ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా రోజులైంది కదా… మరి ఇప్పుడు నిశిత విశ్లేషణలు వస్తున్నాయెందుకు..? అంతలేసి రేట్లు పెట్టి, ఆ చరిత్ర వక్రబాష్యాన్ని థియేటర్లలో చూడటానికి చాలామంది ఇష్టపడలేదు… ఇప్పుడు ఓటీటీలో వచ్చాక, నడుమ నడుమ పలుసార్లు ఆపేస్తూ ఎలాగోలా సినిమాను చూశామనిపించి, ఇక స్పందిస్తున్నారు… నిర్మొహమాటంగా తమ విమర్శల్ని, అభ్యంతరాల్ని ఎక్కుపెడుతున్నారు… ఆ సినిమా రిలీజ్ సమయంలోనే ఒకటీరెండు గొంతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు… సినిమాలోని ఏయే సీన్లు గతంలో ఏయే సినిమాల్లో కనిపించాయో కూడా ఏకరువు పెట్టారు… మిత్రుడు ప్రభాకర్ జైనీ వంటి చిన్న నిర్మాత రాజమౌళి, జూనియర్, రాంచరణ్ కాంబో క్రియేటివ్ వికారం పట్ల నిరసనను, అభ్యంతరాల్ని వ్యక్తం చేయడం విశేషమే… కానీ అలా పెగిలిన గొంతులు ఎన్ని..? ఇప్పుడు వాడ్రేవు చినవీరభద్రుడి రివ్యూ బాగా వైరల్ అయ్యింది… దాంతోపాటు ఫేస్‌బుక్‌లో కనిపిస్తున్న Aranya Krishna రివ్యూ కూడా ఘాటుగా, పదునుగా ఉంది… డిబేట్ నడిస్తే మంచిదే… అందుకే అది యథాతథంగా…
‘‘నీకు చరిత్ర తెలియకపోతే క్షమిస్తాం. కానీ బుకాయింపులకు పూనుకుంటే మాత్రం నిన్ను చీదరిస్తాం. నువ్వు మా సమకాలికుడివైనందుకు సిగ్గుపడతాం. త్యాగధనుల పేర్లను సొమ్ము చేసుకునే నీ లాంటి వాళ్లను అసహ్యించుకుంటాం. నీ సమర్ధకుల మనో వైకల్యానికి జాలిపడతాం.
****
Ads
ఒక డిస్క్లెయిమర్ ఇస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడటానికి, ఎన్ని దబాయింపులకైనా పాల్పడటానికి, ఎన్ని వక్రీకరణలకైనా పూనుకోడానికి, జనాల్ని ఎంత పిచ్చివాళ్లనైనా చేయడానికి లైసెన్స్ వస్తుందన్న మాట. తెలుగు నేల మీద అద్భుత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసిన ఇద్దరు చారిత్రిక వ్యక్తుల పేర్లను తీసుకొని సినిమా తీసి వాళ్ల జీవితాలతో మా సినిమాకి ఏం సంబంధం లేదని చెప్పడం మించిన లజ్జారాహిత్యం మరొకటి లేదు. పరాయిపాలనకు, రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది జనాన్ని సమీకరించి, వారిని ఉత్తేజితుల్ని చేసి స్వాతంత్ర్యం వైపు, విముక్తి వైపు నడిపించిన ఇద్దరు త్యాగధనుల పేర్లను సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం అన్ని రకాల విలువల్ని వదులుకొని నడిబజార్లలో దిశమొలతో నిలబడగల వ్వాణిజ్య కక్కుర్తి తప్ప మరోటి మరోటి కాదు.
ఒక తరం అంతరం వున్న ఇద్దరూ కలిసి తెల్లవాళ్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అనే కథాంశంతో సినిమా తీస్తున్నారన్న వార్తల్ని మీడియా ద్వారా ప్రచారం చేయించి, జనాల్లో ఆసక్తి కలిగించి ఆ తరువాత మాకూ, ఆ ప్రచారానికీ ఏం సంబంధం లేదనడం, ఒక డిస్క్లెయిమర్ మన మొహాన పడేయడం ఈ మూవీ మేకర్స్ అనైతికతకు, వారి అవకాశవాదాన్ని సమర్ధించే వాళ్ల అజ్ఞానానికి నిదర్శనం. దర్శకుడు చెప్పాడా ఇది ఆ ఇద్ద్దరు గొప్ప వ్యక్తుల గురించి తీసిన సినిమా అని అడిగే మోకాలి మెదడు వ్యాధిగ్రస్తులకు అడిగేది ఏమిటంటే మీడియా అలా ప్రచారం చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదని ఆయన అప్పుడే ఎందుకు చెప్పలేదు? అతను చెప్పేంతవరకు ఎవరూ నమ్మకండి అని అనకుండా మోకాలి మెదడు వ్యాధి పీడితులు ఎందుకు నోర్మూసుక్కూర్చున్నట్లు? ఎందుకంటే వాళ్లది కంప్యూటర్ గ్రాఫిక్స్ హీరోయిజాలకు మానసిక బానిసత్వం. కళకి బదులుగా సాంకేతిక హంబక్ ని అడ్మైర్ చేసే అజ్ఞానం.
ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఓ థర్డ్ గ్రేడ్ స్టోరీ. వీరభద్రుడు గారన్నట్లు గిరిజన తెగల పేర్లు చెప్పి వారి కనీస సంస్కృతిని చూపించలేని అజ్ఞానం ఈ దర్శకుడిది. గోరింటాకు పెట్టించుకోడానికి గోండ్ల పిల్లను ఎత్తుకుపోతారా ఆమె తల్లిని చంపేసి? ఆ పిల్లని విడిపించడానికి ఎలుకల్ని బోనులో పట్టినట్లు పెద్ద పులుల్ని, సింహాల్ని పదుల సంఖ్యలో వేటాడి, బంధించి ఢిల్లీకి తీసుకుపోతాడా హీరో? ఏమన్నా కథా ఇది అసలు? దర్శకుడికి మతి మాలడం తప్పిస్తే!
ఎక్కడ దాచాడు వాటిని ఢిల్లీలో? వాటి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా? పైగా మృగాలన్నింటినీ పులుల నుండి దుప్పి వరకు. (నాగు పాముల్ని చూపించలేదెందుకో మరి!) ఒకే వ్యాన్లో వేసుకొచ్చి కోట లోపల వదుల్తాడు హీరో. అసలు లెక్క ప్రకారం ఐతే స్పాట్ కి తీసుకొచ్చే సమయానికి అందులో పులులు, సింహాలు తప్ప ఏమీ బతికుండకూడదు. ఎంత ఫాంటసీ ఐనా అందులో వెర్రి ఐడియానా? వినోదం పేరుతో ఇంత అతి పైత్యం చూపించడం తెలుగు దర్శకులకే చెల్లు.
ఇందులో హీరోల సాహసాలు సూపర్ హ్యూమన్ గా వుంటాయి. కెమెరామెన్, స్టంట్ మాస్టర్స్, విఎఫెక్స్ నిపుణుల మద్దతు వుంటే అలాంటివి ఎవరైనా చేయొచ్చు. ఇలాంటి దర్శకులు తెలుగు సినిమాని, భారతీయ సినిమాని (ఇది పెనం ఇండియా అదే పాన్ ఇండియా సినిమా కదా) ఈ రాజమౌళి వంటి దర్శకులు ఎదగనీకుండా కాళ్లు పట్టి గుంజుతూనే వుంటారు. వీళ్లకి సినిమా అంటే కళ కూడా అనుకోరు. ఓ వ్యాపారం మాత్రమే అనుకుంటారు. పోనీ ఆ వ్యాపారాత్మక సినిమాల్నైనా సృజనాత్మకంగా తీస్తారా అంటే వీళ్లకి అభూతకల్పనలకి, సృజనాత్మకతకి తేడా తెలిసి చావదే!
జాతిని జాగృతం చేసిన మహనీయుల పేర్లని ఊర మాస్ హీరోలకు తగిలించి, వాళ్లతో తెల్లదొరల సమక్షంలో తైతక్కల డాన్సులు చేసినట్లు చూపించడం ఓ వాణిజ్య దగుల్బాజీతనం. సినిమా చివర్లో రాముడు రావడం లేదా హిందూత్వ ప్రస్తావన చేయడం ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఓ ట్రెండైంది. ఇది “రాజపోషణ” కోసం టాలీవుడ్ చేస్తున్న ఐటం డాన్స్ ధోరణి. విపరీతమైన హైప్ క్రియేట్ చేసి, సీఎంస్ ని పట్టుకొని, కాళ్లా వేళ్లా పడి టికెట్ రేట్స్ పెంచుకొని, మీడియా మానేజ్ చేసి, జనాల్ని అడ్డగోలుగా దోచుకొని, హమ్మయ్య ఓ వేయి కోట్లు సంపాదించుకున్నామనే అనైతిక తృప్తి ఈ సినిమా రూపకర్తలది. చెప్పడానికి ఒక్క మంచి మాట దొరకని సినిమా ఇది.
Share this Article