Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…

June 21, 2025 by M S R

.

- తుమ్మేటి రఘోత్తమరెడ్డి ....... ఒక రాత్రి పూట, భోజనం చేసి, మిత్రుడు నేనూ ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం!

రాత్రి పది గంటలు దాటింది, చుట్టూ దట్టమైన చీకటి, ఆకాశంలో మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, గుడ్డిగా వెలుగుతున్న వీధి దీపాలు, నగర శివారు పల్లె కనుక, మా కాలనీ సద్దుమణిగింది!
శీతాకాలం, చలి ప్రారంభం అయింది.

Ads

మిత్రుడు వరంగల్ నుంచి వచ్చాడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు!
మధ్య వయస్కుడు, సాహిత్య బాగా చదువుతాడు!
మా మధ్య స్నేహానికి , అది ముఖ్య కారణం!

వాతావరణం చల్లగా.. నిర్మలమైన ప్రాణ వాయువును అందిస్తున్నది. జీవితం- సాహిత్యం- రాజకీయాలు – అతను ఎక్కువగా మాట్లాడుతూ, నేను వింటూ..

మిత్రుడు మాటలు ఆపి, నిశ్శబ్దం అయ్యాడు!
ఎక్కడో దూరంగా .. ఏదో వింటున్నాడు!

ఎక్కడో కుక్క ఒకటి ఏడుస్తోంది!
మా కాలనీకి సమీప కాలనీ నుండి , అది ఏడుస్తోంది!
సన్నగా వీస్తున్న గాలివాటుకు వినవస్తోంది, తెరలు తెరలుగా శోకం..

అతను ఆ కుక్క దుఃఖాన్ని వింటున్నట్టు అర్థం అవుతోంది!
నేను అతన్ని డిస్ట్రబ్ చెయ్యకూడదనుకున్నాను!

దయ గలిగిన వారు,
దుఃఖాన్ని వింటారు!

చలికో – ఆకలి బాధకో- ఒంటరిదయ్యో – మరెందుకో- ఆ కుక్క ఏడుస్తోంది.. వింటుంటే … కడుపులో పేగులు కదులుతున్నాయి!
దాని హృదయం విదారకమైన , విషాద స్వరం..
క్రమంగా ఆగిపోయింది!

మిత్రుడు తేరుకున్నాడు!
గొంతు సవరించుకుని , చెప్పడం ప్రారంభించాడు…

” మా మేనత్త గుర్తొచ్చింది, ఆ కుక్క ఏడ్పు వింటుంటే!
ఆమె కూడా ఇలాగే అప్పుడప్పుడు ఏడ్చేది, కడుపుల పేగుల్ని తోడేస్తున్నట్టు.. ఆమె మా ఇల్లరికం మేనత్త, ఆమె చివరి రోజులు గుర్తొచ్చాయి!

నా బాల్యంలో, జోరు వానలు కురుస్తున్న ఒక వర్షాకాలంలో,
ఒకరోజు రాత్రి నాకు మెళకువ వచ్చింది, గ్రామంలో ఎవరో స్త్రీ ఏడ్వడం వినబడుతోంది.. మామూలు ఏడ్పు కాదు, దాన్ని 'వలపోత' అంటారు! తన దురదృష్ట జీవితాన్ని, ఒక గాథలా చెప్పుకుంటూ వలపోస్తోంది!

‘ఆరుగుర్ని కంటే ,అయిదుగురైరీ అవ్వా!
‘అయిదుగురు ఉన్నరనుకుంటే , నలుగురైరి నాయినా!
నలుగురు ఉన్నరనుకుంటే, ముగ్గురైరీ నావ్వా!
ముగ్గురన్న ఉన్నరనుకుంటే నాయినా,
ఆ దేవుని గుళ్లే మన్నుబొయ్య, మల్లొగన్ని ఎత్తుక పాయె నాయినా! నా కండ్ల ముంగటనే నేను కన్నోళ్లు పోవట్టిరీ నావ్వా!
వాళ్లను విడిచి పెట్టి నన్నెందుకు తీసుకపోలేదురా దేవుడా, నీ గుడి నాశనం గాను గదరా దేవుడా..’

ఆమె దుఃఖం ఎడతెగని ప్రవాహం తీరుగా సాగుతోంది!
ఎత్తైన మా ఊరి చెరువు మత్తడి దూకుతున్న నిర్విరామ హోరు , ఆమె దుఃఖానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తోంది!

