ఒక వార్త… మెర్సీకిల్లింగ్, అంటే కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ పోర్చుగల్ దేశం ఓ నిర్ణయం తీసుకుంది… అంటే చనిపోయేందుకు అనుమతి… నెదర్లాండ్స్, బెల్జియం, కొలంబియా, లక్సెంబర్గ్, వెస్టరన్ ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఆల్రెడీ మెర్సీకిల్లింగ్‌కు అనుమతి ఉంది… సో, పోర్చుగల్ ఏడో దేశం… దీనికి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకులున్నారు, సమర్థకులున్నారు… తప్పనిసరి పరిస్థితిలో ఒక మనిషి గౌరవంగా మరణించడానికి సమాజం అంగీకరించాలనేది ఈ మెర్సీ కిల్లింగ్ కాన్సెప్టు… మరి మన ఇండియాలో..? ఇక తప్పదు, సాగనంపడమే మేలు అనుకున్నప్పుడు, లైఫ్ సపోర్ట్ తొలగించడానికి మన సుప్రీంకోర్టు వోకే అన్నది 2018లో.., కానీ విషపు ఇంజక్షన్ వంటి పద్ధతుల్లో ఎవరూ ప్రాణాలు కావాలని తీయడానికి మాత్రం ఒప్పుకోలేదు… అంటే, ఒకరకంగా మెర్సీ కిల్లింగ్ ఉన్నట్టూ కాదు, పూర్తిగా లేనట్టూ కాదు… అయితే ఇదే అంశంపై ఒక వ్యక్తిపై మన దేశంలో విస్తృత చర్చలు సాగాయి… సుప్రీం దాకా వెళ్లింది కేసు… మెర్సీకిల్లింగ్ మీద దేశవ్యాప్త చర్చ సాగింది… అది గుండెల్ని పిండేసే ఓ హృదయ విదారకమైన కథ…
అరుణ షాన్‌బాగ్ కర్నాటక కోస్తాలోని హల్దీపూర్ గ్రామస్థురాలు… ఆమెకు పదేళ్లున్నప్పుడే తండ్రి చనిపోయాడు… తనకు ఆరుగురు సోదరులు, ఇద్దరు సిస్టర్స్… అంటే తొమ్మిది మంది సంతానంలో తనది ఎనిమిదో నంబర్… 17 ఏళ్ల వయస్సులో నర్సింగ్ చదువుకోవడానికి ముంబై వెళ్లింది… ముంబై కేఈఎం హాస్పిటల్లో కొలువు దొరికింది… అక్కడే పనిచేసే ఓ డాక్టర్ తనను చూసి ఇష్టపడ్డాడు… త్వరలో పెళ్లి జరగాలి… కానీ విధి ఘోరంగా శపించింది ఆమెను… 1973, నవంబరు 27… ఆమె తన డ్యూటీ ముగిశాక బట్టలు మార్చుకుంటూ ఉంటే, సోహన్‌లాల్ వాల్మీకి అనే వార్డు బాయ్ లోపలకు ప్రవేశించి, ఆమెపై అత్యాచారం చేశాడు… అదీ ముందు నుంచి కాదు, వెనుక నుంచి… (అర్థం చేసుకొండి)… ఆమె మెడ చుట్టూ ఓ బెల్టు బిగించి చంపబోయాడు… ఆమె స్పృహ తప్పగానే వెళ్లిపోయాడు…
Ads
మీరు నమ్ముతారా..? ఆరోజు కోమాలోకి వెళ్లిన ఆమె 42 సంవత్సరాలు… అవును, అక్షరాలా నలభై రెండు సంవత్సరాలపాటు ఓ శవంగానే బెడ్ మీద పడి ఉంది… ఏ స్పందనలు లేకుండా… ఏ ఇంద్రియాలూ పనిచేయకుండా… జస్ట్, జీవం ఉందీ అంటే ఉంది… లేచేది లేదు, చికిత్సకు దేహం స్పందించదు, ట్యూబ్ ద్వారా ద్రవరూపంలో తిండి, వెళ్లినట్టే తిరిగి బయటకు… నాలుగు దశాబ్దాలు ఒక శవంగా పడి ఉండటం అంటే ఎంత నరకం..? అసలు ఆమె తన దుస్థితి గురించి… ఆ నీళ్లు లేని కళ్లతో ఏడిచీ ఏడిచీ… ఎప్పుడో మానసికంగా చచ్చిపోయి ఉంటుంది… సొంత వాళ్లే విడిచిపెట్టేశారు… ఆ హాస్పిటల్ స్టాఫే చూసుకునేవాళ్లు…
ఆమె ఎముకలు క్రమేపీ పెళుసుబారాయి… పళ్లు పోయాయి… అస్థిపంజరంలా మారింది… లైఫ్ సపోర్ట్ మీద నాడి స్పందన కొనసాగుతోంది… విచిత్రం ఏమిటో తెలుసా..? ఈ అత్యాచారం చేసిన వాల్మీకికి కోర్టు చోరీ, హత్యాయత్నం కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్ష వేసింది… అత్యాచారం కేసు కిందకు రాలేదు… ఎందుకంటే, జరిగిన అత్యాచారం ముందు నుంచి జరిగింది కాదు కాబట్టి అట..!! తనకు ఏడేళ్ల జైలు, ఆమెకు నలభై రెండేళ్ల నరకం… ఆమె మీద అరుణ కథ అనే పుస్తకం రాసిన మానవహక్కుల కార్యకర్త పింకి విరానీ 2009లో మెర్సీకిల్లింగ్ పిటిషన్ వేసింది… కానీ ఆ హాస్పిటల్ స్టాఫ్ వ్యతిరేకించింది… 2011లో సుప్రీం ఒక తీర్పు చెబుతూ… ఒకవేళ హాస్పిటల్ స్టాఫ్ గనుక మనసు మార్చుకుంటే బాంబే హైకోర్టు అనుమతి తీసుకుని, ఆమె లైఫ్ సపోర్ట్ (ఆక్సిజన్) తొలగించవచ్చునని అనుమతించింది… కానీ ఆమె అలా చనిపోలేదు… 2015లో న్యూమోనియా వచ్చి, చికిత్స సాధ్యం కాక మరణించింది… తరువాత మూడేళ్లకు ఈ నియమం అమల్లోకి వచ్చింది… ఏమనీ అంటే..? ఇక విధిలేని పరిస్థితి అనిపిస్తే, లైఫ్ సపోర్ట్ తొలగించాలి… అంటే ఒకరకంగా గౌరవంగా మరణించడానికి మార్గం వేయడమే… ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… పోర్చుగల్ కూడా మెర్సీ కిల్లింగుకు నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు… మన కార్పొరేట్ హాస్పిటళ్ల ధనదాహం… అవి శవాలకూ చికిత్సలు చేస్తూ డబ్బులు కాజేస్తాయి… నెలలు, ఏళ్ల తరబడీ డబ్బుల కోసం లైఫ్ సపోర్ట్ మీద జీవస్పందనను మాత్రం నిలబెట్టి, డబ్బులు గుంజుతూనే ఉంటాయి… ఏదీ సరిగ్గా చెప్పరు… కాపురాలు కూలిపోతాయి, అప్పులపాలవుతాయి… కార్పొరేట్ పిశాచాలు ధనం పీల్చేస్తూనే ఉంటాయి… అందుకని మెర్సీకిల్లింగ్ అనే పదం పదే పదే అలాంటి రోగుల కుటుంబసభ్యులు, బంధువుల్లో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది…!!
Share this Article