మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే…! అసలే తమిళ రాజకీయాల సంక్లిష్టత అర్థం చేసుకోలేక… చిత్రవిచిత్ర సమీకరణాలతో ఆడుకుని, తీరా తను ఆశించిన ఏ సానుకూలతా ఇప్పుడు కనిపించక మూలుగుతున్న బీజేపీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ అంశంతో మరింత దిక్కుతోచని స్థితి ఏర్పడింది… నిజానికి ఇదొక ఇంట్రస్టింగు డిబేట్… జయలలిత మరణించాక, శశికళను జైలుకు పంపించేశాక, ఇప్పటికీ ఆమెను రాజకీయ చట్రం నుంచి బయటికి తరిమేశాక, రజినీకాంత్‌ను దూరం కొట్టేశాక… ఇప్పుడు బీజేపీకి కనిపించే పరిస్థితి ఏమిటి..? ఏమాత్రం జనాకర్షణ లేని రెండు కేరక్టర్లు… లక్కు కొద్దీ సీఎం అయిన పళనిస్వామి, లక్కూ, బ్యాడ్ లక్కూ నడుమ ఎప్పుడూ ఊగిసలాడే పన్వీర్ సెల్వం… జనంలో వ్యతిరేకత… మరోవైపు బలంగా కనిపిస్తున్న డీఎంకే కూటమి… ఏమి సేతురా లింగా అని తలకు చేతులు పెట్టుకున్న బీజేపీ మీద హఠాత్తుగా ఓ తాటిపండు పడింది… దీని నేపథ్యం ఏమిటంటే..?
శ్రీలంకలో తమిళ ఈలం పోరాటాలు తెలుసు కదా… ఎల్టీటీఈ పేరిట ప్రభాకరన్ మూడు దశాబ్దాలపాటు సాగించిన సాయుధ పోరాటం తెలుసు కదా… దేశాన్ని దాదాపు విభజన అంచుల దాకా తీసుకొచ్చాడు… ఈ పోరాటంలో దాదాపు లక్ష మంది మరణించినట్టు అంచనా… కానీ శ్రీలంక సింహళులు రాజీపడరు… దొరికిన కొన్ని అవకాశాల్ని వాడుకుని మొత్తం టైగర్లను సమూలంగా నిర్మూలించారు… ఆ సందర్భంగా శ్రీలంక సైన్యం కసికసిగా యుద్ధనేరాలకు పాల్పడింది… మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగింది… చివరి దశలో సైన్యం చేతుల్లో 40 వేల మంది దాకా తమిళులు అత్యాచారాలకు, హత్యాకాండకు బలైపోయినట్టు చెబుతారు… చివరకు ప్రాణాలతో పట్టుబడిన ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్‌ను కూడా సైన్యం క్లోజ్డ్ రేంజులో కాల్చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నయ్… శతృశేషం, రుణశేషం ఉండకూడదని..!
(టైగర్లు కాల్చి చంపడానికి ముందు… పట్టుబడిన ప్రభాకరన్ కొడుకు)
Ads
ఎక్కడెక్కడో ఉన్న తమిళ ఈలం సానుభూతిపరులు శ్రీలంక సైన్యం అరాచకాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి మీద ప్రెజర్స్ పెంచారు… ఐరాస మానవ హక్కుల మండలి (UNHRC) 2012, 2013లో ఈమేరకు తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు ఇండియా దానికి మద్దతు పలికింది… తప్పదు కదా… శ్రీలంక తమిళుల రూట్స్ మనవే… వాళ్ల పోరాటానికి ఏళ్లుగా మన దేశం నైతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అన్నిరకాల మద్దతు ఇచ్చింది… కానీ ఎప్పుడైతే రాజీవ్‌గాంధీని టైగర్లు హతమార్చారో అప్పట్నుంచీ కథ మారిపోయింది… కానీ ఈరోజుకూ తమిళనాడు ప్రజల సానుభూతి శ్రీలంక తమిళుల పట్ల బలంగా ఉంటుంది… మానవహక్కుల మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా ఇండియా శ్రీలంకకు వ్యతిరేకంగా వోటు వేసినా సరే… 2014లో మరోసారి తీర్మానం వచ్చేసరికి తన స్టాండ్ మార్చుకుంది… వోటింగుకు దూరం ఉండిపోయింది… తాజాగా మొన్న మంగళవారం మరోసారి తీర్మానం ప్రవేశపెట్టబడింది… ఈసారి కూడా ఇండియా వోటింగుకు దూరంగా ఉండిపోయింది… అదేమిటి..? ఒకవైపు తమిళనాడులో ఎన్నికలు పెట్టుకుని, తమిళుల పట్ల సానుభూతితో స్పందించాల్సిన ఇండియా భిన్నంగా ఎందుకు వ్యవహరించింది..?
ఇండియాది ఓ చిత్రమైన సందిగ్ధావస్థ… శ్రీలంకకు మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తున్నాయి… మన మిత్రదేశంగా భావించబడే రష్యా కూడా శ్రీలంకకే మద్దతు… అసలే మనకు ఈమధ్య ఇరుగూపొరుగు దేశాలతో సఖ్యత దెబ్బతిన్నది… అందరినీ చైనా లోబర్చుకుని ఇండియాకు వ్యతిరేకంగా మారుస్తున్నది… ఈ స్థితిలో శ్రీలంకతో విరోధం మనకు స్థూల దేశ, అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు… అందుకని శ్రీలంకకు వ్యతిరేకంగా వోటు వేయలేదు… కానీ మన తమిళులను ఊచకోత కోసినందుకు శ్రీలంకను క్షమించకూడదు, అంటే దానికి వ్యతిరేకంగా వోటు వేసి, అంతర్జాతీయ సమాజం ఎదుట దోషిగా నిలిపి, యుద్ధనేరాలపై దర్యాప్తుకు సహకరించాలి… అంటే ఐరాస తీర్మానానికి అనుకూలంగా వోటు వేయాలి… సో, ఈ స్థితిలో ఏ స్టాండ్ తీసుకోకుండా వోటింగుకు దూరంగా ఉండిపోయింది… అయితే ఇది ఇప్పుడు తమిళనాట బీజేపీకి, అన్నాడీఎంకేకు నష్టం చేకూర్చే పరిస్థితిని క్రియేట్ చేసింది…
(ఐరాస మానవ హక్కుల మండలి భేటీ)
అప్పుడే డీఎంకే కూటమి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టాయి… నమ్మశక్యం కాని రీతిలో బీజేపీ ప్రభుత్వం తమిళులకు ద్రోహం చేసింది అనేది ప్రధాన విమర్శ… ఐరాస తీర్మానానికి అనుకూలంగా వోటు వేయాలని కొద్దిరోజులుగా తమిళపార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి… ఐనా సరే, పలు కోణాల్లో ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం వోటింగుకు దూరం అనే ధోరణిని తీసుకుంది… ఇది తమిళుల పట్ల బీజేపీ ప్రదర్శిస్తున్న దుర్మార్గ వైఖరి అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశాయి… దీన్ని ఎలా సమర్థించుకోవాలో ఇటు అన్నాడీఎంకేకు, అటు బీజేపీకి చేతకావడం లేదు… అసలు ఈ కూటమికి సరైన నాయకుడు లేడు… చిదంబరం తదితరులే కాదు, చివరకు బీజేపీ సొంత ఎంపీ సుబ్రహ్మణస్వామి కూడా ఈవిషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు… ‘‘శ్రీలంక తమిళులకు సమాన అవకాశాలు కల్పించే దిశలో ఇండియా ప్రయత్నిస్తూనే ఉంటుంది’’ వంటి పడికట్టు మాటలు తమిళులకు నచ్చుతాయా..? ఇలాంటి మాటలు ఇన్నేళ్లలో ఎన్ని విని ఉంటారు..?! అవునూ… ప్రపంచంలో ఎక్కడ హిందువులకు కష్టం వచ్చినా ఇండియా అండగా నిలబడుతుందన్నట్టుగా వ్యవహరించే బీజేపీ, ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఎందుకు వ్యవహరించినట్టు..? శ్రీలంక తమిళులు హిందువులు కారా..? ఇదుగో ఈ ప్రశ్నలకు బీజేపీ వైపు నుంచి కన్విన్సింగ్ సమాధానాల్లేవు… లేవు..!!
Share this Article