మా నాయన కూడా , ఆ దుఃఖం విని కాభోలు, లేచాడు!
మంచం మీద కూర్చుని మౌనంగా వింటున్నడు!
కిరోసిన్ దీపం వెలుగులో , నాయన ముఖంలో కూడా విషాదం ఏదో తిరుగుతోంది!

‘ఎవరు నాయన? ఏడుస్తున్నదీ?’ అని నేనంటే-
‘ అత్త , సత్తెమ్మత్త’ అన్నది , మా అమ్మ!
అమ్మక్కూడా మెళకువ వచ్చింది, ఆ శోకానికి!
‘ ఆమె గతి ఎట్లనో ఏందో ‘ అన్నది అమ్మ విచారంగా!

మా మేనత్త ఇల్లు, మా ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది!
మూడిండ్ల భవంతి, ముందు ఇంట్లో పెద్ద కొడుకు ఉంటే,
దాని వెనుక వంటింట్లో , తాను ఒక్కతే విడిగా ఉంటుంది!
ఇప్పుడు ఆమెకు చేతకావడం లేదు, ముసలిదైంది!

ఉన్న ఇద్దరు కొడుకులు ఆమెను చూడటం లేదు!
ఆమె పరిస్థితి అధ్వాన్నంగా తయారు అయింది!
అంత్య దశ, ఆ దశని , కొడుకుల కుటుంబాలు వేగం చేస్తున్నాయి!

నాకు మనుషుల ప్రవర్తనలు అర్థం అవుతున్నాయి, అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉండవచ్చు.

అత్త ఇంట్లో ,పెద్ద కొడుకు ఉంటాడు!
మరో కొడుకు, వీధి చివర ఉంటాడు!

అది మొదలు, నేను మేనత్త దుఃఖాన్ని వినడం!
తరచుగా ఏ తెల్లవారు ఝామునో, ఆ శోకం వినవస్తూ ఉండేది…

మా తాతకు మొదటి సంతానం అత్త!
తరువాత వెంటనే తాతకు సంతానం కలుగలేదు!
అత్తను ఇల్లరికం పెట్టుకోవాలనుకున్నాడట తాత!
కానీ, తరువాత ఇద్దరు కొడుకులు, మరో కూతురు కలిగారు!
అయినా, మొదట అనుకున్న ప్రకారం- బయటి గ్రామం నుండి అల్లున్ని ఇల్లరికం తెచ్చుకుని కొడుకులతో సమంగా, భూమిలో వాటా పంచి ఇచ్చాడు !తన ఇంటి వెనకే కూతురుకూ , మూడిండ్ల భవంతి కట్టించాడు, కొడుకులకు లేకపోయినా!

అత్త నాకు ఎలా తెలిసిందో చెపితే, అత్తకూ మాకు ఉన్న సంబంధం అర్థం అవుతుంది!

ఒకరోజు నేను వీధిలో నడుస్తుంటే, ఒక ముసలమ్మ ఎదురుగా నడిచి వస్తోంది! సన్నగా.. చామన ఛాయలో.. కొంచం వంగిపొయి.. కొంగు నడుముకు చుట్టి.. సగం నెరిసిన తల,
మోకాళ్ల కింది దాకా గోచిపోసి కట్టిన ముదురాకుపచ్చ నేత చీర,
వెలిసిన మబ్బురంగు రవిక, నోట్లో మోదుగాకుతో చుట్టిన పొగాకు చట్ట కాలుతోంది, ఎడమ చేతిలో ‘పేడ’కడిని పెట్టుకుంది!
ఎవరినో తిడుతూ వస్తోంది!
‘అసలు ‘ఇవ్వకపోయినా, పెచ్చులన్న కొలిసి చావరా కుక్కల కొడకా అంటే, అవి కూడా ఇవ్వడం లేదు!’ అని!

ఆమె తిడుతూ , నన్ను దాటి ముందుకు వెళ్లింది!
నా ముందు నడుస్తున్న మా పాలేరు నన్ను అడిగాడు!
‘ ఆమె ఎవరో తెలుసా పటేలా నీకు’ అని!

నేను వెనక్కు తిరిగి, పోతున్న ముసలమ్మను చూసాను!
ఎవరో తెలియదు మరి!
‘ మీ మ్యానత్తయ్యా ‘ అన్నాడు పాలేరు!

