Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మట్టి నుంచి ఇసుక..! ఇక మట్టి దిబ్బల్నీ వదలరేమో ఇసుకాసురులు..!!

March 31, 2024 by M S R

“తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు;
దవిలి మృగతృష్ణలో నీరుత్రాగవచ్చు;
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు;
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు”
అని నీతిశతక పద్యం.

కష్టపడితే ఇసుకలో తైలం తీయవచ్చు. ఎండమావిలో నీళ్లు తాగచ్చు. కుందేటి కొమ్ము పట్టుకోవచ్చు. కానీ ఎంత కష్టపడినా మూర్ఖుడి మనసు రంజింపజేయలేము – అన్నది దీని అర్థం. ఎప్పుడో వందల ఏళ్ల కిందటి నీతి ఇది. కాలమెప్పుడూ ఒకలాగే ఉండదు . మారుతుంటుంది . మారాలి కూడా . కొన్ని పాత సూత్రాలకు కాలదోషం పడుతుంది. కొత్తసూత్రాలు రాసుకోవాల్సివస్తుంది.
ఇప్పుడు మేధావులు, తెలివయిన వారి మనసు రంజిపజేయడం అసాధ్యం . వారు అన్నిటికి పెదవి విరుస్తారు . కాబట్టి అందరూ మూర్ఖులను రంజింపజేయడంలోనే బిజీగా ఉన్నారు. అలా అని రంజనకు గురవుతున్నవారందరూ మూర్ఖులే అని అనుకోవాల్సినపనిలేదు. మిగతా మూడూ కూడా ఈరోజుల్లో అసాధ్యం కాకపోవచ్చు. ఎండమావుల్లో నీళ్లు పిండుకునే సైన్సు ఉండే ఉంటుంది . ఎవరెవరికో కొమ్ములు నెత్తికెక్కినప్పుడు కుందేటికి కూడా కొమ్ములు నెత్తికే మొలిచి ఉంటాయి. ఇక మన అసలు సిసలు ఇసుకలో తైలం దగ్గరికి వద్దాం.

ఇసుక ఎలా ఏర్పడుతుంది ? అంత నున్నగా ఇసుక రేణువులు ఎలా అందగిస్తాయి? అంత నాణ్యమయిన ఇసుక అంతంత దూరం ప్రయాణించడానికి నదితో కుదుర్చుకున్న ట్రావెల్ ఒప్పందమేమిటి ? ఇసుకకు – నదికి అనుబంధమేమిటి ? ఇసుక ఒక పొరగా కింద లేకుంటే నది ప్రవహించకుండా ఎందుకు ఆగిపోతుంది ? ఇసుక ఎన్ని రకాలు ? రాతిని పిండి చేశాక తయారయ్యే కృత్రిమ రోబోటిక్ ఇసుక…నది ఇసుక కాలిగోటికికూడా ఎందుకు సమానం కాదు ?
ఇసుకను తినవచ్చా ?
ఎంత ఇసుక తింటే అరుగుతుంది ?
ఎంత ఇసుక తింటే అజీర్తి అయి ఉదరసంబంధ, జీర్ణకోశ వ్యాధుల డాక్టరు అవసరమవుతాడు ?
నదికి నదికి ఇసుక నాణ్యతలో తేడా ఉంటుందా ? ఇసుకలో కూడా ఉత్తర – దక్షిణ భారత వ్యత్యాసం ఉంటుందా ?
శ్రీ శ్రీ అన్నట్లు సిమెంటు అనుకుని ఇసుకతో నిర్మించే నిర్మాణాలు ఎంతకాలం మన్నుతాయి ?
పిల్లలకు చిన్నప్పటినుండే ఇసుక గూళ్ళు కట్టడం నేర్పడంలో ఏదయినా నిగూఢమయిన భవిష్యత్ అవసరాల గుర్తింపు దాగి ఉందా ?
ఇలా ఆలోచిస్తే ఇసుక రాకెట్ సైన్సు కంటే చాలా కఠినమయినది , లోతయినది , గంభీరమయినది .
ఇసుకే కదా అని పారబోసుకుంటే భవనాల గొంతులు తెగుతాయి .

Ads

తెలుగు నేల మీద ఎప్పుడూ ఇసుక హాట్ టాపిక్ . ఇసుక వ్యాపారం వేలకోట్లు . ఇసుక రాజకీయం ఒక కొత్త సబ్జెక్టు . మనకు దొరకనప్పుడు ఇసుక వేదాంతం. అందరికీ దొరకనివి ఇసుక తిన్నెలు. ప్రభుత్వం గుర్తించిన రీచ్ లలోది ప్రభుత్వ ఇసుక . ప్రభుత్వానికి తెలియనిది ప్రయివేటు ఇసుక . ఇద్దరికీ తెలియనిది దొంగఇసుక. అంటే ఇక్కడ సమాసం సరిగ్గా అర్థం చేసుకోవాలి . దొంగ ఇసుక అంటే ఇసుకే దొంగగా మారిందని కాదు ; ఇసుకను దొంగతనం చేస్తున్నారని – దొంగలు దోచిన ఇసుక ఈజ్ ఈక్వల్ టు దొంగ ఇసుక.

“…కొమ్మల్లో పక్షులారా!
గగనంలో మబ్బుల్లారా!
నది దోచుకుపోతున్న నావను ఆపండి!
రేవు బావురుమంటుందని
నావకు చెప్పండి!”
అని గుంటూరు శేషేంద్ర గుండెలు బాదుకున్నట్లు-
“తీరంలో కొమ్మల్లారా!
గట్లల్లో గువ్వల్లారా!
నది ఇసుకను దోచుకుపోతున్న దొంగలకు చెప్పండి!
రేవు బావురుమంటోందని…
రేవుకు రేపన్నది లేకుండా చేశారని…
బావురుమంటోందని…”
మార్చి పాడుకోవాలి.

ఇసుకవేస్తే రాలని జనం పాత సామెత.
ఇసుకవేస్తే రాలకుండా పట్టుకునే రోజులొచ్చాయి.
అయినా జనమున్నారో లేదో చూడడానికి బంగారంలాంటి ఇసుకను చల్లే అమాయకులెవరూ లేరిప్పుడు.

ఇన్నిన్ని ఇసుక కష్టాలను చూసిన భారత శాస్త్ర విజ్ఞాన సంస్థ- ఐఐఎస్‌సి శాస్త్రవేత్తలు బెంగళూరులో మట్టిని, కార్బన్ డై ఆక్సయిడ్ ను కలిపి కొత్త రకం ఇసుకను ఆవిష్కరించారు. బలంలో, మన్నికలో ఈ కృత్రిమ ఇసుకను పరీక్షించారు. సాధారణ ఇసుక కంటే ఇరవై శాతం ఎక్కువ బలం ఉన్నట్లు, దీన్ని వాడితే సిమెంట్ వినియోగాన్ని ముప్పయ్ శాతానికి పైగా, ఇసుక వాడకాన్ని యాభై శాతానికి పైగా తగ్గించవచ్చు అని ప్రయోగాల్లో రుజువయ్యింది.

మరిన్ని చోట్ల ప్రయోగాత్మకంగా వాడి… భారీ ఎత్తున ఈ కృత్రిమ ఇసుకను తయారు చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

దేశంలో ఇసుక దోపిడీ వల్ల నామరూపాల్లేకుండా పోయిన… పోతున్న… పోబోయిన నదులకిది చల్లని వార్త. ఇసుక దోపిడీ మీద ఆధారపడ్డ ఇసుకాసురుల గుండెల్లో రైళ్లు పరుగెత్తే వార్త. నది బతికితే కొన్ని తరాలకు తరాలు పచ్చగా బతుకుతాయని నమ్మేవారందరికీ మంచి వార్త…… పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions