతున్నారు. ( రోడ్లు ఎలాగూ అందుకే ఉన్నాయి)
మరోపక్క పెట్ కేర్ పరిశ్రమ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ప్రత్యేక ఆస్పత్రులు, సౌందర్య సేవల స్పా లతో దూసుకుపోతోంది. బెటర్ సిటీస్ ఫర్ పెట్స్ , ఇండీ ప్రౌడ్ వంటి కార్యక్రమాలతో వీధి కుక్కల దత్తతకు కృషి జరుగుతోంది.
ఇకముందు పెంపుడు జంతువులు సహచరులే గానీ వస్తు వాహన సంపద కాదు. బిక్కచూపుల తల్లిదండ్రుల మాట ఎలాఉన్నా కుక్కలు, పిల్లులు పెంచుకునే తల్లిదండ్రులదే భవిష్యత్తు అంటున్నారు నిపుణులు.
ఒకప్పుడు ఇళ్ల బయట ఉండే కుక్కలు, దూరంగా తిరిగే పిల్లులు ఇంట్లో సోఫాలపైనా, మంచాలపైన సేదతీరుతున్నాయి. ఇంట్లో ఉండాల్సిన పెద్దలు ఇంటి బయటకు, వృద్ధాశ్రమాలకు తరలిపోతున్నారు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదేనా!
ఆటవికంగా ప్రవర్తిస్తే ఆటవికం.
పశువులా ప్రవర్తిస్తే పాశవికం.
పశువులను ప్రేమిస్తే జీవకారుణ్యం.
ఇప్పుడు పిల్లలను కూడా వద్దనుకుని పశువులతో గడపడమే ఆధునికం!
పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళే రోజులు మరి!
Share this Article