.
భాగల్పూర్‌లో జరిగింది ఈ డ్రామా…. లలిత్ కిశోర్, ఐఏఎస్ అధికార దర్పంతో ఒక అకస్మిక తనిఖీకి వెళ్లాడు… అక్కడ విధి నిర్వహణలో ఉన్న లోకల్ ఎస్‌డీఎం (సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) ఆయన్ను గుర్తించలేకపోయాడు… కొత్త అధికారి అనుకుని, చాలా మర్యాదగా, “సార్, మీరెవరు, మీ హోదా ఏమిటి?” అని వినయంగా అడిగారు.
ఎస్‌డీఎం అమర్యాదకు లలిత్ కిశోర్ మరింత రెచ్చిపోయాడు… అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు… “హమ్‌కో నహీ పెహచాన్‌తే హో?” (నన్నే గుర్తించలేవా?) అంటూ ఎస్‌డీఎంపై ఆవేశంగా అరిచాడు… ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అధికారికే ఈచ్చి రెండు చెంపదెబ్బలు కూడా ఇచ్చాడు..!
Ads
అంత మంది జనాల మధ్య అవమానం పాలైన ఎస్‌డీఎం కోపం, భయంతో వణికిపోయాడు… ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఎదురైన దాడిగా భావించి, ఫిర్యాదు చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు… అనుకుంటాం గానీ… దరిద్రమైన హయ్కారార్కీ పోలీసుల్లోనే కాదు, సివిల్ సర్వెంట్లలోనూ ఎక్కువే…
ఆ తరువాత కొన్నాళ్లకు అదే ఎస్‌డీఎం ఓ వార్త టీవీల్లో చూశాడు…. నిర్ఘాంతపోయాడు… తనను కొట్టి, అవమానించినవాడు అసలు ‘ఐఏఎస్’ అధికారి కాదు… ఓ ఫేక్… ఓ ఫ్రాడ్… వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, భాగల్పూర్ ఘటనపై ఫిర్యాదు చేశాడు.,.
ఎస్… సదరు ఫేక్ ఐఏఎస్ కథలు, వార్తలు చాలా వినిపిస్తున్నాయి ఈమధ్య… సరే, ఈ ఫ్రాడ్ గురించే చెప్పుకుందాం ఓసారి… లలిత్ కిశోర్, ఐఏఎస్, 2022 బ్యాచ్… ఊరు బీహార్‌లోని సీతామఢ్… మ్యాథ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్… అసలు పేరు లలిత్ కిశోర్ కాదు… ఏ బ్యాచూ లేదు… అంతా ఫేక్… అది పెట్టుకున్న పేరు… అసలు పేరు గౌరవ్ కుమార్ సింగ్…
యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోయాడు… ఐతేనేం… తనలోని క్రిమినల్ బుర్ర చాలా షార్ప్… ఓ వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాడు… నకిలీ నియామక పత్రాలు, ఫోర్జరీ పత్రాలు, సీళ్లు, ఫైళ్లు అన్నీ రెడీ… నిరంతరం ఎరుపు- నీలం బీకన్ లైట్లు ఉన్న ఇన్నోవాలో ప్రయాణం… అతడికి సేవ చేయడానికి, భద్రత కల్పించడానికి ఏకంగా 15 మంది సిబ్బంది (వారిలో 10 మంది అద్దె గుండాలు/బౌన్సర్లు)… ఈ లగ్జరీ అబద్ధాన్ని కొనసాగించడానికి నెలకు ₹5 లక్షలు ఖర్చు చేసేవాడు…
“ఐఏఎస్ ఆఫీసర్ లలిత్ కిశోర్” అనే ఈ అద్భుతమైన ఫేక్ డ్రామాను ఉపయోగించి కాంట్రాక్టర్లు, ఉద్యోగార్థులను టార్గెట్ చేశాడు… ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో ఏకంగా 40 మందికి పైగా అతడి మోసానికి బలయ్యారు… ఒక్క టెండర్ డీల్‌లోనే ₹5 కోట్లు రాబట్టాడని అంచనా..!
ష్… ఇంకా చాలా ఉంది…
ఫేక్ ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, లలిత్ కిశోర్ పర్సనల్ లైఫ్‌లోనూ భారీ డ్రామా నడిచింది… నలుగురు గర్ల్‌ఫ్రెండ్‌లను మెయింటెయిన్ చేశాడు… వారందరూ అతడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని గాఢంగా నమ్మారు… వీరిలో ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్‌లు గర్భం దాల్చినట్టు పోలీసుల విచారణలో తేలింది…!
ఫేక్ అని మాకేం తెలుసు..? ఒరిజినలే అనుకుని లొంగిపోయాం అన్నారట... ఈ మొత్తం కథలో ఇదీ అసలు వికృతకోణం...
లలిత్ కిశోర్ మోసం ఒక వ్యాపారవేత్త ద్వారా బయటపడింది… ఆ వ్యాపారవేత్త అతడికి ఇవ్వాల్సిన దాదాపు కోటి రూపాయలతో గోరఖ్‌పూర్ స్టేషన్‌లో పట్టుబడ్డాడు… ఆ వ్యాపారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు రంగంలోకి దిగారు… లక్నోలో తన లగ్జరీ విలాసాల్లో తేలిపోతున్న గౌరవ్ కుమార్ సింగ్‌ను పోలీసులు చాకచక్యంగా రీసెంటుగా అరెస్ట్ చేశారు…
.
ఐఏఎస్ కావాలనే కోరిక, దాన్ని నెరవేర్చుకోలేని నిరాశ... లలిత్ కిశోర్ అనే ఒక భారీ నకిలీ ప్రపంచాన్ని సృష్టించడానికి దారి తీసింది... కానీ నకిలీ ఎప్పటికీ నిలబడదు అని ఈ కథ మరోసారి నిరూపించింది...
.
ఏం మోసాలు చేసినా ఒరిజినల్సే చేయాలి… వందలు, వేల కోట్ల ఫ్రాడ్లు… చివరకు కడుపులు కూడా… నకిలీలు చేస్తే వ్యవస్థ ఊరుకోదు… ఒరిజినల్స్ చేస్తే ఎవ్వడూ శిక్షించలేడు మన వ్యవస్థలో… అదీ అంతిమంగా చెప్పాలనుకునేది..!!
Share this Article