అలా ఉండేవి మా కుటుంబాల మధ్య సంబంధాలు!
పెండ్లిల్లకు మినహా, మరి దేనికీ ఆమె మా ఇంటికి వచ్చిన దాఖలా లేదు! లొల్లి లేదు! పంచాయతి లేదు! అలా ఉండేవి, మా నాయన తోబుట్టువుల మధ్య సంబంధాలు!

అత్తకు అయిదుగురు కొడుకులు , ఒక కూతురు!
కూతురు చిన్నప్పుడే చేదబావిలో పడి చనిపోయిందట!
దాంతో, మా తాత రాతితో చేదబావిని కట్టించి, దాని పైన చుట్టూ గోడ కట్టించాడట! ఆ గ్రామంలో రాతి చేదబావి , అది రెండోది అప్పటికి! మొదటిది తాతదే!

అత్త అయిదుగురు కొడుకుల్లో చివరి వాడు , చెట్టు మీది నుంచి పడి చనిపొయ్యాడు, ఏటి ఒడ్డున మేకలను మేపడానికి వెళ్లి.

మరో కొడుకు – వివాహితుడు- నిస్సంతు- ఆయనకూ గ్రామ కోమటికీ ముప్పై రూపాయల అప్పు విషయంలో గొడవ జరిగి, అది పంచాయతీకి దారి తీసి- కొడుకుది తప్పని గ్రామ పెద్దలు తీర్పు ఇస్తే-  అది అవమానంగా భావించి
‘ఎండ్రిన్’ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు! పంటలపై తెగుళ్ల నివారణకు అప్పుడే పురుగు మందుల వాడకం మొదలైంది!
ఎండ్రిన్ పేరు వినడం నాకదే మొదటి సారి! ఇది 1965 సుమారు!

ఆ ఆత్మహత్య చేసుకున్న అత్త నాలుగో కొడుక్కు ముప్పై రూపాయలు లేని దారిద్ర్యం కాదు! పంతాలు పట్టింపులు!
ఆయన శవయాత్ర మా పెద్దనాయన ఇంటి ముందు నుండి వెళుతుంటే, మా మేనత్త ఏడుస్తూ పెద్దనాయన ఇంటి మీద మూడు దోసిల్ల దుబ్బ ఎత్తి పోసింది!
ఆ ముప్పై రూపాయల అప్పును మా పెద్ద నాయన కడితే తన కొడుకు బతికేవాడని! పెద్ద నాయన గ్రామానికంతకూ వడ్డీ వ్యాపారి! అత్త దగ్గర ముప్పై రూపాయలు లేక కాదు!

ఆ కొడుకు ఆత్మహత్య తదనంతరం.. పిల్లలు లేని కోడల్ను రాచిరంపాన పెట్టి, మిగిలిన ముగ్గురు కొడుకులకు వంత పాడి- నామ మాత్రపు ధరలు చెల్లించి, ఆమె భూములు లాక్కున్నారు!
ఆమెను పుట్టింటికి తరిమేసారు!

ఇక ముగ్గురు కొడుకుల్లో , మరొకాయన్ను హత్య చేసారు!
ఎవరో కాదు, కడమ ఇద్దరు కొడుకులు , వారి కొడుకులు!
ఆస్తి గొడవలు! అట్లా ఆరుగుర్ని కంటే, చివరికి ఇద్దరు కొడుకులు మిగిలారు, అత్త మిగిలింది!

అత్తకు , తాత తన ఇద్దరు కొడుకులతో సమానంగా భూమిని పంచాడు, మనిషికి ముప్పై ఎకరాలు! తాతల నుండి వస్తున్న భూములు అవి. మా తాత అదనంగా సంపాదించలేదు.

అత్త తన నలుగురు కొడుకులకు, మనిషికి ఇరవై ఎకరాలు పంచి ఇచ్చింది! ఎట్లా సంపాయించి ఉంటుంది!అంత భూమిని?
అత్త కష్టజీవి, పిసినారి, వడ్డీ వ్యాపారి!

మా అమ్మ అనేది,
‘ ఈ ఇంట్ల తిందురు- ఆ ఇంట్ల పని చేసుకుందురు’
ఈ ఇల్లు అంటే, మా తాత ఇల్లు, ఉమ్మడి ఇల్లు!
దానికి తోడు, మా అత్త గ్రామంలో ధాన్యం కూడా పెచ్చులకు ఇచ్చేది! అప్పుడు గ్రామంలో తిండి దరిద్రం ఉండేది!

