ఒక పోస్టు సింపుల్‌గా ఆసక్తికరంగా అనిపించింది… నలుగురు సినిమా తారల ఫోటోల్ని ఒక్కచోట ఫ్రేమ్ చేశారు… అందులో ఒకరు హేమమాలిని, మరొకరు మౌసమీ ఛటర్జీ, ఇంకొకరు జుహీ చావ్లా, వేరొకరు మాధురీ దీక్షిత్… వాటి కింద హేమమాలిని ఆఫ్రికన్ అనీ, మౌసమీ ఛటర్జీ చైనీస్ అనీ, జుహీ చావ్లా వైట్ అనీ, మాధురీ దీక్షిత్ అరబ్బు అనీ రాశారు…
అర్థమైంది కదా… శామ్ పిట్రోడా పిచ్చి కూతలకు ఎవరో తమదైన స్టయిల్‌లో క్రియేటివ్ ప్రశ్నను ఎదురుదాడిగా సంధించాడని..! నిజమే కదా, దేశం గర్వించదగిన అందగత్తెలు, ఏళ్ల తరబడీ వెండితెరను ఏలిన మహారాణులు… ఒక్కరి లావణ్యాన్ని గానీ , అందమైన ముఖాకృతిని గానీ వంకపెట్టగలమా..?
వీరిలో మౌసమీ ఛటర్జీ, కోల్‌కత్తా… (మొదట్లో కాంగ్రెస్, తరువాత బీజేపీ, రాజకీయాల్లో యాక్టివ్)… హేమమాలిని, తమిళనాడు… (ఈమె కూడా బీజేపీ)… జుహీ చావ్లా, హర్యానా… మాధురీ దీక్షిత్, మహారాష్ట్ర…
Ads
అంతెందుకు…? ఇదే అంకుల్ శామ్ పిట్రోడా ఆఫ్రికన్లలా కనిపిస్తారని కూసిన సౌత్ ఇండియా నుంచే రేఖ, హేమమాలిని మాత్రమే కాదు జయప్రద, శ్రీదేవి నుంచి ఇప్పటి రష్మిక దాకా… అఫ్‌కోర్స్, అందమైన మగ తారలూ బోలెడు మంది… సరే, నిజంగానే ఇండియా మొత్తం ఒకే జాతి కాదు, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరిన పలు జాతులు స్థానికంగా ఎదిగాయి, వ్యాపించాయి అనే అకడమిక్ డిస్కషన్ చాన్నాళ్లుగా ఉన్నదే… నిజంగానే భారతదేశంలో జాతుల్లో, భాషల్లో, సంస్కృతుల్లో, ఆహార్యంలో, ఆహారంలో, అన్నింట్లోనూ ఉన్నంత వైవిధ్యం మరే దేశంలోనూ కనిపించదు… భిన్నత్వంలో ఏకత్వానికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ మన దేశం… అయితే…
కానీ సరైన భాషలో, సరైన రీతిలో విషయాన్ని చెప్పగలగాలి… దేశం బోలెడంత వైవిధ్యం, భిన్నత్వంలోనూ ఏకంగా నిలిచి ఉందనీ, ఇలాంటి దేశం మరొకటి లేదని చెప్పడం వేరు… ఫలానా ప్రాంతం వాళ్లు ఫలానా వాళ్లలాగా కనిపిస్తారని బ్లాంకెట్ స్టేట్‌మెంట్ పాస్ చేయడం వేరు… అసలే పొలిటికల్ హీట్ బాగా ఉంది దేశంలో… ఇంకేముంది..? శామ్ మాటల్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకులు ఉతకడం మొదలెట్టారు…
అసలే కాక మీదున్న మోడీ కాక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఇలాంటి వర్ణవివక్షతో వ్యతిరేకించింది కాంగ్రెస్ అని తూలనాడేదాకా వెళ్లిపోయాడు… దేశమంతా ఛీకొట్టేసరికి… ఇన్నేళ్లుగా కాంగ్రెస్‌ను పట్టుకుని వేలాడుతున్న ఓవర్సీస్ కాంగ్రెస్ 82 ఏళ్ల అధ్యక్షుడు ఇక రాజీనామా చేశాడు, కాంగ్రెస్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది… అదైపోయిందో లేదో… అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరి కూడా శామ్ పిట్రోడా కూతల్ని సమర్థించే పనిలో పడ్డాడు…
కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి తల్నొప్పి కేరక్టర్లు చాలానే ఉన్నాయి… ఈయన లోకసభలో కాంగ్రెస్ సభాపక్షనాయకుడు… పీఏసీ ఛైర్మన్, మాజీ మంత్రి, బెంగాలీ… శామ్ పిట్రోడా వ్యాఖ్యల మీద ఒకవైపు బీజేపీ దుమారం లేవదీస్తుంటే ఈయన సైలెంటుగా ఉండకుండా తనూ కాస్త పెట్రోల్ పోశాడు…
(కార్టూన్ సౌజన్యం :: సుభాని)
దేశంలో పలు జాతుల వాళ్లు ఉన్నమాట నిజమే కదా, నీగ్రోలు కూడా ఉన్నారు… మన దేశంలో నెగ్రిటో క్లాస్ (నీగ్రోలు-ఆగ్నేయాసియాలోని నల్ల జాతీయుల తెగ), ప్రోటో ఆస్ట్రేలియన్, మంగోలియన్ తరగతి ప్రజలు ఉన్నారు… కొందరు తెల్లగా, కొందరు నల్లగా… అని చెబుతూ పోయాడు.,.
మామూలు సందర్భాల్లో వేరు, ఎక్కడ చాన్స్ దొరికినా సరే, ఆడుకునే పొలిటికల్ పీక్స్ సీజన్ ఇది… ఇలాంటి పిచ్చికూతలు ఇదే మొదటిసారి కాదు సదరు అధీర్ రంజన్ చౌదరికి… ఆమధ్య ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని సంబోధించాడు… దానిపైనా దుమారం రేగింది… కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడి, ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వచ్చింది… నిజంగానే యాణ్నుంచి వస్తార్రా మీరంతా..?!
Share this Article