Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!

January 17, 2026 by M S R

.

రోచిష్మాన్… మరుతూర్ గోపాలన్ రామచంద్ర మేనోన్ లేదా ఎమ్.జీ.ఆర్. జయంతి ఇవాళ. ఒకప్పటి తమిళ్ష్ సినిమా‌ స్యూపర్‌స్టార్, తమిళ్ష్‌నాడు ముఖ్యమంత్రి ఎమ్.జీ.ఆర్. ఆయన్ను ఓసారి స్మరించుకుకోవాలి… 38 ఏళ్లయింది మరణించి, ఐనా గుర్తుచేసుకంటున్నాం అంటేనే తనెంత విశిష్టుడో అర్థమవుతుంది.

సినిమా మాధ్యమంపై అంతకు మునుపు మఱెవరికీ లేని పరిశీలన, అవగాహన, పట్టు ఎమ్.జీ.ఆర్.కు ఉండేవి.‌ 1936లో సతీలీలావతి అన్న తమిళ్ష్ సినిమాలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టాక 1950లకు ఆయన ప్రముఖ నటుడయ్యారు. ఎన్నో కష్టాలు, ఎంతో లేమి, ఎదురుదెబ్బలు వీటితో అలమటిస్తూ బతికి ఒక దశలో విజయాన్ని అందుకుని తమిళ్ష్‌నాడు చరిత్రలో సుస్థిరస్థానాన్ని పొందారు. ఆయన పోయి 38 యేళ్లు అయినా ఆయన్ను తమిళ్ష్‌నాడులో రాజకీయంగా విమర్శించే సాహసం చెయ్యరు. ఆయన శ్రీలంకలో పుట్టిన మలయాళీ!

Ads

నాటక నటుడు, సినిమా సహాయక నటుడు తరువాత స్యూపర్ స్టార్, తిరుగులేని రాజకీయ నాయకుడు, చెరిగిపోని చరిత్ర ఎమ్.జీ.ఆర్. అమేరిక నటుడు Eroll Flynn ప్రభావంతో ఎమ్.జీ.ఆర్. ఒక cult నటుడు అయ్యారు.

సినిమా మాధ్యమాన్ని ఎమ్.జీ.ఆర్.లా ఉపయోగించుకున్న మఱో సినిమా నటుడు ప్రపంచంలో లేడు.‌ సినిమా ద్వారా ప్రజల్లకి వెళ్లడం ఎమ్.జీ.ఆర్.కు తెలిసినట్టుగా ప్రపంచంలో మఱే నటుడికీ తెలియదు.

ఏ‌ సినిమా ఆడుతుంది?‌ ఏ సినిమా ఆడదు? ఏ పాట హిట్ అవుతుంది? ఎలాంటి మాటలు ప్రజల్లోకి వెళతాయి
వంటి వాటిపై గొప్ప పరిశీలన, అవగాహన ఉన్న వారు ఆయన.‌ ఎమ్.జీ.ఆర్. మన ఎన్.టి.రామారావును నటుడిగా అభిమానిస్తారు!

ఎమ్.జీ.ఆర్. ఏ వయసు వ్యక్తినైనా మర్యాదతో సంబోధించేవారు ఇంగితం, కృతజ్ఞత వంటివి చాల మెండుగా ఉన్న వ్యక్తి ఆయన. కవులకు, కళాకారులకు ఎంతో మర్యాదనిచ్చేవారు. తన విజయానికి కవి పట్టుక్కోట్టై కళ్యాణసున్దరమ్ ఒక పెద్ద కారణం అని గట్టిగా చెప్పారు ఆయన. కవి కణ్ణదాసన్‌తో ఆయనకు విభేదాలుండేవి. ఆ కారణంగా కవి వాలిని ప్రోత్సహించారు. అయినా తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక కణ్ణదాసన్‌ను ప్రభుత్వ అస్థాన కవిని చేశారు. కణ్ణదాసన్ పార్దివ శరీరంతో శ్మశానం వఱకూ ముఖ్యమంత్రి ఎమ్.జీ.ఆర్. నడిచివెళ్లారు! గాయని పీ. సుశీలను కీర్తిస్తూ సుశీల దక్షిణాది లతామంగేష్కర్ కాదు లత ఉత్తారాది సుశీల అన్నారు.

తన సినిమా నైజానికి పూర్తి విరుద్ధమైన కె. బాలచందర్, మహేంద్రన్ వంటి న్యూవేవ్ దర్శకుల్ని ఎంతో ముందుగా గుర్తించి ప్రోత్సహించిన దీర్ఘదర్శి ఎమ్.జీ.ఆర్.

  • ఎమ్.జీ. ఆర్.‌ రాజకీయాల్లో ఉంటూ కూడా ఏనాడూ ఏ ఒక్కరినీ విమర్శించలేదు. బహుశా విమర్శ అంటూ చెయ్యని ఒకే రాజకీయనాయకుడు ఎమ్.జీ.‌ఆర్. మాత్రమేనేమో?

