సాగర్ ఉపఎన్నిక రక్తికడుతోంది… అనూహ్యంగా బీజేపీ ఓ బంజారా వైద్యుడిని తమ అభ్యర్థిగా తెర మీదకు తీసుకురావడమే కారణం… నిజానికి తెలంగాణ రాజకీయాల్లో కులం మరీ ఏపీ రాజకీయాల స్థాయిలో ప్రధానపాత్ర పోషించదు… కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఆసక్తికరమైన కుల సమీకరణాలకు తెరతీసింది… ముందుగా బీజేపీ సంగతి చెప్పుకుని, మిగతా విషయాల్లోకి వెళ్దాం… గతంలో పోటీచేసిన నివేదిత మళ్లీ నామినేషన్ వేసింది… తనకు రాష్ట్ర పార్టీలో ఓ సెక్షన్ బలమైన మద్దతు ఉంది… ఇక బీఫాం సబ్మిట్ చేయడమే తరువాయి అనుకుంటున్న స్థితి… బీజేపీ స్ట్రాటజీ లెక్కతప్పింది, రవికుమార్‌ను నిలపాలనే ఆలోచన ఎందుకు విరమించుకున్నట్టు అని ‘ముచ్చట’ కూడా ఓ విశ్లేషణ రాసుకొచ్చింది… ఈలోపు హఠాత్తుగా కేంద్ర కార్యాలయం పనుగోతు రవికుమార్ పేరు ఖరారు చేసింది… ఎవరీ రవికుమార్..? బీజేపీ ఏం ఆలోచించింది..? ఏం జరిగింది..?
రవికుమార్ పేరును కేంద్ర కమిటీ దాకా తీసుకుపోవడానికి రాష్ట్ర బీజేపీలోని కొందరు పెద్దలకు కొన్ని కారణాలున్నయ్… జానారెడ్డి రెడ్ల వోట్లను ఆకర్షిస్తే… వోట్ల సంఖ్య రీత్యా బలంగా ఉన్న యాదవులు ప్లస్ బీసీల వోట్లను టీఆర్ఎస్ లాగేస్తుంది… గత ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించింది ఈ సమీకరణమే… ఈసారీ సేమ్ సేమ్ అనుకున్నారు… అందుకని నివేదిత అభ్యర్థిత్వం బీజేపీకి ఈ కుల సమీకరణాల్లో ఇమడదు… పైగా ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన రవికుమార్ బంజారా… నిజానికి రాష్ట్రంలో బంజారాలు బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు… ఎందుకంటే..? వాళ్ల ఎంపీ సోయెం బాపూరావు కొంతకాలంగా బంజరాలను ఎస్టీ జాబితా నుంచే తొలగించాలని ఉద్యమిస్తున్నాడు… ఆమధ్య ఏకంగా మోడీని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చాడు… వేల తండాల్లో గూడేల్లో బంజారా వర్సెస్ ఆదివాసీ పంచాయితీ ఉంది… ఈ స్థితిలో ఒక బంజారాను తమ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం రాజకీయంగా సరైన స్టెప్పు… కానీ కోపంతో ఉన్న బంజారాలు అడిగే ప్రశ్నలకు తమ ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ ఏం సమాధానం చెబుతుంది అనేది ఇంట్రస్టింగుగా మారింది…
Ads
ఎస్టీ వోట్లు అధికంగా ఉండటం రవికుమార్ ఎంపికకు మరో కారణం కాగా, అగ్రవర్ణాల పార్టీగా పడిన ముద్రను మెల్లిగా తొలగించుకోవాలనే ఆలోచన ఇంకో కారణం… ఎస్టీ కార్డు వాడుకోవాలీ, బంజారాలను తిరిగి తమ ఫోల్డ్‌లోకి తెచ్చుకోవాలనే ఆలోచన వరకూ గుడ్… కానీ టీఆర్ఎస్ ఊరుకోదు కదా… పదే పదే బీజేపీ బంజారా వ్యతిరేక ధోరణిని ఎక్స్పోజ్ చేయడానికే ప్రయత్నిస్తుంది… ఒకవేళ టీఆర్ఎస్ ఈ ఎదురుదాడికి ప్రయారిటీ గనుక ఇస్తే, బీజేపీకే నయం… గెలుపోఓటమో జానేదేవ్… వోట్లు ఎన్ని వస్తాయో జానేదేవ్… పోలింగ్ దాకా చర్చల్లో ఉంటుంది… అది చాలు దానికి… మధ్యలో జానారెడ్డి ఏం చేయాలి మరి..? సరే, ఎవరీ రవికుమార్..? అంత తేలికగా తీసిపడేసే అభ్యర్థేమీ కాదు… డాక్టరీ చదువుకున్నాడు… 35 ఏళ్లకే సర్కారీ డాక్టర్ నౌకరీ వదిలేసుకుని, నిర్మల ఫౌండేషన్ పేరిట సామాజిక కార్యక్రమాల్లో మునిగిపోయాడు… నియోజకవర్గంలోని స్థితిగతులపై అవగాహన ఉన్నవాడు… ఇలా సాగర్ ఉపఎన్నిక క్రమేపీ రక్తికడుతోంది..!!
Share this Article