Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమిత్ షా తాత కేజ్రీవాల్‌… మన రాజకీయాల్లో మరో చతుర్ బనియా…

February 18, 2022 by M S R

Nancharaiah Merugumala…………….    దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఇరుకున పెట్టడానికి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు మూడు రోజుల ముందు పన్నిన ప్రయత్నం భగ్నమైనట్టే కనిపిస్తోంది. రెండు జాతీయపక్షాలు భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌ లు పంజాబ్‌ లో ఆప్‌ విజయాన్ని అడ్డుకోవడానికి కేజ్రీవాల్‌ పై ఆతంక్‌ వాదీ (ఉగ్రవాది) అనే ముద్ర వేసి ఎన్‌ఐఏతో ఆయనపై దర్యాప్తునకు సిద్ధమౌతున్నట్టు కనిపించాయి. హరియాణాలోని హిందూ అగర్వాల్‌ వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగి, ఖరగ్‌పూర్‌ లో ఇంజనీరింగ్‌ చదివిన కేజ్రీవాల్‌ చివరికి దేశ రాజధాని (కేంద్రపాలిత) ప్రాంతానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా ఆయన స్థాయికి చిన్నపదవే.

అసలు వివాదానికి ఊతమిచ్చింది ఆప్‌ స్థాపక సభ్యుడైన 50 ఏళ్ల కవి, అధ్యాపకుడు విశ్వాస్‌ కుమార్‌ శర్మ ఉరఫ్‌ కుమార్‌ విశ్వాస్‌. రెండ్రోజుల క్రితం కేజ్రీవాల్‌ కు సంబంధించిన ‘రహస్యం’ వెల్లడించాడు పశ్చిమ యూపీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హాస్య కవి విశ్వాస్‌. చాలా తెలివిగా పంజాబ్‌ ఎన్నికల పోలింగ్‌ ముందు ఆప్‌ అధినేతపై ప్రధానపక్షాలు విరుచుకు పడడానికి వీలుగా మొన్న ఏఎన్‌ఐ అనే వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వగా అది వైరల్‌ అయింది.

ఈ ముఖాముఖి వీడియోను వాడుకోవాలనే లక్ష్యంతో పంజాబ్‌ దళిత కాంగ్రెస్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ దగ్గర నుంచి బీజేపీ నేతల వరకూ ఏఎన్‌ఐ విశ్వాస్‌ ఇంటర్వ్యూను ‘షేర్‌’ చేశారు. ‘‘ఏదో ఒక రోజు తాను పంజాబ్‌కు ముఖ్యమంత్రో లేదా స్వతంత్ర ఖలిస్తాన్‌కు ప్రధానమంత్రినో అవుతానని కేజ్రీవాల్‌ నాతో అన్నారు. ఏం చేసైనా పదవి సంపాదించడమే ఆయనకు ముఖ్యం,’’ అని ఈ వీడియోలో కవి విశ్వాస్‌ ఆరోపించారు. దీంతో ఒక్కసారే కేజ్రీవాల్‌ పై అన్ని వైపుల నుంచీ దాడి మొదలైంది.

Ads

ఎన్నికల ముందు జరిపిన అనేక సర్వేల్లో ఆప్‌ కు మెజారిటీ (60 సీట్లు) వస్తుందని తేలింది. అప్పటి నుంచీ ఆప్‌పైన, కేజ్రీవాల్‌ పైనా జాతీయ, ప్రాంతీయ పార్టీలు దృష్టి పెట్టాయి. తాజాగా కేజ్రీవాల్‌ మాజీ విశ్వాసపాత్రుడు విశ్వాస్‌ తానింకా ఆప్‌ సభ్యుడినేనని చెప్పుకుంటూనే– బ్రాహ్మణ భావజాలంతో నడిచే రెండు జాతీయ రాజకీయపక్షాలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ప్రయోగించడానికి ‘బ్రహ్మాస్త్రం’ అందించానని అనుకుంటున్నాడు.

వ్యూహాలే తప్ప గొప్ప ఆలోచనలు లేని అమిత్‌షా కన్నా కేజ్రీవాలే తెలివైన నేతా?
––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ఆప్ నేత గురించి కుమార్‌ విశ్వాస్‌ మీడియాకు చెప్పిన విషయాలు వింటే– అవి నిజమో కాదో తెలీదుగాని–కేజ్రీవాల్‌ కు ఇంతటి విస్తృత ఆలోచనలున్నాయా? అని ఆశ్యర్యం కలుగుతుంది. 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తొలిసారి పోటీచేసిన సందర్భంలో తనకూ, కేజ్రీవాల్‌ కు మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో విశ్వాస్‌ వెల్లడించాడు. ‘‘పంజాబ్‌ ఒక రాష్ట్రం కాదు. ఎల్లలు లేని ఒక భావన. ఈ విశాల ప్రపంచంలో ‘పంజాబియాత్‌’ ( మతం, కులంతో సంబంధం లేకుండా మనమంతా సాంస్కృతికంగా పంజాబీలమనే భావం) అనేది గొప్ప భావన– అని అరవింద్‌ కు చెప్పాను.

అయితే, పంజాబ్‌ లో గెలుపు కోసం వేర్పాటువాదులతో చేతులు కలపకూడదని కూడా చెప్పాను. కాని, ‘అలాంటిదేమీ పెట్టుకోవద్దు. కలవడంలో తప్పులేదు’ అని కేజ్రీవాల్‌ మొండిగా అన్నారు. ‘అంతటితో ఆగకుండా, పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి తాను చేపట్టడానికి తన పథకం లేదా ఫార్ములా కూడా అరవింద్‌ నాకు చెప్పారు. ‘పంజాబ్‌ ఆప్‌ నేతలు భగవంత్‌ మాన్, ఎచ్‌ఎస్‌ ఫూల్కా మధ్య గొడవ పెట్టి, మధ్యలో నేను దూరి సీఎంను అయిపోతా,’ అన్నారాయన.

ఇప్పటికీ ఇదే ఆలోచనతో ఉన్నాడు అరవింద్‌. ఓ రోజు కేజ్రీవాల్‌ నాతో అన్న మాటలు దిగ్భాంతి పరిచాయి. ‘మీరేమీ నా గురించి దిగులు పడకండి. ఏదో ఒక రోజు నేను స్వతంత్ర సుబాకు (రాజ్యం) ముఖ్యమంత్రి అవుతా,’ అని ఆయన అన్నారు. అప్పుడు నేను వేర్పాటువాదుల ప్రస్తావన తెచ్చాను. ‘దానిదేముంది? వారు విజయం సాధిస్తే, నేను స్వతత్ర దేశానికి (ఖలిస్తాన్‌) ప్రధానమంత్రిని కాగలను,’ అని అరవింద్‌ జవాబిచ్చారు.

హరియాణా అగర్వాల్‌ (కేజ్రీవాల్‌) పంజాబ్‌ సీఎం కావడంలో తప్పేముంది?

––––––––––––––––––––––––––––––––––––––––––––––

ఉత్తరాది వైశ్యుల్లో కాస్త భిన్నమైన వర్గం వారే అగర్వాల్స్‌. వ్యాపారరంగం (మిట్టల్, గోయెంకా, గోయెల్, బన్సల్, జిందల్, లోహియా, సింఘల్‌ తదితర 18 గోత్రాల వైశ్యులు)లోనే గాక ఉన్నతోదోగాల్లో రాణిస్నువారే ఈ అగర్వాల్స్‌. బంజారా–జూబిలీ హిల్స్‌ ప్రాంతంలో ఈ శాఖ వైశ్యులు పూజించే అగ్రసేన్‌ మహారాజ్‌ విగ్రహం పెట్టించారంటే అగర్వాల్స్ బలం ఏమిటో అర్ధమౌతుంది. అగర్వాల్స్ పుట్టిల్లు హరియాణాలోని హిస్సార్‌ జిల్లా పట్టణం ఆగ్రోహా. అదే ప్రాంతంలోని భివానీ జిల్లా సివానీ కేజ్రీవాల్‌ సొంతూరు.

ఆదాయపన్ను శాఖలో ఐఆర్‌ఎస్‌ ఎంపికతో వచ్చిన ఉద్యోగం మానేసి దిల్లీలో సెటిలయ్యాక ఆయన ఈ కేంద్రపాలిప్రాంత నివాసి అయ్యారు. ఆయనకన్నా ముందు పూర్వపు ఉమ్మడి పంజాబ్‌లో పుట్టిన ఎంఎల్‌ ఖురానా, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్‌ (కపూర్‌) దిల్లీ సీఎంలు అయ్యారు. పంజాబ్‌ను 1966లో సిక్కు మెజారిటీ రాష్ట్రం చేశాక హరియాణాలో పుట్టిన కేజ్రీవాల్‌ మొదటిసారి 2013 డిసెంబర్‌ ఆఖర్లో సీఎం అయ్యారు. దిల్లీ ముఖ్యమంత్రిగా పంజాబ్, హరియాణాలో పుట్టినోళ్లు కావడంలో తప్పేమీ లేదు. ఏ రాష్ట్రంలోనైనా ఓటరై ఉంటే దానికి సీఎం కావచ్చని చట్టాలు చెబుతున్నాయి.

కేజ్రీవాల్‌ కు పంజాబ్‌ సీఎం కావాలనే ఆకాంక్ష బలంగా ఉందనే ప్రచారం 2017 పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా కూడా మీడియాలో విస్తృతంగా వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కేజ్రీవాల్‌ కు ప్రత్యర్థులే కాబట్టి ఆయన వ్యూహాలపై ఇవి ఓ కన్నేసి కూపీ లాగుతూనే ఉండేవి. ఐదేళ్ల తర్వాత పాత సంభాషణ విషయం కుమార్‌ విశ్వాస్‌ ఎందుకు వెల్లడించారు? అంటే, 2018 జనవరిలో దిల్లీ నుంచి రాజ్యసభ టికెట్‌ ఆశించిన విశ్వాస్‌ ను కాదని యూపీకి చెందిన సంజయ్‌ సింగ్‌ ను పెద్దల సభకు పంపారు కేజ్రీవాల్‌.

దీంతో అప్పటి నుంచీ ఆప్‌ లో ఉన్నా ఈ హిందీ వికటకవి చురుకుగా లేడు. అవకాశం రాగానే రెండు జాతీయ పార్టీల ప్రోద్బలంతో ఏఎన్‌ఐ ఇంటర్వ్యూతో బాంబు పేల్చాడు విశ్వాస్‌. దీనిపై భాజపా, కాంగ్రెస్‌ ఆరోపణలకు, విశ్వాస్‌ చెప్పిన మాటలకు శుక్రవారం కేజ్రీవాల్‌ దీటైన జవాబు ఇచ్చారు. విశ్వాస్‌ మాటలు హాస్య కవిత్వం అనీ, చక్కటి బక్వాస్‌ (చెత్త) అని తేల్చేశాడు దిల్లీ నేత.

ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్న ‘చతుర్‌ బనియా’ (తెలివైన కోమటి) కేజ్రీవాల్‌!
––––––––––––––––––––––––––––––––––––––––––––––––

2012 నవంబర్‌ చివర్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించిన ఎందరో పెద్ద నేతలు, విశ్వసనీయత ఉన్న మేధావులు (ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్రయాదవ్, మయాంక్‌ గాంధీ, అశుతోష్‌ వంటి హేమాహేమీలు) పోయినా కేజ్రీవాల్‌ చలించలేదు. తనకు దీర్ఘకాల దోస్తులైన మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ వంటి వారితో విజయవంతంగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏడేళ్లుగా జాతీయ రాజధాని ప్రాంత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్ర సర్కారుతో, కేంద్ర ప్రభుత్వ ఏజెంటు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లతో నిరంతరం ఘర్షణ పడుతూనే విద్య, ప్రజారోగ్యం వంటి కీలక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించారు ఆమ్‌ జాతీయ కన్వీనర్ అరవింద్‌.

దగ్గర దగ్గర రాహుల్‌ గాంధీ వయస్కుడైన కే జ్రీవాల్‌ (53 ఏళ్లు) రాజధానిలో అద్భుతాలు సృష్టించి పంజాబ్‌ సీఎం కావాలనుకోవడం నేరం కాదు. ఒకవేళ పాకిస్తాన్‌ తరహాలో అనుకోకుండా ఖలిస్తాన్‌ ఏర్పడితే దానికి ప్రధానమంత్రి అవ్వాలనుకోవడం కూడా కేజ్రీవాల్‌ కు అనౌచిత్య విషయం కాదు. ఈ పదవులన్నీ చట్టాల ప్రకారం ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజల మద్దతుతో వచ్చేవే. కేంద్రంలో, దాదాపు 95 శాతం రాష్ట్రాల్లో తన ఆధిపత్యం సాగినప్పుడు ‘దేశభక్తి’ తన సొంత ఆస్తిగా, గుత్తాధిపత్యం ఉన్న అంశంగా కాంగ్రెస్‌ చూసేది. ఈ ధోరణి పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా కూడా కొనసాగింది.

