బడ్జెట్ అంటే స్థూలంగా ప్రభుత్వ ప్రయారిటీలను, వేసే అడుగులను సూచించేది… రాబోయే ఏడాదికి జమాఖర్చుల అంచనా… అంతేతప్ప, దాన్ని బట్టే నడవాలని ఏమీలేదు… జమాఖర్చుల వాస్తవ లెక్కలకు అసెంబ్లీ అప్రాప్రియేషన్ ఆమోదం పొందితే సరి… ఏదో రాజకీయ కోణంలో ప్రతి ప్రభుత్వమూ శాఖల వారీగా కేటాయింపులు చేస్తుంది… పత్రికలు, టీవీలు అసలు లోతుల్లోకి వెళ్లవు… బ్రహ్మపదార్థం వంటి బడ్జెట్ అంకెల్నే రాసేసి, చేతులు దులిపేసుకుంటయ్… కానీ బడ్జెట్ స్థూలంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని చెబుతుంది… నిన్నటి తెలంగాణ బడ్జెట్ కూడా అంతే… అది ప్రధానంగా చెప్పింది ఏమిటో తెలుసా..? మనం పదే పదే చెప్పుకునే మన ధనిక తెలంగాణ ఇప్పుడు నిలువునా అప్పుల్లో కూరుకుపోయి రుణతెలంగాణం అయిపోయిందీ అని…! రాష్ట్ర విభజన జరిగినప్పుడు 68, 70 వేల కోట్లు అప్పు ఉండేది… ఇప్పుడది 2.86 లక్షల కోట్లకు పోతోంది… ఆర్థిక క్రమశిక్షణ కట్టుబాట్ల నుంచి తప్పించుకోవడానికి, స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ) 25 శాతం దాటి రుణ పరిమాణం ఉండొద్దు కాబట్టి… ప్రభుత్వమే వివిధ కార్పొరేషన్ల పేరిట కూడా లోన్లు తెస్తోంది… అవి లక్ష కోట్లు అనుకుంటే… మొత్తంగా రాష్ట్రం ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అన్నమాట…
తెచ్చుకుంటే తప్పేముందీ అంటారా..? అవి క్రమేపీ రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరోగమనం వైపు నడిపిస్తయ్… రోజువారీ వ్యవహారాలకు కూడా రుణాలు చేయడం తప్పనిసరి… మన సొంత ఆదాయం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం 40 వేల కోట్లు తీసుకొస్తే… అవి పాత బకాయిలు, మిత్తీల చెల్లింపులకు సరిపోతయ్… మరి అంత ఆదాయం ఎలా..? సింపుల్… మళ్లీ అప్పులు చేయడమే… దాదాపు 45-50 వేల కోట్ల మేరకు అప్పులు తీసుకొస్తామని ప్రభుత్వమే బడ్జెట్లో చెబుతోంది… నిజానికి అప్పట్లో కేసీయార్ వాస్తవిక బడ్జెట్ అన్నాడు… మేఘాల నుంచి బడ్జెట్ అంచనాలను నేల మీదకు తీసుకొచ్చాడు… వాస్తవం, మనకు వచ్చే ఆదాయం ఎంత..? ఖర్చులు ఎన్ని..? ఏది మన ప్రయారిటీ..? ఈ కోణంలో పిండి కొద్దీ రొట్టె తరహాలో బడ్జెట్ పెట్టాడు ఓసారి… కానీ ఇప్పుడు మళ్లీ పాత బాటే… వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కదా, మరెందుకు ఇప్పుడు నేల విడిచి సాముకు సిద్ధపడ్డాడు..? తెలియదు…! పేరుకు 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్… అందులో 50 వేల కోట్ల కొత్త అప్పులు… 45 వేల కోట్ల ఆదాయ లోటు… మరెందుకీ అధిక అంచనాలు..? అంకెల గొప్పలు..? పోనీ, సంకల్పానికి దరిద్రం ఎందుకు ఉండాలీ అనుకుందాం… ఐనా మరీ ఇంతటి అధివాస్తవిక బడ్జెట్లా అవసరమా..? ఒకవైపు కరోనాతో లక్ష కోట్ల మేరకు నష్టపోయామని చెబుతూనే… ఈసారి కేంద్రం నుంచి వాటా తగ్గుతుందని అంటూనే… అంకెలరథాన్ని మళ్లీ ఇలా మబ్బుల బాట పట్టించడం దేనికి..? హేమిటో మరి..!!
Ads
Share this Article