రాదు, రాదు… ఏ పత్రికలోనూ పెద్దగా ఈ వార్త రాదు… కాదు, కాదు… ఏ టీవీలోనూ పెద్దగా ఈ వార్త కవర్ కాదు… ఎందుకంటే..? అందరికీ ఆప్తుడు… ఆర్థిక ఆప్తుడు… అందరినీ యాడ్స్‌తో కొడతాడు ప్రేమగా… జాకెట్ యాడ్స్, హాఫ్ జాకెట్ యాడ్స్, బ్రా యాడ్స్, స్లీవ్ లెస్ యాడ్స్, ఫుల్ స్లీవ్స్ యాడ్స్… రకరకాల యాడ్స్‌తో పత్రికలకు కరెన్సీ నోట్లు తొడుగుతాడు… టీవీలయితే ఏకంగా ఆయన గారి సక్సెస్ స్టోరీలు కుమ్మేస్తుంటాయి ఫ్రీక్వెంటుగా..! ‘డబ్బులు ఊరకే రావు, నేను చెప్పింది వినండి, అన్ని షాపులూ తిరగండి, మా షాపు రేట్లతో పోల్చుకొండి’ అని ఈ గుండు కిరణ్‌కుమార్ అలియాస్ లలిత జువెలరీ కిరణ్ చెబుతుంటే… హబ్బ, ఎంత బాగా చెబుతున్నాడో కదా అనుకుంటాం… నిజానికి బంగారం దందా అంటేనే ఓ పెద్ద మాయ… తరుగు, లేబర్, రేటు, క్యారెట్లు, కేడీఎం… అన్నింటికీ మించి ఆభరణాల్లో వాడే రాళ్లురప్పల రేట్లు, వాటి బరువు తేడాలు… వామ్మో, అది అర్థమైతే చాలా గొప్పోళ్లన్నమాట… అలాంటిది తమ వ్యాపారంలోని కథలే ఆయన చెబుతుంటే… తనే తెర మీదకు వచ్చి నీతులు చెబుతుంటే… ఇది కదా అసలైన ప్రమోషన్ వర్క్, తొక్కలో సెలబ్రిటీల మొహాలు చూపించి వ్యాపారం ఏమిటి..? ఓనరే, తన సరుకు నాణ్యత గురించి చెప్పడం కొత్త ట్రెండ్ కదా… వారెవ్వా ఈయన 24 క్యారెట్ల బంగారం అనుకుంటిమి… కానీ కాదట… కానే కాదట… ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది… చెప్పింది… ఆ వార్తే మనవాళ్లకు చేదువార్త అయిపోయింది… ఓ రాశామంటే రాశాం అన్నట్టుగా రాశారు కొందరు… కొందరు వార్తే రాయలేదు… కొందరు పేరు లేకుండా రాశారు… మన చైతన్య, నారాయణ కాలేజీలకు సంబంధించి వార్తల్ని కవర్ చేయడానికి గింజుకుంటారు కదా… అలాగన్నమాట…
‘‘కిరణ్ నిజానికి తెలుగువాడే… నెల్లూరులో పుట్టెను… ఓ మధ్యతరగతి కుటుంబం… చిన్నప్పుడే పస్తులుండలేక బంగారం పనిలో కుదిరెను… తరువాత మెల్లిగా మెళకువలు గ్రహించి, తల్లి బంగారు గాజులు అమ్మి తనే సొంతంగా వ్యాపారం ప్రారంభించెను… సొంతంగా దుకాణాలు ప్రారంభించెను…’’ అంటూ ఆయన సక్సెస్ స్టోరీని కథలుకథలుగా రాశాయి అన్ని పత్రికలూ… కావచ్చుగాక, చిన్నప్పటి నుంచీ కష్టపడి, లేమి నుంచి కలిమిలోకి వచ్చి ఉండవచ్చుగాక… కానీ తెర మీదకు వచ్చిన నీతులు చెప్పినంత ఈజీ కాదు బంగారం వ్యాపారం… అది ఓ పెద్ద దందా… పైగా ఏ బంగారం వర్తకుడూ ఇవ్వని రీతిలో ఈస్థాయి కోట్లకుకోట్ల యాడ్స్ ఇవ్వడం మీద చాలామందికి అనుమానాలున్నయ్… రెండుమూడేళ్ల క్రితం వరకు ఆయన టర్నోవర్ 15 వేల కోట్లు… దాన్ని ఏకంగా 50 వేల కోట్లకు తీసుకుపోవాలనేది తన టార్గెట్… ఎక్కడికి చేరుకున్నాడో తెలియదు గానీ మొన్న జరిగిన ఐటీ దాడుల్లో వందల కోట్ల నల్లధనం లెక్కలు, ఆధారాలు మాత్రం దొరికాయి… సో, ఇది 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఏమీ కాదు… ఇదీ కాకిబంగారమే అన్నమాట…
Ads
అది సరే… బంగారం వ్యాపారంలో ఇదంతా కామన్ అంటారా..? మరి ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఐటీ దాడులు జరిగినయ్..? ఎందుకంటే తమిళనాడు పోలింగు దగ్గరకొచ్చేసింది… సాధారణంగా బీజేపీ ఎన్నికల మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే..? ప్రత్యర్థి గ్రూపుల డబ్బు లావాదేవీల కేంద్రాల్ని మొదట గుర్తిస్తుంది… వాటిపై ఈడీ, ఐటీ టీములు దాడులు చేస్తయ్… చక్రబంధంలో ఇరికిస్తయ్… డబ్బు ప్రవాహాలకు అడ్డుకట్టలు పడతయ్… సేమ్, ఇక్కడా అంతే… లలిత జుయెలరీతోపాటు మరో ప్రముఖ బులియన్ ట్రేడర్ శివ సహాయ్ అండ్ సన్స్ సంస్థపైనా దాడులు జరిగినయ్… ఇంకా జరగొచ్చు కూడా… కానీ ఇలాంటివెన్ని చేసినా స్టాలిన్ విజయాన్ని అడ్డుకోలేకపోవచ్చు బీజేపీ… తమిళప్రజలు మార్పు కోరుకుంటున్నారు… అదేమైనా గానీ… బోలెడు సంస్థలపై ఇలా ఐటీ దాడులు జరుగుతూ ఉంటయ్ కదా… నిజంగా ఆకేసుల్ని లాజికల్ ఎండ్‌కు తీసుకుపోతారా..? భలేవారే… ఎంత అమాయకులండీ బాబూ…!!
Share this Article