వస్తే సంతోషం… ఒక భారతీయ సినిమాకు, టెక్నీషియన్లకు ఆస్కార్ అవార్డు వస్తే మస్తు ఖుషీ… అందులోనూ ఓ తెలుగు సినిమాకు వస్తే మరింత ఖుషీ… కానీ లాబీయింగ్, డొంకతిరుగుడు, డబ్బు ఖర్చు, మేనేజింగ్ థింగ్స్ అవార్డులను ప్రభావితం చేసే పక్షంలో వాటికి విలువ ఏముంటుంది..? ఆర్ఆర్ఆర్ విషయంలో జరుగుతున్నది ఇదే… రాజమౌళి అండ్ గ్యాంగ్ అక్కడే అడ్డా వేశారు…
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏ విభాగంలో కూడా ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ లభించలేదు… అదేదో చెల్లో షో అని గుజరాత్ సినిమాకు ఎంట్రీ వచ్చింది… అప్పటిదాకా ఆర్ఆర్ఆర్ మీద ప్రచారం సాగుతూ వచ్చింది… ఈ నిర్ణయంతో ఒక్కసారిగా పంక్చర్ పడినట్టయింది… రాజమౌళి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు… ఆస్కార్ పోటీలో ఎంట్రీకి ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ (ఎఫ్‌వైసీ) కింద దరఖాస్తు చేశాడు… ఒకటి కాదు, రెండు కాదు… ఒక్కసారి ఈ లిస్టు చదవండి…
Ads
అవార్డుల పోటీకి పంపించదగిన మరో కేటగిరీ ఏమీ మిగల్లేదు… వీటిని ప్రైవేటు ఎంట్రీలు అంటారు… అయితే చివరకు వీటిని అఫిషియల్ నామినేషన్ల జాబితాలో చేర్చితేనే అంతిమ పోటీలో ఉంటాయి… ఇన్ని కేటగిరీల్లో ఎంట్రీ కోసం లాబీయింగ్ చేశారు కదా… జస్ట్, ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరలో నాటునాటు పాట తప్ప ఇంకెవరూ సోదిలోకి లేకుండా కొట్టుకుపోయారు…
అసలు ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు, చాలా ఇండియన్ సినిమాలను ఇలా ఎఫ్‌వైసీ కింద దరఖాస్తు చేసుకున్నారు… వస్తే కొండ, పోతే వెంట్రుక… కాకపోతే రాజమౌళి బలమైన లాబీయింగ్ చేయగలిగాడు… మస్తు ప్రచారం చేసుకోగలిగాడు… ఎప్పుడైతే నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందో, ఇంకేముంది ఈ పాటకైనా అవార్డు గ్యారంటీ అనే వాతావరణం ఏర్పడింది… హాలీవుడ్ జర్నలిస్టుల సంఘం ఈ గోల్డెన్ గ్లోబ్ ఇస్తుంటుంది… సో, ఏదో స్మెల్ చేశారు, అందుకే అవార్డు ఇచ్చారు అనే ప్రచారం జరిగింది…
నిజంగానే ఆ ఒక్క కేటగిరీలో ఆ పాట తప్ప ఇంకేమీ ఇప్పుడు అధికారిక నామినేషన్ల జాబితాలో మిగల్లేదు… అదుగో ఎన్టీయార్‌కు ఆస్కార్ అన్నారు… అయ్యో, మన మా రాంచరణ్ మాటేమిటి అని తన ఫ్యాన్స్ బాధపడ్డారు… నిజానికి ఈ ప్రైవేటు ఎంట్రీలు, ఎఫ్‌వైసీ దరఖాస్తులు పెద్ద మాయ… మన ఇండియన్ సినిమాలను ఆ తెల్ల జాతీయులు అస్సలు దేకరు… ఒక వివక్ష కనిపిస్తుంది… బేసిక్‌గా రాజమౌళి ఈ నిజాన్ని గమనించలేదు… పైగా ఇవన్నీ ప్రైవేటు ఎంట్రీలు… అవంటే వాళ్లకు చిన్నచూపు…
పైగా నాటునాటు టిపికల్ ఇండియన్ సినిమా పాట తెలుగు వాళ్లకు రుచిస్తుందేమో గానీ ఓ ఇంగ్లిష్ జడ్జికి అదెలా ఉంటుందో అర్థం చేసుకొండి… దాన్నెలా స్వీకరిస్తాడో అర్థం చేసుకొండి… ఐనాసరే, ఇప్పుడు ఆ పాటకు గనుక ఆస్కార్ వస్తే… అద్భుతం… పండుగ చేసుకుందాం… తప్పేముంది..? మన పాట అది… తప్పొప్పుల సంగతి తరువాత… అవార్డు వస్తే గుండెలకు హత్తుకుందాం…!!
Share this Article