కొన్ని వార్తలు మనస్సుల్ని ద్రవింపజేస్తయ్…. ఈ దుర్మార్గమైన, చెత్తా, దుర్గంధ రాజకీయ వార్తలు రాసీ రాసీ పత్రికలు, విలేకరులు పోస్ట్‌మార్టం డాక్టర్లలాగా ఓతరహా నిర్లిప్తతలోకి, స్పందనరాహిత్యంలోకి జారిపోతున్నారేమో…. అందుకే వాటికి ప్రయారిటీ ఉండదు… అఫ్‌కోర్స్, తమ పత్రికల యజమానుల రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా డప్పు కొడుతూ, లేదా తిట్టిపోస్తూ సున్నితమైన మానవసంబంధ భావనల్ని కోల్పోయారేమో… ఈ వార్త చదవండి… ఒక్కసారిగా కళ్లలో తడి వెల్లువైపోదా…
మీడియాలో, సోషల్ మీడియాలో చెలరేగిపోయే చెత్తా ట్రోలర్స్‌ను కాసేపు వదిలేయండి… పరమ నీచ్ ఫీలింగుల రాజకీయ నాయకుల్నీ వదిలేయండి… వాళ్ల డప్పు బ్యాచుల్నీ వదిలేయండి… పేటీఎం పెయిడ్ బ్యాచుల్నీ వదిలేయండి…. ఆధునిక అన్నమయ్య మార్క్ సంకీర్తనాచార్యులనూ వదిలేయండి… ఇలాంటి వార్తలు కదా అసలు వార్తలు అంటే… మంచి శైలిలో రీరైటింగ్… మంచి ప్రయారిటీ ఏమయ్యాయ్..? మళ్లీ చెబుతున్నా… ఇలాంటి విషయాల్లో ఆంధ్రజ్యోతి చాలా బెటర్… జీవం చనిపోయిన ఈనాడు, దానికి తాత సాక్షికన్నా…
Ads
ఈ పిల్లాడి మొహం, అందులో అమాయకత్వం చూస్తుంటేనే కలుక్కుమంటోంది… అసలు వార్త ఏమిటంటే..? తిరుపతి, విద్యానగర్… రాజ్యలక్ష్మి అనే ఉద్యోగి… వయస్సు 40 ఏళ్లు… గతంలో బెంగుళూరులో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేది… ఫిజిక్స్‌లో డాక్టరేట్ చేసింది… కుటుంబంలో సమస్యలు, భర్తకు దూరమైంది… తిరుపతి వచ్చేసింది… కొడుకుతో ఉంటోంది… తన బతుకు తనది… ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్… ఇలాంటివాళ్లకు విధి అండగా ఉండాలి కదా, లేదు… ఉండలేదు…
విధి వెక్కిరించింది… ఓరోజు రాత్రి రాజ్యలక్ష్మి వాంతి చేసుకుంది… బోర్లా పడిపోయింది బెడ్ పక్కనే… పదేళ్ల కొడుకు శ్యామ్ కిషోర్‌కు ఏం తెలుసు..? తల్లి నిద్రపోతుందనుకున్నాడు… దొరికింది ఏదో తిన్నాడు… స్కూల్ వెళ్లాడు ఎప్పటిలాగే… కుటుంబవిషయాలు ఎవరికీ చెప్పొద్దన్న తల్లి మాటలు గుర్తున్నయ్… ఎవరికీ ఏమీ చెప్పలేదు… ఇంటికి వస్తున్నాడు, స్కూల్‌కు పోతున్నాడు, తల్లి శవం పక్కనే పడుకుంటున్నాడు… (అక్షరాలు తడబడుతున్నయ్ రాయడానికి…)
తల్లి శవం నుంచి దుర్వాసన ప్రారంభమైంది… స్కూల్ వెళ్లాక తను కూడా వాంతి చేసుకున్నాడు… ఎవరేం అడిగినా ఏమీ చెప్పలేదు… ఈలోపు మేనమామ ఫోన్ చేస్తే విషయం చెప్పాడు… ఆయనకు డౌటొచ్చి పరుగుపరుగున వచ్చి చూస్తే ఇదీ దుస్థితి… పోలీసులు, పోస్ట్‌మార్టం, కేసు మన్నూమశానం సరేసరి…
కానీ… చుట్టుపక్కల సమాజం ఏమైంది..? నాలుగు రోజులుగా ఆమె కనిపించకపోతే ఏమైంది అని కనుక్కునే సోయి లేదా..? చివరకు ఆమె సోదరుడు వచ్చి చూసేదాకా ఆమె మరణించిందనే విషయమే తెలియనంత అంధకారం ఆవరించిందా మన చుట్టూ… ఇదీ అసలైన విషాదం… స్పందనరాహిత్యంలో బతకడంకన్నా చీకటి ఏముంటుంది..? అవును, మన సమాజానికి ఏదో అయ్యింది… నిజంగా ఏదో అయ్యింది… మనం మనుషుల్లా బతకడం మరిచిపోయి చాలా రోజులవుతోంది… ఒరేయ్, శ్యామ్… నిన్ను చూస్తుంటే మాకు దుఖం వస్తున్నదిరా…!!
Share this Article