ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రధాని, రాష్ట్రపతి… అవసరమైతే పుతిన్, జిన్‌పింగ్, జో బైడెన్ ఇళ్లల్లోనూ తన సొంత స్పై ఇయర్ బగ్స్, కెమెరాలు పెట్టేయగలడు… తను చెప్పినట్టు కంటికి కనిపించనివీ, చెవికి వినిపించనివీ బోలెడు వార్తలు పట్టుకోగలడు… అవసరమైతే క్రియేట్ చేయగలడు… అదే జర్నలిజం అనీ మైకు గుద్ది వాదించగలడు… కానీ తనకు తెలియకుండానే జర్నలిజాన్ని అంతకుమించి ముందుకు తీసుకెళ్లి, కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న తీరు మాత్రం అద్భుతం… ఈ ప్రక్రియ, ఈ ప్రయోగాలకు నాలుగైదు పులిట్జర్లు ఈజీగా ఇచ్చేయొచ్చు… మనుషుల మనస్సుల్లో దూరి, వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్లకే తెలియని వాళ్ల మథనం ఏమిటో అక్షరాల్లోకి దింపడం మాత్రం ఎక్సలెంట్ ఫీట్… ఆర్కేకు ఏదైనా సాధ్యమే… షర్మిల మనసులో దూరి, మొత్తం వడబోసి, ఆమె ఏం ఆలోచిస్తున్నదో రాసేశాడు… ఫాఫం, షర్మిలకు కూడా తెలియదేమో, నిజంగా తను ఇంత బాగా ఆలోచిస్తున్నట్టు..!!
ఈరోజు కొత్త పలుకులో చాలా చాలా విశేషాలున్నయ్… తొలిసారి రాధాకృష్ణ జర్నలిజం చెరువు నిండి, మత్తడి దూకుతుందేమో అన్నట్టుగా ఉంది…
Ads
- ఎడిటర్లు కీలక సందర్భాల్లో ఫస్ట్ పేజీలో సైన్డ్ ఎడిటోరియల్ రాస్తుంటారు… రిపోర్టర్లు బైలైన్ స్టోరీలు రాస్తుంటారు… కానీ ఓనర్లు తమ మదిలో మెదిలే భావాలన్నీ, కోరుకునే ఆకాంక్షలన్నీ ఫస్ట్ పేజీలో ఫోటో పెట్టుకుని మరీ (బై పిక్ స్టోరీలు అనాలేమో…) అచ్చు గుద్దేయడం కొత్త ప్రక్రియే… మొన్న షర్మిల కొత్త పార్టీ అని రాశాడుగా, మళ్లీ ఇప్పుడు… ఇక అలవాటుగా చేసేస్తాడేమో… ఎందుకంటే… సాధారణ స్టోరీల్లా రాస్తే ఇక ఎవరూ నమ్మేట్టు లేరు ఆ పత్రికలో… అందుకే ఇక తన పేరుతోనే రాసేస్తూ… హేమిటి, నేను రాసినా నమ్మరా అని ప్రశ్నిస్తున్నాడు… తనే రిపోర్టర్, తనే ఓనర్, తనే ఎడిటర్, తనే గ్రాఫిక్ డిజైనర్, తనే సబ్ ఎడిటర్, తనే ప్రూఫ్ రీడర్… సూపర్…
- సాధారణంగా చాలా పత్రికల్లో కొన్ని వార్తలు కనిపిస్తుంటయ్… మేం వార్త రాస్తేనే వీథి బల్బు మార్చారు, మేం వార్త రాస్తేనే అధికారులు స్పందించి ఇంటి ముందు చెత్త కుప్ప ఖాళీ చేయించారు టైపు స్పందన వార్తలు… నవ్వొస్తుంటయ్… దాన్ని మరీ పీక్స్‌లోకి తీసుకెళ్లి #RkIsRight అని హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్ కనిపించింది ఆమధ్య… నేను నిజమే చెబుతాను అని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది సార్..?
ఇక ఈరోజు కొత్త పలుకు చదివితే… ఫాఫం ఆర్కే అనిపించేలా ఉంది… జగన్ క్యాంపు ఏం కోరుకుంటున్నదో, సేమ్ దాన్నే రాస్తున్నాడు ఆర్కే… తను జగన్‌ను తిట్టేస్తున్నాను అనుకుంటున్నాడు గానీ… ఆ క్యాంపుకూ కావల్సింది అదే… అన్నతో విభేదించడం వల్లే ఆమె కొత్త పార్టీ పెడుతోంది అనే ప్రచారమే జరగాల్సింది… పొరపాటున కూడా ఆమె జగన్ వదిలిన బాణమే అని తెలియకూడదు… హహహ… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ట్రాపులో పడి, తను ట్రాకు తప్పిపోయాడు… లేకపోతే ఏమిటా రాతలు..? కొన్ని సందేహాలు సారూ…
- జగన్ 10 వేల కోట్ల ఆస్తిలో షర్మిల వాటా ఇవ్వడం లేదు అంటున్నారు కదా… మరి మీ యెల్లో క్యాంపే కదా లక్ష కోట్లు సంపాదించాడు జగన్ అని నోటికొచ్చిన బురద అంతా తన మీద చల్లారు… పైగా తను సంపాదించిన దాంట్లో చెల్లెకు ఎందుకు వాటా ఇవ్వడం..? అసలు వైఎస్ సీఎం అయ్యేముందు తన దగ్గర ఏమీ లేదు… ఆ తరువాత జగన్ సంపాదించిందే… చెల్లెకు అందులో హక్కు ఏమిటో ఆర్కే చెప్పాలి…
- కేసీయార్ జగన్‌కు ఎన్నికల ముందు ఆర్థికసాయం చేశాడు అంటున్నారు కదా… లక్ష కోట్ల ఆసామీకి కేసీయార్ సాయం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? జగన్ మరీ కుమారస్వామి, దేవెగౌడలాగా పేదవాడయిపోయాడా..?
- ఏపీలో పార్టీ పెడితే అన్నకు నష్టం కాబట్టి, వైసీపీ వాళ్లు కోరినా ఆమె తిరస్కరించింది అంటున్నారు కదా… అసలు అన్నకు గుణపాఠం చెప్పాలనే ఆమె పార్టీ పెడుతున్నప్పుడు… అన్నకు నష్టం కాబట్టి ఏపీలో పార్టీ పెట్టడం లేదు అనే వాదన ఏమిటి..? ఆర్కే తనేం రాస్తున్నాడో తనకు తెలుసా..?
- ఎంతసేపూ మ్యాటర్ అటు తిప్పీ ఇటు తిప్పీ… జగన్ జైలుకు పోతాడు, భారతి సీఎం అవుతుంది, చెల్లెకు అన్యాయం అంటూ రాస్తాడు తప్ప… ఆమె జగనన్న ఎలాగూ జైలుకు పోతాడు, నేను సీఎం కావాలి అనుకుని కాచుక్కూర్చుందా..? వదిన దాన్ని తన్నుకుపోతోంది అని కోపం పెంచుకుందా..? అమిత్ షా ఆమెకు ఆహ్వానం పలుకుతున్నాడు అని ఓచోట రాశాడు… ఎస్… జగన్నాటక సూత్రధారి ఎవరో అర్థమైందా ఆర్కే గారూ…!? నో డౌట్… ఈ కొత్తపలుకు వ్యాసం చదివి ఉంటే మాత్రం జగన్ పొద్దున్నే పగలబడి నవ్వుకుని ఉంటాడు… కారణం :: జగన్‌కే బాగా తెలుసు..!!
- చెప్పనే లేదు కదూ… ఏమోయ్, నీ మీద అన్నీ తవ్వుతున్నాను, రాస్తాను చూడు, కాచుకో అంటూ సాయిరెడ్డికి సవాల్ విసరడం కూడా నవ్వొచ్చేదే… అది మరీ కంట్రిబ్యూటర్ లెవల్ ఝలక్‌కు… రాసేదేదో కుమ్మేసెయ్ సార్, ఇలా ముందస్తు సునామీ హెచ్చరికలు దేనికి..? చీపుగా..!!
Share this Article