మరో హిందీ సినిమా ఢామ్మని పేలిపోయింది… హీరో, హీరోయిన్లు ఎవరైతేనేం..? బ్యానర్ ఏదయితేనేం..? దర్శకుడు ఎవరైతేనేం..? సినిమా ఎలా ఉంటేనేం..? ఎంత ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసుకుంటేనేం..? ‘‘మా సినిమా బాయ్‌కాట్ చేయండి ప్లీజ్, హ్యాష్ ట్యాగ్ వైరల్ చేయండి దయచేసి’’ అంటూ బాయ్‌కాట్ పిలుపుల మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు హీరోయిన్ తాప్సి, దర్శకుడు అనురాగ్ కశ్యప్… ‘అసలు ఈ షోలను కేన్సిల్ చేసే కల్చర్ ఏమిట్రా బాబోయ్’ అంటూ పకపకా జోకులేసుకుని నవ్వారు… సినిమా పేరు దొబారా…
నవ్వారు కదా… ఏడుపే మిగిలింది… జనం సీరియస్‌గానే తీసుకుని ఛీత్కరించేశారు… ఎంత దారుణం అంటే, తొలిరోజు కనీసం 2, 3 శాతం ఆక్యుపెన్సీ లేదట… అనేక షోలను నిజంగానే కేన్సిల్ చేశారు… సినిమా ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కదేల్ ట్విట్టర్ రివ్యూ ఏమిటంటే..? ‘‘ఓపెనింగ్ రోజు జస్ట్, 20 నుంచి 35 లక్షలు మాత్రమే రాబట్టిందేమో బహుశా… సినిమా మొత్తమ్మీద కోటిన్నరకు మించి కలెక్షన్లు వస్తే అదే గొప్ప… బాలీవుడ్‌లో కలకలం రేపుతున్న బాయ్‌కాట్ ట్రెండ్ ఈ సినిమాను కూడా దెబ్బతీసింది…’’
నిజానికి తాప్సి, అనురాగ్ కశ్యప్ ట్రాక్ రికార్డు ఏమాత్రం సరిగ్గా లేదు ఈమధ్య… కానీ ఈ సినిమాకు మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది… కొందరు రివ్యూయర్లు మంచి రేటింగ్స్ ఇస్తే, మరికొందరు బాగాలేదని పెదవి విరిచారు… ఐనా రివ్యూలు కూడా ఓ దందా అయ్యాయి కాబట్టి, వాటిని కాసేపు వదిలేద్దాం… ఇది 2018 నాటి స్పానిష్ సినిమా మిరేజ్‌కు అధికారిక రీమేక్… ఓ ఫాంటసీ… ఎప్పుడో 1996 కాలానికీ, వర్తమానానికీ ముడిపెట్టి, లంకెవేసి కథను నడిపించడం…
Ads
అంతకన్నా లోతుగా రివ్యూ ఇక్కడ అవసరం లేదు… ఫస్టాఫ్ ఓ మోస్తరుగా ఉన్నా, దర్శకుడు సెకండాఫ్ చెడగొట్టేశాడని టాక్… ఎప్పుడో పూర్వకాలానికీ, వర్తమాన కాలానికీ లింక్ పెట్టిన కథ ఈమధ్యే చూసినట్టు అనిపిస్తోందా..? అవును, తెలుగులో కూడా అదేదో సినిమా వచ్చింది… ఇలాంటివి కన్విన్సింగుగా, ఇంట్రస్టింగుగా చెప్పడం పెద్ద టాస్క్… అందులో అనురాగ్ కశ్యప్ సక్సెస్ కాలేకపోయాడు… అది ఒక మైనస్ పాయింట్ కాగా… ప్రిరిలీజ్ ప్రమోషన్ మీటింగుల్లో తాప్సి, కశ్యప్‌ల మాటలు, వ్యాఖ్యలు కూడా కౌంటర్ ప్రొడక్ట్ అయ్యాయి… (అందుకే సినిమాల ప్రిరిలీజ్ ముందు ఆయా సినిమాల ముఖ్యులు నోరు అదుపులో పెట్టుకోవాలి…)
నిజానికి సినిమా ఎలా ఉందనేది ముఖ్యం కాదు… అసలు జనం థియేటర్లకు రావడం లేదు… కాస్త తెలుగు సినిమాలు నయం… హిందీ సినిమాలైతే తన్నేస్తున్నాయి… ఈ సినిమా కూడా అదే ట్రెండ్… కాకపోతే మరీ ఈ దయనీయ స్థాయి ఎవరూ ఊహించలేదు… చూడబోతే కంగనా రనౌత్ ధాకడ్ సినిమా చెత్తా రికార్డులను కూడా ఈ దొబారా సినిమా తిరగరాసేట్టుంది… ఒకవైపు లాల్‌సింగ్‌చద్దా, రక్షాబంధన్ సినిమాల్ని థియేటర్ల నుంచి ఎత్తిపారేస్తూ… ఎంచక్కా కార్తికేయ-2 సినిమాను వేస్తున్నారు…
ఈ దొబారా రిజల్ట్ కూడా తన్నేయడంతో ఇక హిందీ నిర్మాతలు తమ సినిమాల్ని ఇప్పట్లో రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు… వణికిపోతున్నారు… ఈ దుర్దినాల్లో సైతం తెలుగు కార్తికేయుడు దుమ్మురేపుతున్నాడు… తొలిరోజు 50 థియేటర్లు కష్టమ్మీద దొరకగా, ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్లలో నడుస్తోంది… బాలీవుడ్ పెద్దలు తలలుపట్టుకున్నారు… చూడబోతే హిందీ సినిమా ఏదో సంధిదశలో ఉన్నట్టుంది…!!
Share this Article