నాస్తిక ద్రావిడ పార్టీలో ఆస్తికుడు ఎమ్.జీ.ఆర్! ఆయనకు జ్యోతిష్కంపై నమ్మకం ఉండేది. ఆయన‌ వ్యక్తిగత జ్యోతిష్యుడు కాళ్షియూర్ శ్రీనివాసాచారి కుటుంబంతో ఈ వ్యాస రచయితకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ విషయం తెలియజెయ్యబడుతోంది. బ్రాహ్మణులంటే ప్రత్యేకమైన అభిమానం కలవారు ఎమ్.జీ. ఆర్.‌ (ద్రావిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకత పబ్బం గడుపుకోవడం కోసమే)

ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తాను ఒక మెట్టు కింద ఉండే మాట్లాడేవారు! తనకు విషయం తెలుసు అన్నట్టుగా ఎవరితోనూ ఏ సందర్భంలోనూ తన ఆధిక్యతను, దూకుడుతనాన్ని చూపించేవారు కాదు ఎమ్.జీ. ఆర్. ఇది‌ చాల గొప్ప లక్షణం!

విశేషమైన సంకల్ప శక్తి, మనో నిబ్బరం ఎమ్.జీ.ఆర్.కు‌ ఉండేవి. ఆయనకు తీవ్రమైన పక్షవాతం వచ్చింది. మానసిక స్థైర్యంతో దాని నుండి ఆయన బయటపడగలిగారు. అలాంటి పక్షవాతం వస్తే మళ్లీ లేచి మామూలుగా తిరుగాడడం అన్నది దాదాపుగా అసాధ్యం. ఆ పరిస్థితి నుండి ఎ‌మ్.జీ. ఆర్‌. తెప్పరిల్లారు. ఎమ్.జీ.ఆర్ వైద్యుడు డాక్టర్. రత్నసబాపతి వ్యాసకర్తతో ఈ విషయాన్ని చెప్పారు.

ఎమ్.ఆర్. రాదా (నటి రాధిక తండ్రి) ఎమ్.జీ.ఆర్.ను చంపేందుకు తుపాకీతో కాల్చితే గురి తప్పి బుల్లెట్ ఆయన గొంతులోకి దిగింది. తెలుగువారైన డాక్టర్. చిట్టూరి సత్యనారాయణ విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన సందర్భంలో ఎమ్.జీ.‌ఆర్. చూపిన మనో నిబ్బరం గుఱించి చిట్టూరి సత్యనారాయణ ఈ వ్యాసకర్తతో చెప్పారు.‌

ఆ హత్యా ప్రయత్నం తరువాత కొంతకాలానికి ఎమ్.జీ.ఆర్.ను ద్రావిడ మున్నేఱ్ట్ర కళ్షగం పార్టీ నుండి కరుణానిది(ధి) బహిష్కరించారు. అటు తరువాత ఎమ్.జీ.ఆర్‌. సొంత పార్టీ పెట్టుకుని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

  • బతికున్నంత వఱకూ ఓటమి‌ లేని ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏనాడూ,‌‌ ఏ‌‌‌ సందర్భంలోనూ ఎమ్.జీ.ఆర్. కరుణానిదిని తూలనాడ లేదు పైగా ‘శ్రీయుతులు కరుణానిది’ అనే సంబోధించేవారు. జాతీయ కాంగ్రెస్ పార్టీని, అప్పటి దేశ ప్రధాని ఇందిరను కూడా విమర్శించలేదు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎదగనివ్వలేదు.

తిరుగులేని నాయకుడిగా, ఓటమి ఎఱుగని ముఖ్యమంత్రిగా ఉండీ కూడా ఎ‌మ్.జీ.ఆర్ పెద్దగా డబ్బు కూడబెట్టలేదు! తన తరువాత తన ఆస్తుల్ని చాల వఱకూ బీదలకు చెందేట్టు చేశారు. ‘ఇవ్వడం’ ఎమ్.జీ.ఆర్. కు ఇష్టమైన విషయం‌. దా‌నం చెయ్యడాన్ని గొప్పగా చేసే వారు ఆయన.

ఇంగితం, కృతజ్ఞత, అన్నం‌‌ పెట్టడం, తన‌ ఆధిక్యతను చూపించకపోవడం, సాటి‌ వ్యక్తికి మర్యాదనివ్వడం, కవుల్ని, కళాకారుల్ని గౌరవించడం వంటి లక్షణాలు ఎ‌మ్.జీ. ఆర్. ప్రత్యేకతలు.

సర్వాధికారి అనే సినిమాలో ఎమ్.జీ.ఆర్. తెలుగు మాట్లాడి కథా నాయకుడుగా నటించారు. గాయకుడు ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం గొప్పతనాన్ని మన తెలుగు అగ్ర నటులకన్నా ముందు గుర్తించి తనకు పాడించుకున్నారు ఎమ్.జీ.ఆర్.

బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసుకున్నాక పాట రికార్డింగ్ రోజుకు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డ బాలసుబ్రహ్మణ్యం పాడలేకపోతే రెండు నెలలు ఎమ్.జీ.ఆర్. వేచి ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం అప్పటికి ఏ మాత్రమూ గుర్తింపు ఉన్న గాయకుడు కాదు. అయినా ఎంపిక చేసుకున్నాక బాలసుబ్రహ్మణ్యం కాకుండా ఇంకో గాయకుడి చేత పాడించుకుంటే ఎదగాల్సిన బాలసుబ్రహ్మణ్యంకు అది దెబ్బ అవుతుందని, బాలసుబ్రహ్మణ్యంకు మిత్రవర్గంలోనూ, మానసికంగానూ హాని జరుగుతుందని ఎమ్.జీ.ఆర్. అంత కాలమూ వేచి ఉండి బాలసుబ్రహ్మణ్యం చేత పాడించుకున్నారు. ఈ ఉదంతం ఎమ్.జీ.ఆర్. గురించి మనకు సరైన ఆలోచననిస్తుంది.

నింద, దూషణ, హింసా రాజకీయాలు చేసే ఇవాళ్టి రాజకీయ నాయకులు ఎమ్.జీ.ఆర్.ను ఆదర్శంగా తీసుకోవాలి. ఓట్ల కోసం జాతి, జాతీయతా వ్యతిరేక రాజకీయాలు చెయ్యలేదు ఎమ్.జీ.ఆర్.! మైనారిటీ వర్గాల ఓట్లతో గెలిచేందుకు ఎమ్.జీ.ఆర్. దిగజారలేదు! ముస్లీమ్, క్రిస్టిఅన్ ఓట్లు పెద్ద శాతం తన ప్రత్యర్థికి పడుతున్నా దేశ వ్యతిరేక కుల, మత సంతుష్టీకరణ రాజకీయాలు చెయ్యని ధీర రాజకీయ నాయకుడు ఎమ్.జీ.ఆర్.

ఎమ్.జీ.ఆర్. కుల, మత రాజకీయాలు చెయ్యలేదు! విదేశీ మతం ఓట్లతోనూ, కులం ఓట్లతోనూ ఎన్నికల్లో గెలవాలనుకున్న సిగ్గులేని రాజకీయ నాయకుడు కాదు ఎమ్.జీ.ఆర్. ఒక దళితుణ్ణి తొలిసారి తమిళ్ష్‌నాడు నుండి పార్లమెంటుకు పంపారు. నక్సలిజాన్ని చిత్తశుద్ధితో ఆరంభంలోనే సమూలంగా నరికేసిన దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి ఎమ్.జీ.ఆర్.

ఎమ్.జీ.ఆర్. సంస్కృతికి, భారతీయతకు వ్యతిరేకంగా సినిమాలు చెయ్యలేదు; మాట్లాడలేదు; పని చెయ్యలేదు. కులం సినిమాలు చెయ్యలేదు. ఈ విషయాల్లో ఇవాళ్టి సినిమా కళాకారులకు, రాజకీయ నాయకులకు ఎమ్.జీ.ఆర్. ఆదర్శనీయుడు.

కులం, విదేశీ మతం, మాఫియా వీటికి అతీతంగా సినిమాలోనూ, రాజకీయాల్లోనూ ఎదిగిన, గెలిచిన, గెలుపుగా నిలిచిపోయిన విజేత, ప్రజానేత ఎమ్.జీ.ఆర్! ఎమ్.జీ. ఆర్. ఆదర్శంగా ఇవాళ దేశంలోని ముఖ్యమంత్రులు పనిచెయ్యాలి. విదేశీ మత, కుల సంతుష్టీకరణల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఎమ్.జీ.ఆర్.ను ప్రతి ముఖ్యమంత్రి అధ్యయనం చెయ్యాలి.

ఎమ్.జీ. ఆర్. రాజకీయ విజయాలపై, రాజకీయ ప్రవర్తనపై అధ్యయనాలు జరగాలి; ఆ అధ్యయనాలు ఈనాటి కుల, మత, ప్రాంతీయతా వాద నీచ, దుష్ట, భ్రష్ట రాజకీయ నాయకులకు అతీతంగా దేశానికి మేలు చేస్తాయి…. రోచిష్మాన్ 9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!
  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!
  • కేటీయార్ హుందా స్పందన… హరీష్ రావు ‘గంటె భాష’లో అక్కసు…
  • కలాం కావల్ – మమ్ముట్టి ‘నట మాయాజాలం’… మరో భిన్నపాత్రలో…
  • ‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…
  • మరాఠీల అసలు తీర్పు..! విద్వేషంపై విజయం సాధించిన విజ్ఞత..!
  • నవ్వుతూ, నవ్విస్తూనే… పాఠం చెప్పగలదు… ప్రతిభ చూపగలదు…
  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions