గుర్తుకొస్తున్నాయీ … గుర్తుకొస్తున్నాయీ … (… By… రంగావఝల భరధ్వాజ)
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు గురించి గొడవ జరుగుతోంది కదా … నాకు ఎన్టీఆర్ సిఎంగా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.
ఇది వర్మగారికీ … ఇతరులకీ తెల్సి చావదని చెప్పడం లేదుగానీ .. గుర్తుందో లేదో అని సరదాగానే చెప్పేడుస్తున్నా …
హోటళ్ల వారు జనాలను దోచుకుతినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఎవరికీ తెలియదు. ఆయనకి అనిపించింది అంతే … టిఫెన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫెన్ చేసేస్తున్నారనేది ఆయనకు ఓ ఒపీనియన్ను ఫామయ్యింది.
అంథే … ఆయన హోటల్ లో ఏ టిఫెన్ ఎంతకి అమ్మాలో ఓ రేటు నిర్ణయించి జీవో విడుదల చేశారు.
ఇడ్లీ ప్లేటు పది పైసలకన్నా ఎక్కువ అమ్మరాదు. దోశ పదిహేను పైసలు పూరీ పదిహేను పైసలు మసాలా దోశ ఇరవై పైసలు … ఇలా రేట్లు పెట్టారాయన. ఒక ఫుల్ మీల్స్ రూపాయికే పెట్టాల … ప్లేటు మీల్స్ అర్ధ రూపాయికే పెట్టాల … ఇది జీవో సారంశం…
ఒక్కసారి హోటళ్లోళ్లు గగ్గోలు పెట్టారు. హోటళ్లు కిక్కిరిసిపోయేవి. జనం రామారావు భలే చేశాడని ఇళ్లళ్లో వంటలు మానేసి మరీ హోటళ్ల వాళ్లని తినేయడం మొదలెట్టారు.
మా టిఫెను మా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటాం, డిమాండ్ అండ్ సప్లై అని థియెరీ చెప్పడానికి ఏ వర్మగారూ అప్పుడు ప్రయత్నం చేయలేదు పాపం…
బహుశా అప్పుడాయన బెజవాడ కామయ్యతోపు దగ్గర హోటళ్లల్లో ఎన్టీఆర్ రేట్లకు టిఫెన్లు, భోజనాలు తినేసి ఎంజాయ్ చేసి, జై ఎన్టీఆర్ అనేసుకుని ఉంటారు.
నేను మాత్రం అప్పుడు కారణాంతరాల వల్ల ఒంగోలు పట్టణంలో … రాజా పానగల్ రోడ్డులో ఉండేవాణ్ణి.
రూమ్ లో వంట మానేసి, స్టవ్వు గివ్వు తీసి పడేసి, హోటళ్ల మీద దాడి చేయడంలో నిమగ్నమైపోయేవాడ్ని.
ఇట్టా కొంత కాలం గడిచాక ….
అప్పుడు హోటళ్ల వాళ్లందరూ బస్సులేసుకుని అబిడ్స్ లో ఎన్టీఆర్ ఇంటికి పోయి … వారి కాళ్ల మీద పడి అయ్యా … ఇది న్యాయమా … చచ్చిపోతామయ్యా అని బావురుమన్నారు.
అన్నగారు …
విష్ణు మూర్తి లెవెల్లో అభయం ఇచ్చి …
సర్లే, మీకో చిన్న సవరణ చేస్తాను … అని … ఉదయం ఆరింటి నుంచీ ఎనిమిదింటి వరకూ నా టైమ్ … అప్పుడు టిఫెన్ నా రేటుకే అమ్మాల … ఆ తర్వాత మీ టైమ్ … మీ ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకోండి …. అలాగే పన్నెండు గంటల నుంచీ రెండు గంటల వరకూ భోజనం నా రేటుకే అమ్మాల … రెండు తర్వాత మీ రేటుకు అమ్ముకోండి అని చెప్పి వారిని పంపేశారు.
అప్పుడు …. మాలాంటోళ్లం ఏం చేసేవాళ్లం అంటే .. ఒరే ఎన్టీఆర్ టైమ్ అయిపోతుంది, పదండి టిఫెన్ చేసేసి, వచ్చి పడుకుందాం … ఎన్టీఆర్ టైమ్ అయిపోతుంది, పదండి భోంచేసి వచ్చేద్దాం అని తొందర తొందరగా తినేసి వచ్చేసేవాళ్లం.
నిజానికి మొదట్లో ఆయన భోజనంలో వడ్డించే కూరలు ఎలా వండాలో కూడా ఒక ఫార్మెట్ పంపాడు హోటళ్ల వాళ్లకి… అలా వండకపోతే హోటల్ సీజ్ చేస్తా అని బెదిరించాడు.
