Yanamadala Murali Krishna……… చైనాలో కోవిడ్ :::: ఒమిక్రాన్ వేరియంట్ కొరోనా వైరస్… మార్పు మంచికే:::: కొరోనా వైరస్ అనే ప్రపంచ పీడ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్ఎన్ఏ వైరస్ అయిన కొరోనా వైరస్ ఇప్పటికే తన వారసకణాలలో అనేక మార్పులు పొంది, 2021 మొదటి అర్ధ సంవత్సరంలో డెల్టా వేరియంట్ గా లక్షలాది మంది ప్రాణాలను తీసింది. నవంబర్ చివర్లో బోట్స్వానా, దక్షిణాఫ్రికా దేశాలలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్… 2019 డిసెంబర్ ముందు నాటి సాధారణ జలుబు కలుగజేసే కొరోనా వైరస్ రూపానికి తిరుగు ప్రయాణంలో పెద్ద అంగగా పరిగణిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆశావహంగా ఉన్నారు.
తాజాగా అమెరికాలో రోజుకు దాదాపు మూడు లక్షల మంది కొరోనా వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో అత్యధిక శాతం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకుతున్నది. ఈ జబ్బు తీవ్రత బాగా తక్కువ కావడంతో, మరణాలు తక్కువగానే ఉంటున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ పూర్తిగా వ్యాపించడంతో ఇక సాధారణ జలుబుగానే భావించి, పెద్దగా ఒత్తిడి లేకుండా ఉంటున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ విపరీతమైన వేగంతో వ్యాపిస్తుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలలో విపరీతంగా వ్యాపించి విధ్వంసాన్ని, విషాదాన్ని సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తున్నది. డెల్టా వేరియంట్ R0 ( ఆర్ నాట్) =7. అనగా ఈ వేరియంట్ సోకిన ఒక మనిషి ఏడుగురికి ఈ క్రిమిని వ్యాపింప చేయగలడు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ R0 పదిగా ఉంది. అనగా మరింత వేగంతో ఇది వ్యాపిస్తున్నది.
Ads
కాగా ఒమిక్రాన్ వేరియంట్ జలుబు లక్షణాలు బయటపడే రెండు రోజుల ముందు నుంచి, జలుబు తెలిసిన మూడు రోజుల వరకు వ్యాప్తి చెందుతుంది. అందుకే పేషెంటు విడిగా ఉండవలసిన ఐసోలేషన్ కాలాన్ని, అమెరికా దేశపు సీడీసీ పది రోజుల నుండి ఐదు రోజులకు తగ్గించింది. అలాగే, కెనడాలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటంతో, ఈ రకమైన జలుబు సోకిన వైద్య సిబ్బందిని కోవిడ్ రోగులకు చికిత్స అందించే హాస్పిటల్స్ లో పని చేయడానికి అనుమతి ఇస్తున్నారు.
అయితే చాలా దేశాలలో ఇంకా వేరువేరు రకాల వేరియంట్స్ ఉండటంతో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా నిపుణులు ఇకమీదట లాక్ డౌన్ వంటి తీవ్రమైన చర్యలు అవసరం ఉండవు అని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నుండి, ఇతర వేరియంట్స్ నుండి రక్షణ కోసం మాస్కు అత్యుత్తమమైన సాధనం. దానితోపాటు వ్యాక్సిన్ మరింత రక్షణను ఇస్తుంది.
పెద్ద ఫంక్షన్స్, సభలు, గుమికూడటం వంటి పనుల మూలంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. బయటకు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ తగిన మాస్కును ధరించాలి. అప్పుడే మనల్ని మనం కాపాడుకోగలం, సమాజాన్ని రక్షించగలం…. డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ
Share this Article