నిన్నటి నుంచీ తెగ హల్‌చల్ చేస్తోంది ఒక వాట్సప్ మెసేజ్… అంత పెద్ద సందేశం అవసరం లేదు గానీ, సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే…
*ఈనాడులో పెద్ద తలకాయ మీద వేటు
* పక్కా ఆధారాలతో దొరికిపోయిన మేనేజర్ శ్రీనివాసులు నాయుడు
Ads
* అనంతపురం జిల్లా యాడికి మండలంలో రూ.కోటితో బంగ్లా నిర్మాణం
* తిరుపతి యూనిట్ లో పెద్దల్ని ప్రసన్నం చేసుకుని పదేళ్ల పాటు మేనేజర్ గా కొనసాగింపు
* పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్లేలా చేసిన వైనం
* మొత్తానికి బయట పతివ్రత నాటకాలు
* తిరుపతి యూనిట్ లో కూడా విచారించే అవకాశం
విషయం ఏమిటంటే… యాడికి మండలంలో కోటి రూపాయలతో ఓ బంగ్లా కట్టాడట… అక్కడ ఈనాడు రిపోర్టర్‌ను బెదిరించి మొత్తం నిర్మాణ సామగ్రిని ఉచితంగా సమకూర్చుకున్నాడుట… తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సాయంతో ఇంటి దాకా నాలుగు వరుసల రోడ్డు వేయించుకున్నాడట… ఓ టీడీపీ నేత మొత్తం సిమెంటు స్పాన్సర్ చేశాడట, ఎన్నికల్లో డబ్బులు తిన్నాడట… ఈలోపు సదరు నేతకూ, ఈ రిపోర్టర్‌కూ ఎక్కడో చెడిపోయి, ఆ రిపోర్టర్‌ను తీసేయాలని ఆ నేత ఒత్తిడి… నువ్వు ఫేక్ లెటర్లు పెట్టించు, నేను తీసేయిస్తాను అని ఈ మేనేజర్ వ్యూహం అట…
పేరుకు ఈటీవీ స్టాఫర్ నివేదిక అని చెప్పి, తనే అవాకులూ చెవాకులూ రాసి, పైకి పంపించి సదరు రిపోర్టర్‌ను ఊడబీకించాడుట… సదరు టీడీపీ నేత చెప్పిన కొత్త వ్యక్తిని కొత్త రిపోర్టర్‌గా పెట్టించాడట… కాస్త లేటుగా ఈ కుట్ర మొత్తం తెలిసిన పాత రిపోర్టర్ జరిగిందేమో వివరంగా పెద్దలకు లేఖలు రాశాడుట… దీంతో హైదరాబాద్ నుంచి ఓ టీం వెళ్లి, మేనేజర్ బాగోతాలన్నీ గమనించి, మొత్తానికి పక్కన పెట్టేశారుట…
అసలు ఎవరూ నాలుగేళ్లకు మించి ఒక యూనిట్‌కు మేనేజర్‌గా ఉండరు, కానీ ఈయన పదేళ్లపాటు అదే యూనిట్‌లో ఉన్నాడు… కారణం, రామోజీరావు వియ్యంకుడు సుందరనాయుడు సపోర్ట్… తన బారిన పడని రిపోర్టర్లు, సబ్‌ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లు లేరుట… ఇలా పెద్ద కథ ఆ వాట్సప్ సందేశంలో రాయబడి ఉంది…
……. ఇక్కడ కొన్ని అంశాలు… నిజానికి ఈయన ఓ సూచిక మాత్రమే… మీడియా నెట్‌వర్క్ మొత్తం అలాగే ఏడ్చింది… రిపోర్టర్లు, మేనేజర్లు, మార్కెటింగ్ స్టాఫ్… కింద నుంచి పైదాకా ఇదే బాగోతం… ఈనాడులో గతంలో అందరి మీద నిఘా వుండేది, ఎంక్వయిరీలు జరిగేవి… ఇప్పుడు మరీ సీరియస్ నేచర్ అయితే తప్ప ఎవరి మీద ఏ చర్యలు లేవు… అన్నిరకాల అవలక్షణాలు కమ్మేశాయి… ఎప్పుడైతే రామోజీరావు పగ్గాలు వదిలేశాడో మొత్తం భ్రష్టుపట్టింది…
అయితే మిగతా పత్రికలు ఏమైనా శుద్ధపూసలా… అవి మరీ భీకరం… కొన్ని చిన్న పత్రికలైతే… నువ్వు ఏం సంపాదించుకుంటావో నీ ఇష్టం, మాకు ఎంత చెల్లిస్తావో చెప్పు అనే పద్ధతిలో మేనేజర్లు కమ్ రిపోర్టర్లు కమ్ ఎగ్జిక్యూటివ్స్ కమ్ ఆల్ నియమించుకుంటున్నయ్… సీరియస్ ఫిర్యాదులు వస్తే ఈనాడులో ఇప్పటికీ ఎంక్వయిరీలు, చర్యలు తీసుకుంటున్నారు… అది కొంత నయమే కదా…! కానీ పేరున్న ఇతర పెద్ద పత్రికల్లోనూ అడ్డూఅదుపూ లేని అక్రమాల యంత్రాంగాలు… ఎప్పుడైతే మార్కెటింగ్, సర్క్యులేషన్, ఎడిటోరియల్, ట్రాన్స్‌పోర్ట్, ప్రింటింగ్ తదితర అన్ని విభాగాల మీద మేనేజర్లకు పెత్తనాలు వచ్చాయో, ఇక జర్నలిజంలో ఓనమాలు తెలియని వాళ్లు కూడా అర్జెంటుగా ‘‘తెలుగు జర్నలిజానికి దశలు, దిశలు’’ అయిపోయారు… అది తెలుగు పాత్రికేయం ఖర్మ…
శ్రీనివాసులు నాయుడు అసలు వ్యాధి కానేకాదు… తను ఓ వ్యాధి లక్షణం మాత్రమే… తన తప్పేముంది..? యథా స్టాఫు, తథా చీఫు… అన్నట్టుగా ఉంది… ఎవరు శుద్ధపూసలు..? టీవీ చానెళ్లు, పత్రికలు, చివరకు యూట్యూబ్ చానెళ్ల వాళ్లు, ఫేక్ ఐడెంటిటీలతో ఇతరులు కూడా గ్రామీణ స్థాయిలో చెలరేగిపోతున్నారు… పోలీసులు, రెవిన్యూ, కరెంటు వాళ్లను మించి… గతంలో ప్రజలు ప్రభుత్వ అధికారులను చూస్తే బెదిరిపోయేవాళ్లు… వాళ్లకు ఇప్పుడు మీడియా జతచేరింది… ఆఫ్టరాల్ శ్రీనివాసులు నాయుడు… జస్ట్, కోటి రూపాయల ఇల్లు కట్టుకున్నాడు… ఓసోస్, ఇంతేనా అనుకుని వెక్కిరింపుగా, జాలిగా నవ్వుకునే మీడియా సిబ్బంది సంఖ్య వేలల్లో ఉంటుంది… మీడియా హెడ్డాఫీసులు ఏమైనా శుద్ధపూసలకు కేంద్రమా..? భలేవారే…!!
Share this Article