ఉల్లి పరక లేదా ఉల్లి ఆకు లేదా ఉల్లి కాడలు… ఇంగ్లిషులో స్ప్రింగ్ ఆనియన్… ఈమధ్య దీనిపై జనం ఆసక్తి బాగా పెరిగింది… సాధారణంగా చైనీస్ తరహా వంటకాల్లో ఎక్కువ వాడుతుంటారు… రెస్టారెంట్లలో సూప్స్, నూడుల్స్, సల్సా ఫ్రైడ్ రైస్, సలాడ్లలో వీటి వాడకం ఎక్కువ… ఇప్పుడు కూరల్లో కూడా విరివిగా వేస్తున్నారు… నిజానికి ఇది ఎందుకు మంచిది..? అసలు మంచిదేనా..? ఆరోగ్యానికి శ్రేయస్కరమేనా..?
కరోనా తగిలితే కదా అందరికీ ఇమ్యూనిటీ అవసరం ఏమిటో యాదికొచ్చింది… ఇమ్యూనిటీ పేరిట మందులోళ్లు-మాయలోళ్లు ఏవేవో కొనిపించారు, తినిపించారు… సహజసిద్ధంగా ఇమ్యూనిటీని పెంచుకునే వంటలు, పద్ధతుల్ని మాత్రం ఏ మీడియా చెప్పదు… విటమిన్ డి కోసం ఎండ, విటమిన్ సి కోసం జామకాయ వంటి సులభ చిట్కాలు చెప్పరు… కరోనాకు తోడు ప్రతిచోటా సుగర్, బీపీ, ఒబెసిటీ పెరిగిపోయాయి… కొలెస్ట్రాల్ సమస్య, గుండెపోట్లు సరేసరి…
ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో సుగర్ సమస్య మరీ ఎక్కువ… అందుకే అన్నం మానేసి రొట్టెలు తింటున్నారు… ఓన్లీ గోధుమ రొట్టెలకు బదులుగా చాలామంది మల్టీ ఆటా వాడుతున్నారు… అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, గోధుమలు, ఇంకేమైనా చిరుధాన్యాలు కలిపి మరపట్టించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవడం… మామూలు కూరలకు బదులు ఎక్కువగా ఆకుకూరలకు మళ్లుతున్నారు… మెంతికూర, పాలకూర, బచ్చలికూర, గంగవాయిల్ కూర ఎట్సెట్రా… తగు పోషకాల కోసం పప్పు కలుపుకుని మరీ…
Ads
వరి పిండి రొట్టెలు చేసుకునేవాళ్లు చాలాసార్లు ఉల్లిగడ్డ మిరం చేసుకుంటారు… కాంబినేషన్ అదుర్స్… ఈ ఉల్లికాడలు అందులో ఇందులో వేయడం కాదు, అసలు దాంతోనే కూర చేస్తే..? సూపర్… ఆరోగ్యం, రుచి..! వంట సరిగ్గా కుదరాలే గానీ బేజా ఫ్రై రుచిని ఇస్తుందంటాడు చెఫ్ సంజయ్… ఇంకేం..? అవును గానీ, ఆరోగ్యానికి అంత మంచిదా..?
ఎస్, మంచిదే… కార్బొహైడ్రేట్స్ , ఫ్యాట్, కేలరీస్ దాదాపు జీరో… కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం విటమిన్ సీ అధిక పాళ్లలో ఉండటం వల్ల…
- విటమిన్ సి… తెల్లరక్తకణాల వృద్ధి, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి
- పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల బీపీ అదుపు
- యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మధుమేహం రోగులకు ఉపయోగం
- హానికర ఫ్రీరాడికల్స్ తొలగింపుతో కేన్సర్ రిస్క్ తగ్గించగలదు
మరి ఘాటు ఎక్కువ కదా అంటారా..? కాకరలో చేదును, బెండలో జిగటను మాయం చేయగా లేనిది ఉల్లికాడల్లో ఘాటును తగ్గించలేమా..? నిమ్మతో పులుపును, బెల్లంముక్కతో తీపిని కలిపితే సరి… అయితే నానా వీడియోల్లో చెప్పినట్టు ఏవేవో ఇంగ్రెడియెంట్స్ వేసి ఆ ఒరిజినల్ ఉల్లి ఆకు రుచిని చెడగొట్టకండి… ఉన్నంతలో సులభంగా, తక్కువ సరుకులతో వండేయాలి… ఈమధ్య కొందరు చట్నీలు కూడా చేస్తున్నారు…
రొట్టెలకే కాదు, అన్నంలోకి కూడా టేస్ట్‌ఫుల్లే… ఎటొచ్చీ వీటిని కట్ చేయడానికే టైమ్, శ్రమ… దిగువన ఓ చెఫ్ చాలా ఈజీ మెథడ్ చూపించాడు… ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు… కానీ ఒరిజినల్ టేస్ట్ పోకుండా చూశాడు… థికెనింగ్ కోసం కాస్త శెనిగెపిండి వేశాడు… అంతే… కొందరైతే వీటిని కడిగి, అలాగే కాస్త నూనె వేసి, కాస్త ఉప్పూకారం వేసి కాల్చి, మంచింగ్ స్నాక్స్‌లా లాగించేస్తున్నారు… అది మీ ఇష్టం, మీ రుచి…
Share this Article