1980ల మధ్యలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉండగా, ‘కేంద్రం మిథ్య’ అని వ్యాఖ్యానించినందుకు నందమూరి తారక రామారావుగారిపై రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ కేంద్ర సర్కారు దేశద్రోహ అభియోగం మోపాలని కూడా ఆలోచించింది. అలాంటి డిమాండ్లు కాంగ్రెస్‌ నేతల నుంచి వచ్చాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ అమేఠీలో ఓడిపోయి, కేరళ వైనాడ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాక రాహుల్‌ గాంధీకి ఫెడరల్‌ వ్యవస్థ గొప్పతనం, తమిళనాడు ఘనత అర్ధమౌతున్నాయి. మహత్మా గాంధీ తన ఆత్మకథలో, ‘గాంధీలు నాకు తెలిసి బనియా కులస్తులు. వారు మొదట కిరాణా వ్యాపారులు,’ అని రాసుకున్నారు.

మోహన్‌ దాస్‌ గాంధీ సరదాకే అన్న ‘నేను తెలివైన కోమటిని. నన్నెవరూ బురిడీ కొట్టించలేరు,’ అనే మాటలు, కేంద్ర హోం మంత్రి, గుజరాత్‌ కే చెందిన వ్యూహకర్త అమిత్‌ షా గతంలో ‘నేను చతుర్‌ బనియాను,’ అని గర్వంగా చేసుకున్న వర్ణన నేపథ్యంలో– వారి తర్వాత కులం కార్డు వాడడంలో అగ్రవాల్‌ బిడ్డ అయిన కేజ్రీవాల్‌ ఏమీ తక్కువ తినలేదని గత ఆరేళ్లలో రుజువైంది. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంకా సీఎం పదవిలోకి రాని కేజ్రీవాల్, ‘నేనూ బనియానే. నాకు నా ధర్మమేంటో తెలుసు,’ అంటూ సంపన్న వైశ్య వ్యాపారులను ఆకట్టుకున్నారు.

దేశానికే అతి పెద్ద వైశ్య నేత అయిన అమిత్‌ షా ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ముందు చావు దెబ్బతిన్నారు. మొత్తం 70 సీట్లలో ఆప్‌కు 67, బీజేపీకి 3 వచ్చాయి. 2013 చివర్లో బయటి నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం అయిన కే జ్రీవాల్‌ అదే హోదాలోనే ధర్నా చేసి అరాచకవాది అనే విమర్శలు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదుర్కొన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఖలిస్తానీల మద్దతు, కెనడా తీవ్రవాద సిక్కుల నుంచి నిధులు తీసుకున్నారనే ఆరోపణలు కేజ్రీవాల్‌ పై వచ్చాయి.

2015 ఫిబ్రవరి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ పత్రికల్లో ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్లలో–‘ ఉపద్రవీ గోత్రీకులు (బీభత్సం సృష్టించే శక్తులు) వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో గోల చేస్తారంటూ పేర్కొంది. అంతకు ముందు ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించకపోతే ధర్నా చేస్తామని కేజ్రీవాల్‌ చేసిన హెచ్చరికను పరోక్షంగా బీజేపీ ఇలా ప్రస్తావించింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఆప్, కేజ్రీవాల్‌ ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా, ‘బీజేపీ గత కొన్ని రోజులుగా మీడియా ప్రకటనల (యాడ్స్‌) ద్వారా నాపై వ్యక్తిగతంగా దాడులు చేస్తోంది. నా పిల్లల్ని కూడా వదలడం లేదు. ఇప్పుడు అన్ని హద్దులూ బీజేపీ దాటింది. మా కులం లేదా వర్గం (అగర్‌వాల్‌ వైశ్యులు) మొత్తాన్ని ‘ఉపద్రవీ’ (ఉగ్రవాద లేదా అరాచకవాద) అని ముద్రేశారు. వారేమైనా చెప్పదల్చుకుంటే నన్ను దూషించాలి గాని, మొత్తం అగ్రవాల్స్‌ పై దాడి చేయకూడదు,’ అని కేజ్రీవాల్‌ చాలా తెలివిగా దేశంలో అత్యంత సంపన్నమైన వైశ్య వ్యాపారవర్గం అగర్వాల్‌ను వివాద చిత్రంలోకి తీసుకువచ్చారు.

