నిజంగా ఆశ్చర్యం వేస్తుంది… మొన్న మరణించిన కైకాల సత్యనారాయణ 778 సినిమాల్లో నటిస్తే… ఈరోజు మరణించిన తమ్మారెడ్డి చలపతిరావు ఏకంగా 1200కు పైగా సినిమాల్లో నటించాడు… 1500 అని తనే చెప్పినట్టున్నాడు ఆమధ్య… స్వయంగా ఏడు చిత్రాల్ని నిర్మించాడు… మెజారిటీ విలన్ పాత్రలే… అటు సత్యనారాయణను రేపుల నారాయణ అనేవారట అప్పట్లో.., ఇటు చలపతిరావుకు కూడా ఎక్కువగా అలాంటి పాత్రలే దక్కాయి… రేపుల చలపతిరావు అని పిలిచేవారు… 96 సినిమాల్లో రేపిస్టు పాత్రలు చేశాడట… బయట చలపతిరావు కనిపిస్తే మహిళలు భయపడిపోయేవాళ్లు… కృష్ణవంశీ నిన్నే పెళ్లడతాలో మంచి తండ్రి పాత్రను, ఆది సినిమాలో వివి వినాయక్ మంచి బాబాయ్ పాత్రను ఇచ్చాక చలపతిరావు ముఖచిత్రం మారిపోయింది… తరువాత సాఫ్ట్ కేరక్టర్లు చాలా చేశాడు… ఈవీవీ సినిమాల్లో మరీనూ…
ఏ భాష ఇండస్ట్రీలోనైనా 1200 సినిమాల్లో నటించిన రికార్డు ఎవరిపేరిటనైనా ఉందో లేదో తెలియదు… కానీ అక్షరాలా అన్ని సినిమాల్లో నటించడం అభినందనీయం… ఎంతో డెడికేషన్, సినిమాలంటే ప్రేమ-పిచ్చి ఉంటే తప్ప అది సాధ్యం కాదు… 78 ఏళ్ల చలపతిరావు కుటుంబం అన్నిరకాలుగా వెల్ సెటిల్డ్… కొడుకు రవిబాబు దర్శకుడు… ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో ఉంటారు… గత ఏడాది వరకూ చలపతిరావు నటిస్తూనే ఉన్నాడు…
రౌడీ గ్యాంగులో ఒకడిగా కనిపించడం దగ్గర్నుంచి… మరీ అప్రధాన పాత్రల్ని పోషించడం దగ్గర నుంచి… ఓ మోస్తరు పాత్రల దాకా… ఏ పాత్ర వచ్చినా ఆహ్వానించాడు… ఆ రూపం, ఆ కళ్లు విలనీకి సరిగ్గా సరిపోయాయి… ఇలా జీవితమంతా షూటింగులు, షూటింగులు, సినిమాలు… నటనే తన జీవితంగా బతికాడు…
Ads
ఇన్ని వందల సినిమాల్లో నటించినా ఎప్పుడూ పెద్దగా ప్రచారతెర మీదకు వచ్చేవాడు కాదు… తన సినిమాలు, తన పాత్రలు, తన షూటింగులు… ఇంటికి వెళ్లిపోవడం… అంతే… టీవీలు, మీడియా ఇంటర్వ్యూలు, చాట్ షోలు కూడా పెద్దగా ఉండేవి కావు… ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వంటి కొన్ని మినహా… పక్కా లోప్రొఫైల్… తను స్వతహాగా నాటకాల నుంచి ఎదిగిన నటుడు… మద్రాస్ వెళ్లిన కొత్తలో బాగా దెబ్బతిన్నా సరే, ఎన్టీయార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలబడ్డాడు… అందుకే ఇన్ని వందల పాత్రలు, సినిమాలు… దానవీరశూరకర్ణలోనైతే ఏకంగా అయిదు పాత్రలు పోషించాడు… దటీజ్ చలపతిరావు…
ఇదంతా ఒకెత్తు… అన్ని వందల సినిమాల్లో రేపులు చేసీ చేసీ… ఇండస్ట్రీ సినిమా చాన్సుల కోసం వచ్చే ఆడవాళ్లను ఎలా వాడుకుంటుందో చూసీ చూసీ తనకు మహిళలంటే ఓరకమైన దురభిప్రాయం కడుపులో పేరుకుపోయినట్టుంది… వాళ్ల మీద స్వేచ్ఛగా చీప్ కామెంట్స్ పాస్ చేసేవాడట… ఓసారి రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో లాంచ్ ప్రోగ్రాంలో ‘‘ఆడవాళ్లు పక్కలో పడుకోవడానికే పనికొస్తారు’’ అనే చిల్లర కామెంట్ చేయడం పెద్ద వివాదాన్ని రాజేసింది…
మహిళాసంఘాలు, మీడియా, సోషల్ మీడియా కసికసిగా విరుచుకుపడ్డాయి… ఆ ఒక్క వ్యాఖ్యతో నన్ను చరిత్రహీనుడిని చేయకండని, క్షమించండని బతిమిలాడుకోవాల్సి వచ్చింది తను… ఒకటీరెండు కేసులు కూడా నమోదైనట్టున్నాయి… నిజానికి మహిళల పట్ల అంతకన్నా నీచంగా వ్యాఖ్యలు చేసే, వాడుకునే మదపురుగులకు ఢోకా లేని ఇండస్ట్రీ అది… కానీ ఆ టైమ్‌కు చలపతిరావు అలా ఆ వ్యాఖ్యతో దొరికిపోయాడు… ఇన్నేళ్ల నటనానుభవం, సినిమాల పట్ల డెడికేషన్, తన చరిత్రకు పెద్ద మరకగా మిగిలిపోయింది ఆ వివాదం..!!
Share this Article