Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

* తెలంగాణా ఉద్యమం – రాయనిగూడెం సంఘటన – గతంలో రాయని ఓ యాది *

June 5, 2023 by M S R

Venkataramana Kannekanti  తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి బలిదానం ఎంత కీలకమైందో, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రాళ్లవాన, ములుగు జిల్లా మారుమూల గిరిజన పల్లెలో అప్పటి సమైక్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో నలుగురు గిరిజన యువతులు చూపిన తెగువ అంతే ముఖ్యమైనవి. తీవ్ర నిర్బంధం, అడుగడుగునా మఫ్టీ పోలీసుల మోహరింపు, విస్తృత తనిఖీలను ఎదిరించి మరీ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు యువ ఉద్యమకారిణులు సమైక్య సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో జై తెలంగాణ అనే నినాదాలతో ధైర్యంగా ఎదిరించడం తెలంగాణ ఉద్యమంలో మరో కీలక ఘట్టం గా నిలిచింది. అప్పటి ఉద్యమకారులందరికీ తెలిసిన ఈ సంఘటన వివరాలకొస్తే,..

వరంగల్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏడేళ్లకు పైగా పని చేసిన కాలంలో ఎన్నో ప్రధాన సంఘటనలను ప్రత్యక్షంగా చూసాను. దీనిలో ప్రధానమైనది తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం. మొత్తం తెలంగాణలోని గ్రామగ్రామంలో తలెత్తిన ఉద్యమం వరంగల్ జిల్లాలోనూ అంతే ఉదృతంగా సాగింది. ఈ నేపథ్యంలో, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి వరంగల్ పర్యటన ఖరారైంది. తీవ్రవాద ప్రభావిత ములుగు మండలంలోని గిరిజన గ్రామమైన కొత్తూరు గ్రామం శివారు పల్లె అయిన రాయనిగూడెం… మహిళా సంఘాల సమావేశంలో సీఎం పాల్గొనేందుకు తేదీ.10 .2 .2011 న ప్రోగ్రాం ఖరారైంది.

రచ్చబండ అనే పేరుతో ఏర్పాటైన ఈ సభకు వచ్చే వారిపై గతంలో ఎప్పుడూ చూడలేని ఆంక్షలు విధించారు పోలీసులు. సభలోకి వచ్చే వారు చెప్పులు కూడా బయటే విడిచి రావడం, కనీసం మంచినీళ్ల బాటిళ్లు కూడా అనుమతించక పోవడం, ఆ ప్రాంతంలో ఉన్న మాజీలను అదుపులోకి తీసుకోవడం, సభలో ఏదైనా ఆందోళనలు, అలజడులు జరిగితే స్థానిక నాయకులను బాధ్యులుగా చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం… ఇలా ఎన్నో జాగ్రత్తలు విధించారు. ఇక, డీపీఆర్ఓగా మీడియా ప్రతినిధుల నుండి ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చూసే భాద్యతలను కలెక్టర్ నాపై ఉంచారు.

Ads

ఇక, సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి రాయనిగూడెం వచ్చారు. అక్కడే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి మహిళా సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చేసిన కృషిని వివరించి ప్రెస్ మీట్ ముగిస్తుండగానే… ప్రెస్ మీట్ కు హాజరైన విలేఖరులందరూ ఒక్కసారిగా తమ చేతుల్లోని నోట్ బుక్స్ కాయితాలపై జై తెలంగాణా అని రాసిన ప్లే కార్డులను ప్రదర్శించి, నినాదాలు చేశారు. రాయనిగూడెంలో రచ్చబండ కార్యక్రమాన్ని కవరేజి చేయడానికి వచ్చిన విలేఖరులు కెమెరా బ్యాగుల్లో తెల్లకాగితాలు, స్కెచ్చు పెన్నులు తీసుకెళ్ళి నినాదాలు రాసుకున్నారు.

ఆకస్మికంగా జరిగిన ఈ చర్యకు అప్పటి కలెక్టర్ సహా పోలీస్ ఆఫీసర్లందరూ ఆందోళనపడ్డారు. ఇక, ఆ ప్రెస్ మీట్ ఎలాగోలా ముగించుకొని కిరణ్ రెడ్డి సభకు వచ్చారు. సభలో కూడా ఏదో అవుతుందనే ఆందోళన కూడా అధికారులలో నెలకొంది. అయినప్పటికీ , భారీ బందోబస్తు, అన్ని జాగ్రత చర్యలు, పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసుల ఏర్పాటు ఉన్నాయి కాబట్టి ఏమీ జరగదని భరోసా కూడా పోలీసులకు ఉండింది. సభావేదికపై సి.ఎం కు సన్మానం జరిగి, అప్పటి మంత్రి సారయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడిన అనంతరం ప్రసంగించడానికి కిరణ్ కుమార్ లేవగానే.., సభ మధ్యలో నుండి, జై తెలంగాణా, జై జై తెలంగాణా అనే నినాదాలు చేస్తూ నలుగురు యువతులు ఒక్కసారిగా లేవడంతో పోలీసులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందారు.

పైగా ఆ నలుగురు సి.ఎం కు వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని పట్టుకొని నోర్లు మూసినా ఎంతో ధైర్యంతో తెలంగాణా నినాదాలను వీడలేదు. దీంతో, ప్రెస్ గ్యాలరీలో ఉన్న జర్నలిస్టులు కూడా వారికి కోరస్ గా జై తెలంగాణా నినాదాలు చేస్తూ, వారి వద్ద ఉన్న పేపర్లపై జై తెలంగాణా అని రాసిన పోస్టర్లను ప్రదర్శించారు. ఇక, ఒక్కసారిగా, సభలోని వారందరూ తెలంగాణా నినాదాలతో హోరెత్తించారు. దీనితో, సభను అర్దాంతరంగా ఆపి కిరణ్ కుమార్ రెడ్డి వెనుతిరిగారు.

ఆ సభలో అత్యంత దైర్యంగా సి.ఎం వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా ఉమ్మడి రాష్ట్ర పాలకులకు ముచ్చెమటలు పట్టించడానికి కారకులు ఆ నలుగురు… కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న యువతులు… ఆ ధైర్యాన్ని అభినందిస్తూ, జిల్లావ్యాప్తంగా సన్మానాలు జరిపారు. వారి ధైర్యానికి ప్రసశంసల వర్షం కురిపించారు. ఈ సంఘటన ఎందరికో మరికొంత స్ఫూర్తి నిచ్చింది. (రాయనిగూడెంలో అప్పటి జర్నలిస్టులు సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఫోటోలను చూస్తే అప్పటి సంఘటన యాదికొచ్చింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions