.
ఇప్పుడు పిచ్చి కూతల సీజన్ నడుస్తోంది కదా… ఒకప్పటి దర్శకుడు వంశీ కూడా ఆ కూతలరాయుళ్ల జాబితాలో చేరిపోయినట్టున్నాడు… స్వప్న తనను ఇంటర్వ్యూ చేసింది…
దాన్ని ముక్కలుముక్కలుగా నరికి అప్‌లోడ్ చేస్తూ సదరు యూట్యూబ్ చానెల్ ప్రమోట్ చేసుకుంటోంది… అందులో ఒక థంబ్ నెయిల్ ‘’నాకు హీరోయిన్లతో ప్రేమ సంబంధం ఉంది… శారీరక సంబంధం లేదు’’ అట…
Ads
మరో థంబ్ నెయిల్ ‘ఆ రూమ్‌లో ఓ డైరెక్టర్ ఓ రాత్రి ఏకంగా ఐదుగురితో…’ ప్రధానంగా మాజీ నటి భానుప్రియతో తన ప్రేమాయణం, పెళ్లి ప్రతిపాదనలు, ఆమె తల్లి పడనివ్వకపోవడం వంటి కంటెంట్… తను ఏదేదో చెబుతూ పోయాడు, ఆ ఫ్లోలో అబ్బే, ఆమెతో నాకు శారీరక సంబంధం లేమీ లేదు అంటున్నాడు వీడియోలో…
35 ఏళ్ల నుంచీ ఆమెను కలవలేదు, నాకు నచ్చిన హీరోయిన్, నల్లగా ఉందని ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు వంటి ఏవో పాత ముచ్చట్లు… ఇప్పుడు ఆ కూతలన్నీ అవసరమా..? ఇన్నేళ్లయింది అని చెబుతూ, మళ్లీ మళ్లీ ఈ గోకుడు, ఈ దురద అవసరమా నీకు వంశీ..? ఆమెను ఎందుకు మళ్లీ బజారుకు లాగడం..?
ఆమెకు నరకం చూపించి.., ఆమెకు పెళ్లయి, భర్త కూడా చనిపోయి, మానసిక ఆరోగ్యం బాగాలేక, నటజీవితం నుంచి రిటైర్ అయిపోయి, ఏదో తన బతుకు తాను గుట్టుగా లాగిస్తోంది 58 ఏళ్ల వయస్సులో… జ్ఞాపకశక్తి క్షీణించి…! నిజానికి ఇక్కడ మానసిక ఆరోగ్యం బాగాలేనిది వంశీకే అనిపిస్తోంది… లేకపోతే ఆ పాత శారీరక సంపర్కాల కథలు దేనికి..?
ఎవడో ఏదో హోటల్ రూమ్ చూపిస్తూ ‘ఇందులో ఫలానా డైరెక్టర్ ఒకే రాత్రి ఐదుగురితో పడుకున్నాడు సార్’ అని వెయిటర్ చెప్పాడట… అది ఉదహరిస్తూ అబ్బే నేనలాంటోడిని కాను అంటూ తనకు తానే ఓ స్వచ్ఛ సర్టిఫికెట్ ప్రదానం చేసుకున్నాడు… దానికి వెగటు థంబ్ నెయిల్స్ సరేసరి…
అప్పట్లో స్వప్న ఇంటర్వ్యూలు అంటే కాస్త సదభిప్రాయం ఉండేది… ఇటీవల మరీ సగటు యూట్యూబ్ ఇంటర్వ్యూయర్‌లాగా మారిపోయింది… ఇక వంశీపైనా అంతే… ఒకప్పుడు కాస్త క్రియేటివిటీ కనిపించేది తన సినిమాల్లో… అదంతా వట్టిపోయింది, గత వైభవం… చాలామంది పాత దర్శకుల్లాగే క్రియేటివిటీ కోల్పోయి, ఇదుగో ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, పాత ‘పనితీరు’కు సెల్ఫ్ ప్యూరిటీ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు…
Priyadarshini Krishna మాటల్లో చెప్పాలంటే …. డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు సబ్జెక్ట్‌లతో మధ్యమధ్యలో కళాఖండాలను తీసాను అనిపించుకుని కాలం గడిపిన వంశీ, ఇప్పుడొచ్చి ఆణిముత్యం శుద్ధపూసలాగా యూట్యూబు ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తుంటే నవ్వాగడం లేదు… బూతులో ఈవీవీకి ఆద్యుడు అనిపించుకున్న ఈయన ఇప్పుడేమో మహాత్ముడిలాగా ఆడవారు, గౌరవం, సంస్కారం అని డవిలాగులతో ఇంటర్య్వూలు గుప్పిస్తున్నాడు…
ఒక వయసు వచ్చాక ఈ సెలబ్రిటీలకు మెదడుకి నాలుకకు నడుమ కనెక్షన్ కట్ ఐపోతదో ఏంటో… మడిసన్నాక కలాపోసన ఉండటం ఎంత సహజమో, అది వట్టిపోవడం కూడా అంతే సహజం… ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో తమరికి క్రియేటివిటీ ఉందని ఎల్లకాలం పల్లకీ ఎక్కుతా అంటే కుదరలేదు… ఆ పాత జనరేషన్ ఏదో ఉబుసుపోక తమరికి గౌరవం ఇస్తున్నారు… పోగొట్టుకోకండి…!
Share this Article