కొడుకులు వేర్లు పడ్డాకా, తనకు ఎకరం పొలం- వంటిల్లు- రెండు బంగారు దండకడియాలు- మెడకు నాలుగు వరుసల బంగారు గొలుసు ఉంచుకున్నది! నిత్యం ఏకులు వడికేది!
రికామిగా ఉండేది కాదు! వీధిలో ఎక్కడ పశువుల పెండకడి కనిపించినా , తీసుకుపొయ్యి పెంటబొందల వేసుకునేది! ఆమె ఇంట్లకు ఎవరూ వెళ్లేవారు కాదు, ఆమె ఎవరింటికి వెళ్లేది కాదు!

అత్తకు రోజూ ‘వాడిక’ కల్లు ఇంటికి తెచ్చి పోసేవాడు, ఒక గౌండ్ల ముసలాయన!

ఎప్పుడో పండక్కో పబ్బానికో మా నాయన నన్ను అత్త దగ్గరకు తోలేవాడు! ‘అత్తను అన్నానికి రమ్మనుపో ‘ అని!
నేను వెళ్లి చెపితే, ‘ఇప్పుడే తిన్నరా’ అనేది, వచ్చేదు కాదు! అంతే!

అత్త ఆరోగ్యం బాగున్నంత వరకు తన వంట తాను చేసుకుని, తన బ్రతుకు తాను బ్రతికింది. అత్త ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఇద్దరు కొడుకులు ఒక రోజు మధ్యాహ్నం ఆమె ఇంటిమీద ‘దాడి’ చేసారు! అవును దాన్ని దొంగల దాడే అనాలి.
ఇద్దరు కొడుకులు- ఆరుగురు మనవలు!
ఇద్దరు కొడుకులు, చెరో ఎడ్ల బండ్లి కట్టుకొచ్చారు!
అత్త ఇంట్లో , మూడు పుట్ల కొడిశె గుమ్మికి నిచ్చెన వేసారు!
వడ్లు తోడుకుని రెండు బండ్లలోని బోరాల్లో నింపుకున్నారు!

కొడుకుల మనవల దోపిడి చూసి, అత్త ఏడుస్తోంది, మొత్తుకుంటోంది!
ఆమెను అనగబట్టి చేతులకున్న బంగారు కడియాలు గుంజుకున్నారు, మెడలున్న గొలుసును గుంజుకున్నారు!
ఆమె పెనుగులాడుతోంటే,పెద్ద మనవడు ఆమెను పగ్గంతో ఆ‌నుగుంజకు కట్టేసాడు!

అత్త ఏడ్పులు అందరికీ వినిపిస్తున్నాయి,
ఊరందరికీ వినిపిస్తోంది ఆమె మొర! ఎవరూ రాలేదు!
‘ఇదేమి అన్యాయం?’ అని అనలేదు!
కొడుకులకూ మనవలకూ భయపడ్డారు!
మనకెందుకులే అనుకున్నారు.
కొందరు పిల్లలు మాత్రమే అక్కడికి వెళ్లారు! నేనూ వెళ్లాను!
‘ నువ్వు ముసల్దానివైనవు!
నీ దగ్గరుంటే దొంగలెత్తుక పోతరే’
పెద్ద కొడుకు అన్నటువంటి మాట , నాకింకా గుర్తు!

చూస్తున్న పిల్లలను కర్రతో బెదిరించారు!
మేం పారిపోయి వచ్చాం! నేను మా నాయనకు చెప్పాను!
‘అత్తను కట్టేసారు! కొడుతున్నరు! అన్ని దోచుకున్నరు’ అని!
‘ ఆ వంశమే అంత!’ అని మాత్రమే అన్నాడు మా నాయన.

అత్త ఇల్లును దోచుకుని, ఆ ఇద్దరు కొడుకులు మా పక్కింటికి వచ్చారు! అది కంసాలి ఇల్లు!
తల్లి నుంచి దోచుకున్న నగలను పంచుకోవడం కోసం వచ్చారు.
అత్త పెద్ద కొడుకు అంటున్నడు!
‘ ఏయ్ , ఔసులాయినే- సమానం జోకి పంచు!
గురిజ మందం తేడా వచ్చిందో , నీ సంగతి చెప్త’

మాకు కనిపిస్తున్నది అది, మా నాయన అటువైపు చూసాడు విచారంగా! అంతలోనే ఎవరో వచ్చి , మా నాయనకు చెప్పారు!
” పటేలా! మీ అక్క చెయ్యి విరిగింది” అని!

