1978 లోకి వచ్చేసాం … అనార్కలి మీద చాలా భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి … 1978 లో వచ్చిన ఈ అక్బర్ సలీం అనార్కలి కధా రచన , స్క్రీన్ ప్లే , దర్శకత్వం యన్టీఆరే వహించారు.. . బాగా ఆడలేదు … ప్రేక్షకులకు నచ్చలేదు … కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్లు , ఈ సినిమా వైఫల్యానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి .
1960 లో మొఘల్ ఎ ఆజం టైటిల్ తో ఒక హిందీ సినిమా వచ్చింది . అందులో అక్బరుగా పృధ్వీరాజ్ , సలీంగా దిలీప్ కుమార్ నటించారు . ఆ పృధ్వీరాజ్ పాత్ర , ఆయన మాట్లాడిన తీరు యన్టీఆర్ బుర్రలో బాగా పడినట్లుగా ఉంది . ఆయనలాగా డైలాగులను చెప్పిన తీరు ఒక ప్రేక్షకుడిగా నాకూ నచ్చలేదు . బహుశా చాలామంది ప్రేక్షకులకు కూడా నచ్చి ఉండదు …
ఆ తర్వాత 1955 లో అంజలీ పిక్చర్స్ బేనరుపై వచ్చిన మన తెలుగు అనార్కలి . బ్రహ్మాండంగా హిట్టయింది . ఆదినారాయణ రావు గారి సంగీతం , పాటలు , యస్వీఆర్ – అంజలీదేవి – అక్కినేనిల నటన ప్రేక్షకుల బుర్రల్లో ఇంకా ఫ్రెష్ గానే ఉంది . 1955 కి 1978 కి 23 ఏళ్ళేగా ! ప్రేక్షకులు అంజలీదేవి అనార్కలితో పోల్చుకోవడంతో ఇంకా పలచబడిపోయింది . మొత్తం మీద యన్టీఆర్ సినిమా జనానికి ఎక్కలేదు …
Ads
పాటలు , మాటలు అన్నీ సి నారాయణరెడ్డి గారే వ్రాసారు . సి రామచంద్ర సంగీత దర్శకత్వంలో సిపాయీ ఓ సిపాయీ పాట ఒక్కటే బాగా హిట్టయింది . మహమ్మద్ రఫీ , సుశీలమ్మ పాడారు . మిగిలిన పాటలన్నీ థియేటర్లో శ్రావ్యంగానే ఉన్నా బయట హిట్ కాలేదు . ప్రేమిస్తే తప్పంటారా , మదన మోహనుడే వంటి పాటలు శ్రావ్యంగా ఉన్నాయి .
సలీంగా బాలకృష్ణ , అనార్కలిగా దీప , జోధాగా జమున , తాన్సేనుగా గుమ్మడి , గుల్నారుగా మాధవి , జోధా మేనల్లుడుగా శ్రీధర్ నటించారు . యూట్యూబులో సినిమా లేదు కానీ పాటల వీడియోలు ఉన్నాయి . యన్టీఆర్ , బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు .
1953 లో ఒక అనార్కలి సినిమా హిందీలో వచ్చింది . అందులో సలీంగా ప్రదీప్ కుమార్ , అనార్కలిగా బీనారాయ్ నటించారు . ఈ సినిమా , మొఘల్ ఎ ఆజం రెండూ యూట్యూబులో ఉన్నాయి . రెండూ బాగా హిట్టయిన సినిమాలే .
అలాగే 1955 లో హిట్టయిన మన తెలుగు అనార్కలి సినిమా కూడా యూట్యూబులో ఉంది . క్లాసిక్ . చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమా . 1966 లో మళయాళంలో కూడా ఒక అనార్కలి సినిమా వచ్చింది . అందులో ప్రేమ నజీర్ , కె ఆర్ విజయ నటించారు . ఈ సినిమా కూడా యూట్యూబులో ఉంది . ఇదీ హిట్టయింది .
Zee 5 లో Taj : Divided by blood అని వెబ్ సెరీస్ వచ్చాయి . నసీరుద్దీన్ అక్బరుగా , అదితి అనార్కలిగా నటించారు . మనం వినే కధకు ఈ వెబ్ సిరీస్ కధకు చాలా తేడా ఉంది . ఇవీ అనార్కలి సినిమాలు . ప్రేమ చరిత్రల్లో మరచిపోలేని స్థానం అనార్కలికి దక్కింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article