ఇంకేముంది..? అంతా అయిపోయింది..? జగన్ రాజీపడ్డాడు… నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తాం అని చెప్పాడు… సుప్రీంకోర్టు తలంటిది కదా, ఇక తప్పలేదు… అన్ని దారులూ మూసుకుపోయాయి… కొద్దిరోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు… ఇక ఎన్నికలు జరగడమే తరువాయి… ఇక ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే… ఈ ఎన్నికలైపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు, కథ కంచికి, మనం ఇంటికి………….. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు… సారీ, అసలు కథ ఇప్పుడే స్టార్టయింది… కసికసిగా ఉన్న నిమ్మగడ్డ ఇక సినిమా చూపించబోతున్నాడు… జగన్‌కు లేదా చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌కు ఏదో నష్టం జరగనుందని కాదు… కాకపోతే తల్నొప్పులు ఇప్పుడే రాబోతున్నయ్… ఆ సూచనలు కూడా అప్పుడే స్టార్టయ్యాయ్ కూడా… అందుకే… అయ్యా, సారూ, మమ్మల్నేం చేయమంటారో మీరే చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త ట్విస్ట్ ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తోంది… వేక్సినేషన్ పనిచేయమంటారా..? ఎన్నికల్లో మునగమంటారా..? ఏదో ఒకటే చేయగలం, ఏం చేయాలో మీరే చెప్పండి, వేక్సినేషన్ ఫస్ట్ ప్రయారిటీ అని ఆదేశించారుగా, ఇప్పుడేం చేయమంటారు అని చీఫ్ సెక్రెటరీ కేంద్ర కేబినెట్ సెక్రెటరీకి లేఖ రాయడంతో ఇక అసలు కథ స్టార్టయినట్టే…
‘‘రెండూ చేయండయ్యా’’ అని కేబినెట్ సెక్రెటరీ కోర్టు తరహాలోనే చెప్పాడు అనుకుందాం… మరి మాకు తగిన స్టాఫ్ లేరు, మీరే సర్దండి అని కోరుతుంది జగన్ సర్కార్… ఎన్నికలే ప్రయారిటీ అని కేంద్రం చెప్పలేదు, అలాగని వేక్సినేషనే ప్రయారిటీ అని కూడా చెప్పేలా లేదు… ఈలోపు నిమ్మగడ్డ రమేష్కుమార్కే ఏదో డౌటొచ్చింది… ఈ ఉద్యోగసంఘాలు ఎలాగూ సహకరించేట్టు లేవు… ఇప్పటికి ఎన్నికల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నయ్… పోలింగ్ దిశలో చేయాల్సినవి బోలెడు పనులున్నయ్, వీళ్లసలు వేగంగా తాను ఆదేశించినట్టు పనిచేస్తారా..? పోలీసులు సహకరిస్తారా..? అందుకని తానూ లేఖ రాశాడు… కేంద్ర బలగాలు కావాలి నాకు, స్టాఫ్ కూడా కావాలి నాకు అని…! కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి… ఎహెపో, మీ కష్టాలేవో మీరు పడండి అని వదిలేస్తుందా..? ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి….
Ads
- బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, వోటర్ల జాబితాల దగ్గర నుంచి కీలకమైన పనులేమీ స్టార్ట్ కాలేదు… ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీల్లోపు ఈ పనులు అవుతాయా..? ఆమేరకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందా..? ఆశించిన మేరకు పనులు సరిగ్గా సాగకపోతే అప్పుడు నిమ్మగడ్డ ఏం చేయాలి..? కొరడా పట్టుకుని ఎందరు కలెక్టర్ల మీద వేటు వేయగలడు..?
- ఇప్పుడు ఆల్రెడీ రెండు జిల్లాలను ఎన్నికల ప్రక్రియ నుంచి మినహాయించినట్టున్నారు… మిగతా జిల్లాల్లో సన్నద్ధత ఎంత అనేది ఎవరికీ తెలియదు… అన్నింటికీ మించి ఇప్పుడు రెండు జిల్లాల కలెక్టర్లు, ఓ అర్బన్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లను బదిలీ చేయాల్సిందే అని ఎస్ఈసీ కరాఖండీగా చెబుతోంది… నిన్నటిదాకా వ్యతిరేకించిన ప్రభుత్వం ఇక చేయకతప్పదా..? చేస్తుందనే అనుకుందాం…
- పంచాయత్‌రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌ను నిమ్మగడ్డ బదిలీ చేసినట్టు నిన్నంతా సోషల్ మీడియా కూసింది… ధ్రువీకరణ లేదు కానీ బదిలీ చేసినట్టు ఇద్దరు మంత్రులు చెప్పారు… ఎలాగూ నిమ్మగడ్డ బదిలీ చేస్తాడని భావించి జగన్ సర్కారే ఇజ్జత్ కాపాడుకోవడానికి వాళ్లను బదిలీ చేసిందని ఆంధ్రజ్యోతి రాస్తోంది… సో… ఇదే జరిగితే, వాళ్ల స్థానాల్లో వేరేవాళ్లను నియమించి, వాళ్లు పగ్గాలు చేపట్టి, కార్యరంగంలోెకి దిగేసరికి మరికొన్ని రోజులు వేస్టయిపోతాయి… అప్పుడే అయిపోదు కదా… ‘‘విచిత్రంగా ఎన్నికల సంఘమే ఆ బదిలీని వ్యతిరేకించవచ్చు కూడా…’’ కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం కీలకమైన బదిలీలు చెయ్యకూడదు కాబట్టి…
- ఎక్కడ ఏ చిన్న జాప్యం జరిగినా ఈయన ఢాంఢూం అంటూ చర్యలు మొదలుపెడితే, యంత్రాంగం డిమోరల్ అయిపోయి మొత్తానికే కాడి కింద పడేస్తే, చిక్కుముడి మరింత బిగుసుకునే ప్రమాదముంది…
- పాత ఏకగ్రీవాల్ని రద్దు చేయాలనేది వైసీపీయేతర పార్టీల డిమాండ్… అది చేయడం కుదరదు, పైగా ఆ పాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అలాగే ఆపేసి, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చారు… నిన్న షెడ్యూల్ కాస్త మార్చారు… మరి పాత ప్రక్రియ, ఫలితాల సంగతేమిటో ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది…
- తనకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ తన ఆఫీసులోనే పలువురిని రిమూవ్ చేశాడు… మానిటరీ బెనిఫిట్స్నూ కోసేశాడు… ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనర్ చేస్తుందా..? అసలు ఈ నియామకాలు, తొలగింపులపై ఎస్ఈసీకి అధికారం ఉందా..? ఇప్పుడు ఇంకా తనకు స్టాఫ్ కావాలి..? అడిగిన వెంటనే అంతమందిని రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేస్తుందా..? ఇలా చాలా ఇష్యూస్ రాబోతున్నయ్… సో, అభీ పిక్చర్ బహుత్ బాకీ హై సర్కార్… అవునూ, అప్పట్లో ఏదో సీఐడీ కేసు పెట్టినట్టున్నారు, అది ఏమైంది మాస్టారూ..? తూచ్ అన్నట్టేనా…!!
Share this Article