‘‘స్కిన్‌టుస్కిన్’’ అనే బాంబే హైకోర్టు తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది తెలుసు కదా… నేరుగా దేహాన్ని తాకకుండా ఆడపిల్లల లైంగిక సంబంధ శరీరభాగాలను పట్టుకున్నా, ఏం చేసినా అది పోక్సో పరిధిలోకి రాదు అనే అర్థమొచ్చేలా ఆ తీర్పు ఉంది… ఈ తీర్పు మొత్తం పోక్సో చట్టం స్పూర్తికే విరుద్ధంగా ఉందనీ, ఇదొక తప్పు ఆనవాయితీకి దారితీస్తుందనీ చెప్పిన అటార్నీ జనరల్ అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది… ఆ మహిళా జడ్జే మళ్లీ అలాంటి పోక్సో చట్టానికి సంబంధించి, ఆ స్పూర్తివిరుద్ధ తీర్పు మరొకటి వెలువరించింది… చాలా సైట్లు ఆ జడ్జి ఫోటో వేసి మరీ ఈ వార్తను పబ్లిష్ చేశాయి… జర్నలిస్టులు, లీగల్ సర్కిళ్లలో ఈ తీర్పు మీద కూడా చర్చ సాగుతోంది… ఒక్క తెలుగు మీడియా తప్ప… దానికి రొచ్చు, క్షుద్ర, కుల రాజకీయాలు తప్ప ఇంకేమీ పట్టవు కదా… లేదంటే సినిమా వార్తలు, హీరోల భజనలు… సెలబ్రిటీల కీర్తనలు… దానికి బిడ్డ పుట్టింది, వీడికి కొడుకు పుట్టాడు, బిడ్డకు డైపర్ వేశారు ఎట్సెట్రా…
ఓ ముసలోడు ఓ అయిదేళ్ల పిల్ల ఎదుట ప్యాంట్ జిప్పు విప్పేసి, అన్నీ చూపిస్తూ… ఆ పిల్ల చేతులు పట్టుకుని, లోపలకు పోదాంరా, మంచం మీద పడుకుందాంరా అని పిలుస్తున్నాడు… ఆ పిల్ల ఏడుస్తోంది… పిల్ల తల్లికి కనిపించిన సీన్ అది… కేసు పెట్టింది… స్పెషల్ కోర్టు పోక్సో చట్టం కిందే శిక్ష ఖరారు చేసింది, ఇది బాంబే హైకోర్టుకు వచ్చింది… మళ్లీ ఆమే జడ్జి… పుష్పా గనేడివాలా… (ఈమె నియామకం మీద కూడా ఏదో కాంట్రవర్సీ ఉన్నట్టుంది… ఐనా ఇప్పుడది అప్రస్తుతం) ఈ కేసులో పోక్సో వర్తించే అంశాలేమున్నయ్ అంటూ ఆమె ఆ సెక్షన్లు కొట్టేసి, ఏదో ఐపీసీ సెక్షన్ల కింద కొంత శిక్ష ఖరారు చేసింది… ఇప్పటికే అయిదు నెలల కాలాన్ని అండర్ ట్రయల్‌గా జైలులో గడిపాడు కాబట్టి ఇక విడుదల చేయాల్సిందే…
Ads
మళ్లీ అదే ప్రశ్న… ఆడపిల్ల లేదా మగపిల్లాడు… మర్మస్థానాల మీద చేతులు పడితేనే పోక్సో చట్టం కిందకు రావాలా..? అలా జరిగితేనే లైంగికదాడి అనాలా…? అసలు ఓ సంఘటన జరిగినప్పుడు సాంకేతిక అంశాల్ని చూడాలా..? వ్యక్తుల దురుద్దేశాలను, నేరస్వభావాన్ని చూడాలా..? స్కిన్‌టుస్కిన్ దైహికసంపర్కం జరగలేదు కదా, భౌతికమైన టచ్ లేదు కదా… అది నేరమెలా అవుతుందీ అనే ప్రశ్నకు ఇక సుప్రీంకోర్టే సమాధానం చెప్పాలి… పోలీసులు ఒకవేళ సరైన దర్యాప్తు చేయలేకపోతే, తప్పుడు కేసులు పెట్టినట్టయితే అది వేరే సంగతి… బాధితులకు న్యాయం ఎంత ప్రధానమో, నిందితులకు అకారణ శిక్షల నుంచి రక్షణ కూడా అంతే ముఖ్యం… కానీ అసలు చట్టం స్పూర్తే ప్రశ్నార్థకమయితే ఎలా..?!
Share this Article