Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా… ఫాఫం జయప్రద, ఎన్టీయార్ ఇనుపలవ్వు…

October 4, 2024 by M S R

ఏమని వర్ణించను ఈ సినిమా గురించి ! నా మిత్రులు ఒక్కొక్కరు ఒక్కో థీసిస్ వ్రాస్తారు . అయినను ప్రయత్నించెదను . అడవిరాముడు వీర మాస్ అయితే ఈ యమగోల ఊర మాస్ . 1977 యన్టీఆర్ ఇయర్ . 28 సెంటర్లలో వంద రోజులు అడింది .

మన తెలుగోళ్ళకు యముడంటే చాలా ఇష్టం . ఆయన సినిమాలన్నీ హిట్టయ్యాయి . 1960 లో దేవాంతకుడు , 1994 లో యమలీల , 1977 లో ఈ యమగోల , 1988 లో యముడికి మొగుడు , 2007 లో యమదొంగ , 2012 లో అల్లరి నరేష్ యముడికి మొగుడు . ఇంకా ఏమయినా ఉన్నాయేమో !

ఈ యమగోల సినిమాకొస్తే దీని నిర్మాత యస్ వెంకటరత్నం సుడి గురించే చెప్పాలి . వద్దంటే డబ్బు . బెంగాలీలో హిట్టయిన సినిమా యమాలయే జీవంత మానుష్ ఆధారంగా తీయబడింది మన యమగోల. నిర్మాత అదృష్టం ఏమిటంటే ఈ కధను డి వి నరసరాజు గారికి అప్పచెప్పటం . అద్భుతంగా పంచభక్ష్య పరవాణ్ణాలతో (పరమాన్నాలతో) వండారు . ఈరోజుకీ ఈ సినిమాలో డైలాగులు ఆ తరం జనం నోట్లలో నానుతూనే ఉన్నాయి . దర్శకుడు తాతినేని రామారావు .

Ads

ఈ సినిమా వీర విజయానికి మరో కారణం చక్రవర్తి సంగీతం . ఈ సినిమాలో పాటలు , NTR- జయప్రద గంతులు , జయమాలిని డాన్స్ , మంజు భార్గవి- ఉమాభారతి- మధుమతిల స్వర్గలోక నృత్యం భళాభళీ . ఉమాభారతి గారు నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్ కూడా . ఒకసారి ఆమె వ్రాసారు . NTR తో ఈ డాన్సులో నటించటం తన అదృష్టమని . ఈ స్వర్గలోక నృత్యం మహాద్భుతమైన నృత్యం . మంజుభార్గవి చాలా బాగా నృత్యించారు .

ఆడవె అందాల సురభామిని పాడవె కళలన్ని ఒకటేనని . హేట్సాఫ్ టు వేటూరి . ఇంత మర్యాదగా వ్రాసిన వేటూరే గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను ఊర మాస్ పాట కూడా వ్రాసారు . ఆయన కలానికి రెండు పాళీలు ఉన్నాయి . ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ! తిక్కా తిమ్మిరి రెండింటినీ వదలేలా వాయించేసాడు యన్టీఆర్ . ఎన్ని రోజులు కాపు పెట్టించుకుందో జయప్రద ! వేటూరి వారి పాటే మరొకటి చిలక కొట్టుడు కొడితే . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట వయసు ముసురుకొస్తున్నది .

శ్రీశ్రీ వ్రాసిన ఎర్ర పాట సమరానికి నేడే ఆరంభం . ఆరోజుల్లో యమగోల గురించి చాలామంది ఆశ్చర్యపోయింది ధైర్యంగా ఎమర్జెన్సీ మీద , సంజయ్ గాంధీ మీద వ్యంగ్యాస్త్రాలను వదలటం . అవి బాగా పేలటం .

ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది యముడి పాత్రలో సత్యనారాయణని , ఆయన జోడీ చిత్రగుప్తునిగా అల్లు రామలింగయ్య . యముండ అంటూ తెలుగు వారి యముడు అయిపోయారు సత్యనారాయణ . యస్వీఆర్ని మరిపించారు . అది యముడయినా ఘటోత్కచుడు అయినా . జోహార్ . మరో నటి గురించి ముతగ్గా అనిపించినా గుర్తుకు తెచ్చుకోవలసింది ఛాయాదేవినే . యముడికి లైన్ వేయటానికి చాలా తిప్పలు పడుతుంది . రావు గోపాలరావు విలనీ తెలుగు సినిమా రంగంలో పాతుకుపోయింది ఈ సినిమాతో . ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , ఝాన్సీ , ప్రభాకరరెడ్డి , తదితరులు నటించారు .

NTR . 55 ఏళ్ళ వయసులో , కాస్త భారీ సైజులో అంత చలాకీగా , వైబ్రెంటుగా , ఎనర్జిటిగ్గా నటించటం ఆ నటసార్వభౌముడికే చెల్లు . జయప్రదకు NTR తో ఇది రెండో సినిమా అనుకుంటా . రెండూ సూపర్ హిట్ కావటం ఆమె అదృష్టం . She deserves . చాలా ఓర్చుకుని ఉంటుంది . ఒళ్ళు హూనం అయిఉంటుంది . యన్టీఆరా మజాకా !

కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా

మూర తక్కువ చీర నీకు నిలువనంటుందా

బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా…. ఇలా సాగింది వేటూరి కలం…

హిందీలో లోక్ పరలోక్ గా రీమేక్ చేయబడింది . జితేంద్ర , జయప్రదలు నటించారు . తమిళంలో యమనుక్కు యమన్ టైటిల్ తో రీమేక్ అయింది . యముడి పాత్ర , హీరో సత్యం పాత్ర రెండింటినీ శివాజీ గణేశనే వేసారు . మన తెలుగు సినిమా లాగా సక్సెస్ కాలేదట .‌

28 సెంటర్లలో వంద రోజులు ఆడిన యమగోల ఆరు సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఆ ఆరింటిలో భీమవరం కూడా ఉంది . హైదరాబాదులో 40 వారాలు ఆడింది . ఎందుకాడదు !? సినిమాలో పాటలు , డాన్సులు థియేటర్లలో జనాన్ని గంతులేయించాయి . తెర మీదకు నాణాలు విసిరారు .

ఈ సినిమా చూడనివారు ఒకరూ అరా పాతికా ఎవరయినా ఉంటే యమ అర్జెంటుగా యూట్యూబులో చూసేయండి . పాటల్ని మాత్రం అస్సలు మిస్సవకండి . It’s all a musical and visual feast . Super duper cinema . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions