Veerendranath Yandamoori……. అమాయక యువకుల్ని ఎలా ఉగ్రవాదులుగా మారుస్తారు? ఉగ్రవాదులు ఎందుకు అమాయకుల్ని చంపుతారు? రి-ప్రింట్ కి వచ్చిన ఈ పుస్తకంలో వివరణ ఉంది.
….
ఆ కుర్రవాడు టాంక్ బండ్ పై నిలబడి ఉన్నాడు. ఈ రాత్రికి ఏమవుతుంది? కొన్ని లక్షల లీటర్ల నీరు ఒక్కసారిగా నగరం మీద పడుతుంది. ఇందిరాపార్కు నుంచి చిక్కడపల్లి వరకూ కొట్టుకుపోతాయి. కనీసం పదివేలకు తక్కువ కాకుండా మరణిస్తారు. అదే రోజు దేశంలో ఒకే సారి వంద పట్టణాల్లో అలాంటి విధ్వంసాలే జరుగుతాయి. ఒక్కొక్క పట్టణంలో వేర్వేరు చోట్ల…! ఆ తరువాత ఏం జరుగుతుంది? ఊహించలేక పోయాడు.
ఈ చర్చ చాలాకాలం క్రితం అతడికీ, అతడి గురువైన ఒసామా బిన్ లాడెన్‌కి ఒకసారి వచ్చింది. “…ఇలా బాంబులు పెట్టి పాతిక అంతస్తుల భవనాలూ, విమానాలూ పేల్చేస్తే ఏం లాభం?’’ అని అడిగాడు.
‘‘శత్రువుకి షాక్ తగుల్తుంది’’ అన్నాడు ఒసామా. “…ఆ షాక్‌లో తప్పులు చేస్తాడు. ఇది ఒక అంశం. ఆ తరువాత పోరాటం ప్రారంభం అవుతుంది. శత్రువుకి వరుసగా నష్టాలు జరగటం ప్రారంభిస్తాయి. ఎవర్ని ఎదుర్కోవాలో తెలియదు. ఎవరు నష్టం కలిగిస్తున్నారో తెలీదు. ఆ అయోమయంలో ఏం చెయ్యాలో తోచక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. సైన్యాన్ని, పోలీసులనీ పోషిచటం కోసం కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. మరో వైపు కోట్ల ఆస్తి ధ్వంసం అవుతూ ఉంటుంది. అక్కడ శత్రువు బలహీనమయ్యే కొద్దీ ఇక్కడ మనం బలపడుతూ ఉంటాం’’.
‘‘ఎలా?’’
Ads
‘‘చాలా సింపుల్. మన గెలుపు ప్రచారం అవుతూ ఉంటుంది. మన మతం పట్ల నమ్మకం ఉన్నవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, పర్షియాలాంటి దేశాల్లో కోటికి పడగలెత్తిన వారున్నారు. ప్రాణాలకు తెగించి మనం చేస్తున్న ఈ కార్యాలకు, వారు లెఖ్ఖలేనంత ఆర్థిక సాయం చేస్తారు. మతస్థాపన ముఖ్యం! మతం విస్తరించాలి!! ఆ పనిని మనం చేస్తున్నామని వారికి నమ్మకం కుదరాలి!! అంటే మిగతా మతాల్ని కూలదొయ్యాలి. బుద్ధ విగ్రహాల్ని ధ్వంసం చెయ్యాలి. ముఖ్యంగా మన ప్రథమ శత్రువైన అమెరికానీ, ఆ తరువాత ఇండియాని…”
‘‘ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా?’’
‘‘అప్పటికి ప్రపంచమంతటా విధ్వంసం జరుగుతూ ఉంటుంది. ప్రజల్లో అభద్రతా భావం పెరిగేకొద్దీ గవర్నమెంటు పై నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. విసుగు ఎక్కువై ఎవరిమీదో తెలియని కసి పెరుగుతుంది! దాన్ని ఎవరి మీద తీర్చుకోవాలో తెలియదు. ఉదాహరణకి, తమ ప్రియతమ నాయకుడు హఠాత్తుగా మరణించాడనుకో. జనం పెట్రోలు బంకులు తగలబెడతారు. దీనికి లాజిక్ ఏమీ ఉండదు…! ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఉగ్రవాదం పెరిగేకొద్దీ ప్రజల అసహనం ప్రభుత్వం పైకి మళ్లుతుంది. ఆ విధంగా, ప్రపంచంలోని అన్ని దేశాలూ, విధ్వంసమవుతున్న తమ ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి సతమతమవుతూ ఉంటాయి’’ లాడెన్ ఒక క్షణం ఆగి చెప్పటం కొనసాగించాడు.
“…ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రజల్లో చాలామంది తటస్థులు. అంటే వీరు…‘గెలిచే’ వారివైపే ఉంటారు. వారి మనస్తత్వం అలాగే ఉంటుంది. కొత్తని వ్యతిరేకిస్తారు. అది కాస్త అలవాటవగానే గుంపులుగా ఎగబడతారు. ఈ ఉగ్రవాదంతో మనం గెలుస్తున్న కొద్దీ చాలామంది మనలో చేరతారు. తమకి భద్రత సమకూర్చలేని ప్రభుత్వాల మీద విరక్తి పెంచుకుని, ‘మతాని’కి ప్రాముఖ్యత ఇస్తారు. మతమొక్కటే తమని రక్షించగలదన్న భద్రతాభావంలోకి వస్తారు. క్రమక్రమంగా ప్రభుత్వాలన్నీ కూలిపోతాయి. ‘మతం’ రాజ్యమేలుతుంది. అలా కాని దేశాల్లో అలజడి సృష్టించటానికి మనమే మన ప్రతినిధుల్ని పంపిస్తాం. అప్పటికి మన దగ్గర అపారమైన ధనం ఉంటుంది. అపరిమితమైన సైన్యం ఉంటుంది. కాబట్టి ఏ దేశాన్నయినా సులభంగా గెలుస్తాం. మతాన్ని నమ్మిన మానవ బాంబుల్ని సృష్టించి, మన మతాన్ని నాలుగు పాదాలా నిలబడేలా చేస్తాం…”
కుర్రవాడు ఉద్వేగంతో దీన్ని విన్నాడు. రక్తం ఉప్పొంగింది. ఆ క్షణమే అతడు లాడెన్ శిష్యుడయ్యాడు. తన పేరు వెనుక అతడి పేరు చేర్చుకుని ‘జూనియర్’ బిన్ లాడెన్ అయ్యాడు.
జూనియర్-బిన్-లాడెన్తో కలిసి హైద్రాబాద్ వచ్చిన రెండో తాలిబాను చెచిన్యా దేశానికి సంబంధించిన వాడు. అతడికి మతం మీద పెద్ద నమ్మకం లేదు. తన దేశంలో కరువుకి తట్టుకోలేక, పొట్ట చేతపట్టుకుని అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ చేరాడు. ఆ తరువాత అందులో ఉ..న్న డ..బ్బు.. రు..చి చూసి కిరాయి యోధుడుగా మారాడు. అతడి పేరు రో – మనోప్రోడి.
ప్రోడీ అక్షర లక్షలు చేసే సత్యాలు కొన్ని చెప్పాడు. “…ఉగ్రవాదం పేరు చెప్పగానే మన మతం గుర్తు రావటం దురదృష్టకరం. ఈ ఛాందసవాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. మతమొక నల్లమందులాంటిదని మా కార్ల్‌మార్క్స్ అన్నదందుకే. అయినా, ఉగ్రవాదం ద్వారా మత విస్తరణ జరుగుతుందనుకోవటమంత బుద్ధి తక్కువ మరొకటి లేదు. ఆ మాట కొస్తే, మన మతo ఉగ్రవాదాన్నీ, హింసనీ ఖండిస్తుంది! క్రమం తప్పక రోజూ భగవత్ప్రార్థనలో గడపమంటుంది. మనలో చాలామంది శాంతి కాముకులు, పాపభీతి పరులు. అతివాదుల్ని వదిలిపెట్టు. వారు ప్రతిమతంలోనూ ఉంటారు. కొందరు స్వార్థపరులు దాన్ని తమ స్వార్థానికి వాడుకుంటారు. మనమిప్పుడు భారతదేశంలో ఉన్నాం. ఈ దేశాన్నే తీసుకో. మొన్న కార్గిల్‌లో మరణించిన సైనికులంతా భారతీయులు!! అంతే తప్ప కేవలం హిందువులే కాదు’’.
అతడి మాటల్లో లోతైన అర్థాన్ని తెలుసుకో గలిగేటంత జ్ఞానం జూనియర్-బిన్-లాడెన్కి లేదు. వెటకారంగా “…మరి నువ్వెందుకు ఇందులోకి వచ్చావ్?’’ అని అడిగాడు.
‘‘డబ్బుకోసం…” క్లుప్తంగా చెప్పాడు ప్రోడీ. “…ఎవరు ఎవరితో పోరాడినా నాకు ఫర్వాలేదు. నాకు డబ్బు ఇచ్చేవాడు ఎవర్ని చంపమంటే వారిని చంపుతాను. నాకేమీ ప్రత్యేకమయిన సిద్ధాంతాలు లేవు’’.
‘‘నువ్వు హీనుడివి. పవిత్రమయిన మా ఆశయంలో మురికినీరులా వచ్చి చేరావు’’.
ప్రోడీ ఆ మాటలకి కోపగించుకోలేదు. నవ్వాడు. “…నేను హీనుడినయితే, నువ్వు మూర్ఖుడివి. ఏ మత ప్రవక్త కూడా రక్తపాతాన్ని సృష్టించమని ప్రవచించలేదు’.
“లేదు. నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండమన్నాడు”
సంభాషణ సీరియస్ అవుతుందని గ్రహించిన మూడో వ్యక్తి షేర్ ఖాన్, వాతావరణాన్ని తేలిక చేయటం కోసం, ‘‘చాల్చాలు. ఇక ఈ వాదనలు ఆపండి. మీ ఇద్దరినీ చిన్న ప్రశ్న అడుగుతాను. క్విజ్ లాంటిదన్నమాట…! కరెక్టుగా సమాధానం చెప్పినవారికి చిన్న బహుమతి’’ అని నవ్వాడు. “…అమెరికాలో ఒక వీధిలో ఒక వైపు బ్రిటీషర్లు, మరో వైపు సిక్కులూ ఉంటున్నారు. వీధి పంపు దగ్గర వారిద్దరికీ గొడవ జరిగింది. బ్రిటన్‌లో ఉంటున్న సిక్కు ఎవర్ని సపోర్టు చేస్తాడు? తన మతస్థుడినా? తన దేశస్థుడినా?’’
ఇద్దరూ సమాధానం చెప్పలేక పోయారు. షేర్ ఖాన్ నవ్వి “….అమెరికాలో వీధి పంపులుండవు. అదీ ఆన్సర్’’ అన్నాడు. మిగతా ఇద్దరూ కూడా నవ్వేశారు. నిజానికి అది చాలా పెద్ద ప్రశ్న అనీ, దానికి సమాధానం చెప్పటం మీదే మానవజాతి ఆంత్రపాలజీ అంతా (ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద౦తో సహా) ఆధారపడి ఉందనీ వారికి తెలీదు.
Share this Article