ఇలా కొంత కాలం అయ్యాక మళ్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడి …. ఆయన్ని ఒప్పించి ఆ జీవోని ఉపసంహరింపచేశారనుకోండి … (కొన్నాళ్లు హోటళ్లలో జనరల్ సెక్షన్, జనతా సెక్షన్ అని విడివిడిగా ఉండేవి… జనతా సెక్షన్‌లో ఎన్టీఆర్ రేట్లు ఉండేవి… వంటలకు నిర్ణీత ప్రామాణికాలు కూడా పెట్టారు, అంటే ఇడ్లి సైజు, అన్నం క్వాంటిటీ ఎట్సెట్రా…)
అలాగే … రామారావుగారికి రాష్ట్రం మొత్తం మీద ఆరో ఏడో సినిమా హాళ్లు ఉండేవి …
హైద్రాబాదులోనే మూడు హాళ్లు ఉన్నాయి. బెజవాడలో రెండు … తెనాలిలో ఒకటి ఉండేవనుకుంటా …
అలాగే ఒకటి రెండు థియేటర్లలో ఆయన భాగస్వామ్యం ఉండేది. అలాంటి సమయంలో … మేనేజర్లు తనకు సరిగా డబ్బులు పంపడం లేదని ఆయనకి అనుమానం ఉండేదనుకుంటా …
అంటే అప్పట్లో ఏం జరిగేదంటే … ఒకే టిక్కెట్టు మీద పది మందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వంద మందికి పది టిక్కెట్లే తెంపి … వాటికే టాక్స్ కట్టేవారు.
ఈ విషయం తెల్సిన అన్నగారు సిఎం అయినప్పుడు …
స్లాబ్ సిస్టమ్ పెట్టడమే కాక టిక్కెట్ల రేట్లు తగ్గించమని కూడా ఆదేశాలు జారీ చేశారు.
సినిమా పరిశ్రమ నుంచీ ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు పోయింది. అందులో దాసరి నారాయణరావుగారు కీలకం.
ఏమిటి సమస్య అన్నారు దాసరిని ఉద్దేశించి ఎన్టీఆర్.
అయ్యా ఎగ్జిబిటర్లు బావురుమంటున్నారు అన్నారు దాసరి …
దాసరి గారూ … రాష్ట్రంలో నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే, వాడు బాధ పడుతుంటే, వాణ్ణి పట్టుకురండి … వింటాను అని పంపేశారు.
అలా అన్నగారు పెట్టిన స్లాబు పద్దతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేశారు. ఆయన స్లాబు తీసేస్తూ … టిక్కెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చారు.
డెబ్బై రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ ను యాభై కి తగ్గించారు వైఎస్.
ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండే … తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ఆర్ధికంగా అండగా నిల్చిన ఓ బెజవాడాయనకి … రెండు థియేటర్లు ఉండేవి … వాటిలో టిక్కెట్ల రేట్లు పక్క థియేటర్ల కంటే కాస్త పెంచి వసూలు చేస్తేనే అన్నగారు క్షమించలేదు.
ఆయన్ని పిల్చి తగ్గించమని వార్నింగ్ ఇచ్చి మరీ తగ్గించేలా చేశారు.
ఈ విషయాలు కూడా టీవీల్లో మాట్లాడుకునేవాళ్లు మాట్లాడుకోడానికి బావుంటుందని చెప్తున్నా …
ఇక … మన సినిమా దర్శకుడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని గారికి పది ప్రశ్నలు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.
అందులో … మీ ప్రజలు అంటూ ఆయన అనడం దారుణమైన వెటకారమూ దుర్మార్గమూ …
ఎకనమిక్ రిఫార్మ్స్ తర్వాత … ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి అనే విషయం వర్మకు తెలియదా?
విద్య వైద్యం లాంటి కీలక రంగాలనుంచే నిష్క్రమిస్తున్న ప్రభుత్వాలు రేషన్ థియేటర్లు పెట్టి ప్రజలకు సబ్సిడీతో సినిమాలు చూపించాలనడం ఎంత దుర్మార్గం. ప్రభుత్వాలు చూపిస్తాయా? ఏదో డ్రామా ఆడుతున్నాయిగానీ …
ఉన్న సబ్సిడీలు పీకేస్తున్న సందర్భంలో … కొత్త సబ్సిడీలు ఏడ్నించి ఇస్తాయనుకుని … ఆ మాట వాడారాయన.
సబ్సిడీలు ఎత్తేస్తున్న విషయం ఆయనకి తెలియదా?
అంచేత … ఈ విషయాలన్నీ కూడా పరిగణనలో ఉంచుకుని మాట్లాడితే మరింత సరదాగా ఉండుద్ది కదానీ … రాస్తున్నాను తప్ప నాకెందుకమ్మా ఎవరెట్టాపోతే …
Ads
Share this Article