ఆమె ఎవరో తెలుసా..? కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు… పద్మశ్రీ గ్రహీత… వయస్సు డెబ్బయ్ ఏళ్లు… పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి మేనత్త… మంచి సంగీత కుటుంబం… పెద్ద పెద్ద వాళ్ల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది… నేర్చింది కర్నాటక సంగీతమే అయినా అన్నిరకాలూ పాడగలదు… ఎనిమిదో ఏటనే ఓ బంగారు పతకం పొందిన ఆమె అప్పట్నుంచీ పాడుతూనే ఉంది… ఆమె చరిత్ర చదువుతూ పోతే ఇలా చాలా చాలా విశేషాలు కనిపిస్తయ్… ఆమె పేరు అరుణా సాయిరాం… కళైమామణి, సంగీత చూడామణి, సంగీత కళాసారథి, సంగీత కళానిధి… ఇవీ ఆమె బిరుదులు…
ఎంత స్వర ఘనాపాఠీ అయితేనేం..? ఎంత విద్వత్తు ఉంటేనేం..? తెలుగు సంగీత ప్రపంచంలోకి అడుగుపెడితే ఇక మరకలే కదా దక్కేది… ఇంతటి సంగీతవిశారదను తెచ్చుకున్నాం, కాస్త మంచి పాట పాడించుకుందాం అనే సోయి ఉంటే కదా… అదే ఉంటే ఫాఫం, తెలుగు సినిమా సంగీతంలో ఎందుకుంటారు లెండి… ‘‘అంటే సుందరానికి’’ అనే ఓ కొత్త సినిమా వస్తోంది… గతంలో నేచురల్ స్టార్ అని పిలవబడిన హీరో నాని అందులో నటిస్తున్నాడు… ఓ పాట వదిలారు ప్రేక్షకుల మీదకు… పెన్సిలిన్ శాంపిల్ డోస్‌లాగా…
మనం ఈమధ్య హలామితీ హబీబో అనే కుత్తుక దిగని ఓ అరబిక్ కుత్తును… దర్జా అని రాబోయే సినిమాలో శివంగి క్షుద్రశక్తుల పాట ‘‘ధా… రా… ణా… హా… ఛే… నో… రా… హా…’’ గురించి చెప్పుకున్నాం కదా… రాబోయే సుందరం పాట కూడా అంతే… కాకపోతే ఎటొచ్చీ అంత పెద్ద సింగర్ అరుణా సాయిరాం ప్రభ కూడా మసకేసిపోయింది ఒక్కసారిగా… ఇక్కడ పెద్ద సింగర్ అనగా… వయస్సులో, ప్రతిభలో, అనుభవంలో… ఫాఫం… కొన్ని గ్రహస్థితులు అకస్మాత్తుగా గ్రహణం పట్టించేస్తయ్…
Ads
‘‘సారోరూ… ఫేడ్ అయిపోయే ఫ్రీడం మీదింకా… ఎహె, మీదింకా… సారోరూ… డూపే లేకుండా ఫ్రీడం ఫైటింకా..’’ అని స్టార్ట్ అవుతుంది పాట… కొద్దిసేపు యానిమేషన్ బొమ్మలు… ఏదో పంచెకట్టు పాట అన్నారు గానీ, ఆ సంప్రదాయికత కనిపిస్తే ఒట్టు… కాసేపు అరుణకు కళ్లద్దాలు పెట్టి, నానా వేషం వేయించారు… పాట తక్కువ, పరేషాన్ ఎక్కువ… ఈ సారోరూ అంటే హేమిటో సదరు పాట రచయిత గోలి హసిత్ కనిపించినప్పుడు అడగాలి… సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కు తెలుస్తుందని అనుకోలేం…
అరుణా సాయిరాం మాత్రమే కాదు… చాగంటి సాహితి, భట్ల దామిని, మేఘనా లక్ష్మి, సాయిచరణ్, సత్సంగి చైతు, రితేష్ కూడా స్వరం కలిపారుట పాపం… ఐనా సరే, పాట వింటే అదోలా ఉంది… ‘‘సరదాకే సురకేశారు..’’ వంటి ఇనుప గుగ్గిళ్ల గురించి ఏం చెప్పుకుంటాంలే గానీ… పాట నడుమ 180, 360 డిగ్రీ యాంగిల్‌లో ఆ సీన్లు ఏమిటి గురూ… కనీసం మీకైనా ఏమైనా అర్థమైందా..? లేక అవీ షేడ్ అయిపోయే ఫ్రీడం బాపతేనా..? ఏం దొరికారబ్బా… సంగీత తాజా కళానిధులు..? నిక్షేపాలు..!?
Share this Article