ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు… హైదరాబాద్ విస్తరిస్తుంటే, చెట్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, రాళ్లు, రప్పలు ఏవీ ఆగడం లేదు… అన్నీ మింగేస్తూ నగరం నలువైపులా విస్తరిస్తోంది… ఈమధ్య పలువురు చెబుతున్నట్టు హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అమెరికా నగరాల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది… నిజమే… ఈ భారీ భవంతుల నడుమ ఒకటోరెండో పాత, అపురూప కట్టడాలు కనిపిస్తే, అవీ ఆధ్యాత్మక మందిరాలు అయితే..? వాటి ఉనికి సంభ్రమంగానే ఉంటుంది… ఇదీ అదే…
ఫేస్ బుక్ మిత్రురాలు Kavitha Chakra వాల్ మీద ఓ పోస్టు చదువుతుంటే సంబరం అనిపించింది… ఆమె ఏం రాసుకుందో ఓసారి యథాతథంగా చదవండి ఇక్కడ…
మనసు కాస్త నలత గా ఉండి, ఏదైనా క్షేత్రం వెళ్ళాలని ఉబలాటం. శ్రీరంగం వెళ్లాలని, స్వామి సన్నిధిలో సేద దీరాలని చిన్నప్పటి కల. (ofcourse ఇంకా తీరలేదు) ఈ మధ్య ఆ కల మరింత బలంగా తయారయింది. కానీ.. కొన్ని కొన్నిటికి టైం రావాలి. ఉన్నట్టుండి ఈ రోజు మిత్రులు ఒక లింక్ పంపారు. పురాతన రంగనాథ స్వామి ఆలయం మన దగ్గరలో అని..!
Ads
చూస్తే.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలోని నానక్‌రామ్‌గూడలో… ఓహ్.. చాలా దగ్గర..! శ్రీరంగమేమో గానీ… ఇక్కడ కనీసం రంగనాథుడి దగ్గరకైనా వెళదాం అనుకుని, సాయంత్రం బయల్దేరాము. ఆ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటేనే ఎంతో తన్మయత్వం..!
చుట్టూ గాజు బిల్డింగ్స్.. పొష్ లొకాలిటీ మధ్యలో సుమారు ఎకరం నుండి రెండెకరాల స్థలంలో స్వామి వారి కోవెల. ఎదురుగా కళాత్మకంగా చెక్కిన రథం.. నాలుగు వందల సంవత్సరాల పురాతన దేవాలయం. విశాలమైన ప్రాంగణంలో చింత, పొగడ పూల చెట్లు. బయట కొన్ని, లోపల కొన్ని చుట్టూ అలా సుమారు వంద అర్రలు (గదులు)
రాతి మెట్లు.. జాజు రంగుతో దర్వాజాలు… వాటిని చూస్తే అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం గుర్తొచ్చింది. ఆలయంలో రాతి స్థంబాలు, మోటు బండలు.. రంగు వెలసిన బొమ్మలు.. ఎక్కడ కూడా కృత్రిమత్వం లేదు. మూలవిరాట్ రంగనాథ స్వామి వారు నల్లని రాతిలో శయనించి చక్కగా ఉన్నారు.
స్వయంభు కాకపోయినా చెరువులో దొరికిన విగ్రహమని అక్కడ అర్చకులు చెప్పారు. చక్కని ప్రదేశం, విశాలమైన ప్రాంగణం.. అక్కడ నుండి రావాలనిపించకపోయినా… వచ్చేసిన తరువాత మనసు మాత్రం ఇంకా ఆ ప్రాంగణం లోనే తచ్చాడుతుంది. చుట్టూ ఆకాశాన్నంటే అద్దాల మేడల మధ్య పురాతన రాతి కట్టడంతో సహజ సౌందర్యంతో దేవాలయం..! మనిషి తన మేధస్సుతో ఆకాశాన్నంటినా… నే పై విరజిమ్మే మట్టి పరుమళం మనసును వీడేనా..!
గుడికి వెళ్లాలి అనుకునే వారి కోసం ఈ లింక్..
https://maps.app.goo.gl/xXPhdvmLhACgpNpJ7
Share this Article