నిజానికి రాహుల్ ప్రసంగంపై చాలామంది తటస్థుల్లో పెద్ద ఆశలేమీ లేకుండా ఉండింది మొదట్లో… కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రసంగాన్ని సరైన రీతిలో వెలువరించాడు రాహుల్… ఎక్కడా సందిగ్ధత లేదు… దాపరికం లేదు… కేసీయార్ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, ఇక అది చచ్చిపోయింది అనుకున్నాడు… కానీ కాంగ్రెస్ బతికే ఉందని, బతికే ఉంటుందని, జెండా మోసేవాళ్లకు కొదువ లేదని వరంగల్ సభ నిరూపించింది…
తెలంగాణ ఏర్పాటు ఎంత కష్టసాధ్యమైనా మేమే ఇచ్చామని చెప్పుకోవడం దగ్గర్నుంచి… మాకు ఓ అవకాశమివ్వండి, ఓ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా ఒకరకంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార నగారా మోగించేశాడు… అంతేకాదు, రేవంత్‌కు పగ్గాలు వేస్తూ, చికాకులు సృష్టిస్తూ, పార్టీ శ్రేణుల్ని అయోమయంలో పడేసే నాయకులకు ఓ హెచ్చరికగా… కొన్ని వ్యాఖ్యలు చేశాడు… అవి…
- టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు, ఉంటుందని ఎవరైనా ప్రచారం చేస్తే నిష్కర్షగా పార్టీ నుంచి బయటికి గెంటేస్తాం…
- బీజేపీతో ఒప్పందాల్లో ఉన్న నేతల్ని కూడా పార్టీ సహించదు, పార్టీ నుంచి బయటికి పంపించేస్తాం…
- రాబోయే రోజుల్లో టికెట్ల సంగతికొస్తే ప్రజల్లో ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తాం… మెరిట్ మాత్రమే ప్రాధాన్యత…
Ads
ఓ క్లియర్ కట్ సందేశం ఇచ్చాడు తను… ఎవరితోనూ పొత్తు ఉండదు… ఒంటరిగానే టీఆర్ఎస్‌తో పోరాడతాం… అసలు బీజేపీ-టీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో సాగుతున్నాయి… కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆడిస్తోంది, బీజేపీకి తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలుసు, అందుకే టీఆర్ఎస్‌తో లాలూచీ… అందుకే కేసీయార్ మోడీ తెచ్చిన నల్లచట్టాలకు మద్దతు పలికాడు అంటూ రాహుల్ ప్రసంగంలో పేర్కొన్నాడు…
సరే, ఇవన్నీ రాజకీయ ప్రసంగాలు, అవి వదిలేస్తే… రైతుసంఘర్షణ సభ అని పేరు పెట్టారు కాబట్టి… రైతులే లక్ష్యంగా సాగింది సభ… రెండు లక్షల రుణమాఫీ ఓ ప్రధాన వాగ్దానం… అన్నింటికీ మించి రేవంత్ చదివిన వరంగల్ డిక్లరేషన్‌లో కొన్ని మంచి పాయింట్లున్నయ్… అవి ఏయే పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మద్దతు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తుంది అని..! లోపాల పుట్ట ధరణిని రద్దు చేస్తామనేది మరో పాయింట్…
ధనిక రైతులకు, సాగుచేయని రైతులకు కూడా రైతుబంధు పేరిట కేసీయార్ ప్రభుత్వం వేల కోట్లను ఇస్తోంది… వ్యవసాయ నిపుణులు ఎన్నాళ్లుగానో చెబుతున్నారు… అవి కాదు, పంటలకు మంచి ధర ఇప్పించగలిగితే అదే రైతులకు పదివేలు అని… ధనిక, పేద అనికాదు, ఏ పంట అని కాదు… నిజంగా సాగుచేసి పంట పండించేవాడికి ప్రభుత్వం భరోసాగా నిలవగలిగితే, మంచి ధర ఇప్పించగలిగితే అదే అసలైన మద్దతు అని… కానీ కేసీయార్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది… కేసీయార్ నిర్లక్ష్యం చేసిన కౌలు రైతులను కూడా డిక్లరేషన్‌లో చేర్చారు… కాంగ్రెస్ ఇప్పిస్తాను అంటున్న ధరలు ఇవీ… అవి ఆచరణసాధ్యమా కదా అనేది పక్కనపెడితే… కనీసం ఓ పార్టీ బలంగా ఈ వాగ్దానాన్ని ప్రకటించడం అనేది శుభమే…
సరిగ్గా ఈ పాయింట్ల మీదే కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రూపొందించారు… రాహుల్ దానికి నాదీ గ్యారంటీ అని చెప్పడం ద్వారా ఆమోదముద్ర వేశాడు… ఇవన్నీ ఎలా ఉన్నా… ఇన్నేళ్లుగా కేసీయార్ కోవర్టుల సారథ్యంలో కునారిల్లిన కాంగ్రెస్‌కు ఓ కొత్త జోష్ తీసుకురాగలదు ఈ సభ… ఈ సభ నిర్వహణ ద్వారా రేవంత్ రెండు ప్రయోజనాలు సాధించగలిగాడు… 1) హైకమాండ్ తన పక్షాన ఉందని, తన కాళ్లల్లో కట్టెలు పెట్టే సెక్షన్‌కు క్లియర్‌గా చెప్పగలిగాడు… 2) ఓ భారీ బహిరంగసభకు రాహుల్‌ను రప్పించడం ద్వారా తనవి మాటలు కావనీ, ఆచరణలో తాను దూకుడుగా వెళ్తానని చెప్పగలిగాడు…
ఉస్మానియాలో రాహుల్‌ను అడుగుపెట్టనివ్వం అని ఎంత భీష్మించుకుంటేనేం..? ఏం ఆపగలదు ప్రభుత్వం..? కాంగ్రెస్ అంటే అదేమైనా కోదండరాం పార్టీయా..? తొక్కిపారేయడానికి..? ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ తొక్కేకొద్దీ పడగ విప్పుతాయి… వరంగల్ సభ చెప్పింది అదే…
మొన్నటి నుంచీ గమనిస్తే… ఎప్పుడైతే రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారైందో… అప్పటి నుంచీ టీఆర్ఎస్ దృష్టి బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లింది… తన విమర్శల్ని కాంగ్రెస్ వైపు మళ్లించింది… రేపు ఇంకా టీఆర్ఎస్ నుంచి దాడి తీవ్రతరం అవుతుంది… తద్వారా రేవంత్ సాధించిన మరో విజయం ఏమిటంటే… టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీ కాదు, కాంగ్రెసే అనే ఓ ఫీల్‌ను క్రియేట్ చేయగలిగాడు… వెరసి రాష్ట్ర రాజకీయం త్రికోణపోరు వైపు వేగంగా అడుగులు వేస్తోంది…!!
చివరగా :: రాహుల్ ప్రసంగం సరళమైన హిందీలోనే సాగింది… వరంగల్ సభకు వచ్చినవాళ్లలో అధికులకు ఏ అనువాదమూ అక్కర్లేకుండానే అర్థం అవుతుంది… కానీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబును అనువాదకుడిగా ఎంపిక చేయడం రాంగ్ చాయిస్… మనవి చేసుకుంటున్నాను అనే రొటీన్ ప్రసంగశైలిని సొంతంగా రుద్ది రాహుల్ స్పీచ్‌లో పంచ్ లేకుండా చేశాడు… తనే ప్రసంగిస్తున్నట్టుగా ఫీలయ్యాడు… దాసోజు శ్రావణ్ ఉంటే బెటర్‌గా ఉండేది…
Share this Article