దీంతో గుజరాతీ సాధారణ వైశ్యుడైన అమిత్ షా అధ్యక్షతన నడుస్తున్న అప్పటి బీజేపీ బెంబేలెత్తిపోవాల్సి వచ్చింది. దేశంలో స్వాతంత్య్రం రాకముందు, వచ్చాక మహాత్మా గాంధీ, డా.రామ్‌ మనోహర్‌ లోహియాలు ఎవరినీ లెక్కచేయని ఆందోళనకారులుగా పేరు సంపాదించారు. గాంధీ బ్రిటిష్‌ వారిని, లోహియా (ఉత్తర ప్రదేశ్, బొంబాయిలో స్థిరపడిన అగర్వాల్‌ వైశ్య కుటుంబంలో పుట్టారు) 1950లు, 1960ల్లో తండ్రీకూతుళ్లను (నెహ్రూ, ఇందిర) గడగడలాడించారు. అమిత్‌ షాను ఈ ఇద్దరు వైశ్య నేతల సరసన చేర్చడం సబబు కాదు. ఎందుకంటే గుజరాత్‌ లో ఆయన మంత్రిగా ఏం చేశారో తెలీదుగాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఓ అధికార పార్టీ మనిషిగా సాధించిన ‘విజయాలు’ అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కావు.

ఇక నాలుగో వైశ్యుడు, డాక్టర్‌ లోహియా తర్వాత రెండో అగర్వాల్ అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపక్ష, అధికారపక్షాలు రెంటిలోనూ సమరశీల పాత్ర పోషించారు. పంజాబ్‌ విభజన జరిగిన తర్వాత (1966 అక్టోబర్‌) రెండేళ్లకు హరియాణా సివానీలో 1968 ఆగస్టులో పుట్టిన కేజ్రీవాల్‌ పొరుగున ఉన్న కాస్త పెద్ద రాష్ట్రం, విశ్వవ్యాప్తంగా తన బిడ్డలను పంపిన పంజాబ్‌ సీఎం కావాలనుకోవడం అసలు తప్పే కాదు. అలాగే, ఒకవేళ పంజాబ్‌ స్వతంత్ర దేశమైన పక్షంలో దానికి ప్రధాని మంత్రిగా సేవలందించాలనుకోవడం ఎలాంటి పాపం కాదు.

కెన్యా నల్ల తండ్రికి, అమెరికా శ్వేత జాతి తల్లికి పుట్టిన బరాక్‌ హుస్సేన్‌ ఒబామా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రెసిడెంట్‌ అయినప్పుడు, కేజ్రీవాల్‌ తరహా కోర్కెలు చట్ట విరుద్ధం కానేకాదు. అలాగే, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కూడా కాదు. పశ్చిమ యూపీలో పుట్టి పెరిగిన హిందీ బ్రాహ్మణ వికటకవి కుమార్‌ విశ్వాస్‌ మాటలు అగర్వాల్‌ రాజకీయ దురంధరుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఏమీ చేయలేవు. దేశంలో–సంపదలో గుజరాతీ హిందూ, జైన వైశ్యులు ఇద్దరు అగ్రస్థానంలో ఉండొచ్చుగాని తర్వాత స్థానాల్లో ఉన్న డజన్ల మంది కుబేరులు అగర్వాల్సేననే వాస్తవం మరువకూడదు.

పాకిస్తాన్, ఇండియాలోని పంజాబీ ప్రాంతాలు కలిసి స్వతంత్ర పంజాబ్‌ దేశం ఏర్పడే అవకాశాలు తక్కువ. అనూహ్యంగా భారత పంజాబ్, ఇతర సరిహద్దు జిల్లాల పంజాబీ ప్రాంతాలు (రాజస్థాన్, హరియాణా, హిమాచల్, ఉత్తరాఖండ్‌) కలిసి ఖలిస్తాన్‌ ఏర్పడితే పంజాబీ మాతృభాషగా ఉన్న జాట్‌ సిక్కుకు (జనాభా రీత్యా ఎక్కువ కాబట్టి) బదులు హరియాణ్వీ అగర్వాల్‌ వైశ్యుడు ప్రధాని పదవిని ఆశించడం నిజంగా సాహసమే. ఆహ్వానించదగ్గ పరిణామమే. ‘నేను వరల్డ్స్‌ స్వీటెస్ట్‌ టెరరిస్ట్‌’ అని నేటి మీడియా మీట్‌ లో కేజ్రీవాల్‌ చాలా హుషారుగా అన్న మాటలు– భారతీయ అగర్వాల్స్‌కు, వైశ్యులకు ఎంతో ధైర్యం ఇస్తాయో లేక ఆగ్రహం తెప్పిస్తాయో–చూడాలి మరి. మార్చి పదిన వచ్చే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్‌ ఎంతటి ‘ఉపద్రవీ’యో తేలిపోతుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions