……. నో డౌట్… తరతరాలుగా ఆడదానిపై మగాడి దాష్ఠీకమే ఎక్కువ… అనేక కోణాల్లో ఆడదే బాధితురాలు… ఆ దోపిడీ గురించి ఎంత రాసినా తక్కువే… కానీ అదొక్కటే అంతిమ నిజం కాదు… కొన్నిసార్లు ఆడదాని స్వార్థం మగాడిని కూడా పీడిస్తుంది… అది పెద్దగా చర్చలోకి రాదు… మగాడు కూడా మానసిక వేదన అనుభవించే కథలుంటయ్… సమాజం సానుభూతి కూడా లభించదు… తప్పుడు ఫిర్యాదులతో ఓ అబ్బాయిని బదనాం చేసి, మోసగించి, జైలుపాలు చేసి, తీవ్రంగా సతాయించిన ఒక కేసులో, బాధితుడికి 15 లక్షల పరిహారం కట్టాలని చెన్నై కోర్టు ఆదేశించిన కథ చదివాం కదా మొన్న… ఇది మరో కేసు…
సాధారణంగా విడాకుల కేసుల్లో భార్యల తరఫు వాళ్లు ఆరోపించేవి ఏమిటంటే… వాళ్లు అదనపు కట్నం అడిగారు, కుటుంబ సభ్యులు కొట్టారు, వేధించారు… అసలు అబ్బాయికి పొటెన్సీ లేదు, వాడు సంసారానికి పనికిరాడు… ఇలాంటివన్నీ కలిపి ఆరోపణలు చేస్తారు… కేసులో బలం ఉండటానికి వాళ్లు ఆశ్రయిస్తారు… వీలైనంతవరకు మన చట్టాలు, మన వ్యవస్థలు మహిళ పట్ల సానుభూతిని కలిగి ఉంటయ్… కానీ అన్నీ నిజాలేనా..? అవి తేలేది ఎలా..? సమానత్వం అంటే మగాడికి అన్యాయం కాదు కదా…
ఢిల్లీ హైకోర్టు దగ్గరకు వచ్చింది ఓ కేసు… ఢిల్లీకి చెందిన ఓ జంట… వాళ్లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది… ఆమెకు ఇది మొదటి పెళ్లి, ఆయనకు ఇది రెండో పెళ్లి… మొదటి పెళ్లి పెటాకులు కావడానికి కారణాలు తెలియవు… అయితే ఈ రెండో పెళ్లికి ముందే రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె తన అనారోగ్యాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందనీ, ఆమెతో తను సంసారం చేయలేననీ భర్త కోర్టుకెక్కాడు… దాంతో ఆమె ‘నా భర్త నపుంసకుడు, సంసారానికి పనికిరాడు’ అని లిఖితపూర్వకంగా ఆరోపణ చేసింది…
Ads
సీరియస్ ఆరోపణ కదా… భర్త అనుమతి మేరకు కోర్టు తనకు వైద్య పరీక్షలు చేయించింది… అందులో సదరు మగాడు సంసారానికి ఫిట్ అని తేలింది… అంటే ఇంపొటెంట్ కాదు, పొటెంటే అని తేలింది… తప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టి ఆమెతో నేను సంసారం చేయలేనని భర్త చెప్పడంతో కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది… సీన్ కట్ చేస్తే…
నో, నో, తను సంసారానికి అర్హుడే అంటున్నారు కదా, విడాకులు వద్దు, తన పెళ్లిని పునరుద్ధరించాలని అదే భార్య హైకోర్టుకెక్కింది… తన మొగడు పనికిరాడని చెప్పిందీ తనే… మళ్లీ అది అబద్ధమని తేలడంతో సంసారం చేస్తాను అని కోరేదీ ఆమే… అంటే ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం, కోర్టును తప్పుదోవ పట్టించడం… కోర్టుకు ఆమె తత్వం అర్థమైంది…
దాంతో హైకోర్టు ధర్మాసనం మహిళ పిటిషన్ కొట్టేసింది… ఒక పురుషుడిని నపుంసకుడిగా చిత్రించడం అత్యంత క్రూరమైన చర్య… అది తన మానసికారోగ్యానికీ దెబ్బ… పైగా మళ్లీ తన ఆరోపణలు నిజం కావని నిరూపితమయ్యాక తనే విడాకులు వద్దని అడగడం ఏమిటి..? ఇదంతా ఓ మగవాడితో అన్నిరకాలుగా ఆడుకోవడమే అంటూ సానుభూతి చూపించింది… సదరు భార్య అప్పీల్ కొట్టేసింది… ఆ పురుషుడిని ఈ బంధాల నుంచి, ఈ బాధల నుంచి విముక్తం చేసింది… అలాంటి మహిళతో కలిసి జీవించాలని ఏ వ్యక్తీ కోరుకోడు అని కుండబద్ధలు కొట్టేసింది…
నిజం.,. ఎంతసేపూ మగాడే దోషి అనే కోణంలో విచారణలు జరగాలా..? మహిళ వైపు నుంచి తప్పుడు ఆరోపణలు ఉండవా..? పైగా తన అహం మీద, తన మానసిక ఆరోగ్యం మీద, తన సామాజిక ప్రతిష్ట మీద దెబ్బ తీస్తే అది నేరం కాదా..? అదే కోర్టు ఆలోచించింది… ఇంట్రస్టింగు… జరగాలి, ఇలాంటి కేసుల మీద, ఇలాంటి తీర్పుల మీద కూడా ఆరోగ్యకరమైన చర్చ జరగాలి… అన్ని వేళల్లోనూ మగాడు మాత్రమే దోషి కాదు..,.!!
Share this Article