సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కదా ఉదయనిధి పిలుపునిచ్చింది… దేశమంతా దాని గురించే మాట్లాడుతోంది కదా… ఇతరత్రా వ్యవహారాలన్నీ పక్కకుపోయి అందరి చర్చా దీనిపైనే కేంద్రీకృతం అవుతోంది కదా… ఎస్, డీఎంకే ఆశించిందే అది… విజయవంతంగా స్టాలిన్ తన ప్రభుత్వ ముఖ్యుల అక్రమాలపై నుంచి ప్రజల చర్చను దారి మళ్లించాడు… కొడుకును ముందుపెట్టి కథ నడిపిస్తున్నాడు…
ప్రతిపక్షం ఎఐడీఎంకే బాగా బలహీనపడిపోవడం, మరో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం, బీజేపీకి బలం లేకపోవడం, కాంగ్రెస్ తన గూటిలోనే పదిలంగా ఉండిపోవడం, లెఫ్ట్ కూడా తన కూటమిలోనే ఉండటం స్టాలిన్‌కు బాగా కలిసొస్తోంది… ఇక డీఎంకే ముఖ్యులు రాష్ట్రంపై పడ్డారు… ఈ అరాచకాన్ని చూసి అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి పీటీఆర్‌పై తొలుత వేటు వేశాడు స్టాలిన్…
తన స్థానంలో తను చెప్పినట్టు తలూపే తంగం తెన్నెరసును తెచ్చిపెట్టుకున్నాడు… తరువాత వి.సెంథిల్ బాలాజీ దొరికిపోయాడు పలు అక్రమాల్లో… ఈడీ కొరడా తీసి చెళ్లుమనిపించింది… జైలు… అయితేనేం, తన మంత్రి పదవి పదిలం… మరి పార్టీకి, తనకు ప్రధాన ఆర్థికవనరు కదా… కేబినెట్‌లోనే కొనసాగిస్తూ కాపాడుకుంటున్నాడు స్టాలిన్… ఈ ప్రేమపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్టాలిన్‌కు చీవాట్లు పెట్టారు… ఐనాసరే స్టాలిన్ వినిపించుకోలేదు…
Ads
తరువాత ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి దొరికిపోయాడు… తనపైనా ఈడీ దాడులు చేసి బోలెడు అక్రమాల్ని వెలికితీసింది… కావాలని కేంద్ర ప్రభుత్వం తమ పార్టీపై, తమ ప్రభుత్వంపై టార్గెటెడ్‌గా దాడులు చేయిస్తోందని డీఎంకే ప్రముఖులు ఆరోపిస్తూనే ఉన్నారు… ఇప్పుడు ఈడీ తాజాగా రాష్ట్రంలో ఇసుక మాఫియాపై విరుచుకుపడింది… దాదాపు 40 లొకేషన్లలో ఒకేసారి దాడులు చేసింది…
ఈ ఇసుక యవ్వారంలో ఉదయనిధి పాత్ర కూడా ఉందంటారు, అవేమీ బయటకురావడం లేదు కానీ రాష్ట్ర నీటివనరుల మంత్రి, డీఎంకే జనరల్ సెక్రెటరీ దురై మురుగన్ దొరికిపోయే ఆధారాలను ఈడీ తవ్వితీసింది… ఈ నాయకుడు కరుణానిధి కేబినెట్‌లో కూడా మంత్రిగా చేశాడు, పార్టీలో చాలా సీనియర్… ఈ ఇసుక మాఫియా నుంచి ఎన్నికల కోసం నిధుల సమీకరణ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ సందేహం…
15 జిల్లాల్లో ఇసుక మాఫియా తన అక్రమాల్ని కొనసాగిస్తోంది… తిరుచ్చి, కరూరు, వెల్లూరు, పదుకొట్టై జిల్లాల్లోని 40 లొకేషన్లలో సాగిన దాడుల్లో మాఫియా ప్రముఖులు రామచంద్రన్, దుండిగల్ రత్నం, కరికాలన్ తదితరుల అక్రమాల్ని ఈడీ తవ్వి తీసింది… వీరందరిలోనూ ప్రముఖుడు రామచంద్రన్… ఆయన ఆఫీసులోనూ, నివాసంలోనూ ఈడీ దాడులు సాగాయి… భారీగా పన్ను ఎగవేత ఆధారాల్ని కూడా పట్టుకుంది… ఒకేసారి దాదాపు 15 టీమ్స్ ఈ దాడుల్ని నిర్వహించాయి…
స్టాలిన్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులపై ఇప్పుడు ఈడీ కేసులున్నయ్… ఒకరు జైలులో ఉన్నాడు… అవినీతి పెచ్చుపెరిగింది… ఐతేనేం, ప్రజల్లో చర్చను, ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి సనాతన ధర్మనిర్మూలన అనే వ్యాఖ్యలు… డీఎంకేకు మొదటి నుంచీ ఇదే అలవాటు… ఇప్పుడూ అంతే… జనం కూడా డీఎంకే అవినీతిని మరిచిపోయి ఉదయనిధి వ్యాఖ్యల గురించే చర్చించుకుంటున్నారు… అవునూ, ఎప్పుడైనా స్టాలిన్ అల్లుడు, స్టాలిన్ కొడుకు ధరించే వాచీలు, బట్టలు, కొనే కార్ల ఖరీదు, విలాసాలు, అట్టహాసపు జీవితాల గురించి వార్తలు చదివారా..? బోలెడు…!! విస్తుపోయే రీతిలో..!!
Share this Article