అప్పుడు మా నాయన అత్త ఇంటికి వెళ్లాడు, నేనూ వెళ్లాను!

మా నాయన వెళ్లి , అత్త కట్లు విప్పాడు, అత్త అట్లానే కూలబడ్డది, కుడిచేత్తో నుదురు కొట్టుకుంటూ ఏడుస్తోంది!ఎడమ చెయ్యి విరిగింది, కిందికి ఉంది.
మా నాయన పశువైద్యుడు, కంకబద్దలు చీరిండు, పత్తిగింజలు దంచిండు! బద్దలపై చేయిని సర్ది- పత్తిగింజల ముద్దను పెట్టి- కట్లు కట్టాడు, కడుతూ ఒక్క మాట అన్నాడు!

‘ ఎందుకు ఏడుస్తవ్? నేను బతికితే , నీ కొడుకుల గతి చూస్తా’ అన్నాడు! తరువాత రోజుల్లో మా నాయన అత్త కొడుకుల గతిని చూసాడు! ఇద్దరు అత్త కొడుకులను, వారి కొడుకులు కొట్టడాన్ని!

అత్త చివరి రోజులు హీనంగా గడిచాయి!
నేనప్పుడు చదువు కోసం, మా అక్క ఇంట్లో వరంగల్ లో ఉన్న!

ఒకసారి మా గ్రామానికి, మా అక్క వచ్చేసరికి , మా అత్త- ‘గాండ్ల’వాళ్ల ఇంటి పంచన – వారు పెడితే తింటోందట!
అది చూసి అక్క కోపానికి వచ్చి, మా పెద్ద మేన బావ ఇంటికి వెళ్లి నిలదీసింది! అప్పుడు నేను మా అక్క అన్న మాటలు విన్నాను!
‘ బావా ! నీకు ముగ్గురు కొడుకులున్నరు! ముగ్గురు కోడండ్లు వచ్చిండ్రు! వాళ్లందరు చూస్తున్నరు!నువ్వేం నేర్పుతానవు వాళ్లకు? రేపు నీ గతేమి? అత్త మందిండ్లపొంటి అడుక్క తింటాంది! ఇది ఊరా అడివా! మనకు ఇజ్జత్ మానం లేదా?’

అక్క విమర్షిస్తుంటే , బావ మాట్లాడలేదు!

పెద్దకొడుకును పిలిచిండు!
‘బండి కట్టుక పొయ్యి , నాయినమ్మను ఏసుకరాపో ‘ అన్నాడు!
వేసుకొచ్చాడు కొడుకు!

మా అక్కా , అత్త పెద్ద కోడలు, ఇద్దరూ మా అత్తను నులక మంచంలో వేసి- చీర విప్పేసి కడిగారు!
అత్త తల జడలు కట్టింది! బట్టలు మట్టికొట్టుకు పొయ్యాయి!
చిక్కి శల్యం అయింది! బొక్కలు తప్ప,పెయి మీద మాంసం లేదు!

తరువాత అత్త పదిరోజులు బతికింది,పెద్ద కొడుకు ఇంట్లోనే చనిపోయింది!”

***

మిత్రుడు తన మేనత్త గాథను చెపుతుంటే, మనసు భారం అయింది!

***

అతనే , తిరిగి మరో మాట అన్నాడు!

“ఇప్పుడు , మా అత్త మనవలను, వారి కొడుకులు కొడుతున్నారు! మా నాయన లేడు కాని , అది నేను చూస్తున్నాను ”

మిత్రుడు తన మేనత్త గాథను చెప్పడం ముగించాడు కానీ,
అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది…. లోకంలో కూడా!

చలి తీవ్రమవుతోంది! చుట్టూ చిమ్మెట్ల రొద,
మంచు వల్ల చెట్లు భారంగా, నిశ్చలంగా..
రాత్రి భారంగా గడుస్తోంది…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?
  • మోడీ అనాలోచితంగా కాపాడితే తప్ప… ఫోన్ ట్యాపింగ్ కేసీయార్ మెడకు..!!
  • అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions