అప్పట్లో బాగా హైప్ క్రియేటై, అడ్డంగా బోల్తాకొట్టిన విరాటపర్వం సినిమా రివ్యూలోకి లేదా ఇతర అంశాల్లోకి నేనిక్కడ వెళ్లాలని అనుకోవడం లేదు… ఇప్పుడు ఆ అవసరమూ లేదు… సందర్భమూ లేదు… కానీ దర్శకుడు ఊడుగుల వేణు పెట్టిన ఓ పోస్టు ఆలోచనల్లో పడేసింది… నో డౌట్, సోకాల్డ్ కమర్షియల్, హిట్, పాపులర్ దర్శకులెందరున్నా సరే, వేణు డిఫరెంట్, సెన్సిబుల్, సెన్సిటివ్… తన టేకింగ్, కథనం గట్రా విభిన్నం… స్టార్ దర్శకులతో తనను పోల్చి తనను కించపరచ దలుచుకోలేదు…
విరాటపర్వం రిలీజై ఏడాది నిండిన సందర్భంగా తను ఓసారి ఈ పోస్టులో స్మరించుకున్నాడు… విస్మయం కలిగించింది… సాధారణంగా దర్శకులెవరూ ఫ్లాప్ సినిమాల్ని గుర్తుచేసుకోవడానికి ఇష్టపడరు… కానీ వేణు ఓసారి మెమరేసుకున్నాడు… ఒక్కసారి ఆ పోస్టు చూడండి… తరువాత మాట్లాడుకుందాం…
‘‘విరాటపర్వం, One year of Metamorphosis…. విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది.
Ads
విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది.
కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాటపర్వం నాకు ఒక Self discovery లాంటిది. తీయబోయే చిత్రాలకు Preamble లాంటిది’’
అంటూ తనతోపాటు సినిమాకు పనిచేసిన వివిధ విభాగాల వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు… అది వేరే సంగతి… హఠాత్తుగా విరాటపర్వం ఒకటో వార్షికోత్సవాన్ని ఈ సోషల్ పోస్టు ద్వారా జరుపుకోవడం దేనికో అర్థం కాలేదు… పైగా తనేం చెప్పుకోదలచుకున్నాడో క్లారిటీ లేదు… విరాటపర్వం సినిమాలాగే… వేణు అనే దర్శకుడు ఉన్నాడు సుమీ అని అన్యాపదేశంగా అందరికీ గుర్తుచేయడమా..? నేను అందరూ మెచ్చే సినిమా తీశాను గానీ మార్కెట్ దెబ్బకొట్టింది అనే భావన వ్యక్తీకరిస్తున్నాడా..?
అందరూ మెచ్చారు గానీ సినిమా సక్సెస్ కాలేదు అనేదే నిజమైతే అది తప్పు… ఉదాహరణకు బలగం… అది తీసింది మరో వేణు… నిజాయితీగానే తన మనస్సులో ఉన్న భావాలకు తెరరూపం ఇచ్చాడు… సోకాల్డ్ సినిమా కథల అవలక్షణాలేమీ లేవు, నేచురాల్టీ ఉంది… అదేసమయంలో కనెక్ట్ అయ్యాడు ప్రేక్షకులతో… స్థూలంగా చూస్తే ఏముంది అందులో అనిపిస్తుంది… ఓ చావు, పిట్టముట్టదు, కారణాల అన్వేషణ, దిద్దుబాటు… కానీ సినిమాలో లీనమయ్యేవాడికి తెలుస్తుంది కుటుంబబంధాల విశిష్టత, లోతు ఏమిటో… కానీ ఊడుగుల వేణు ఏం చేశాడు..?
పరిపక్వత లేని ఓ యువతి… ముక్కూమొహం తెలియని ఓ దళనాయకుడిని మూర్ఖంగా ఆరాధిస్తుంది… వాడి కోసం గుడ్డిగా అడవుల బాటపడుతుంది… నిజజీవితంలోనే కాదు, సినిమాలోనూ ఆ హీరో హీరో కాదు, పక్కా విలన్… ఆ యువతికన్నా మూర్ఖత్వం… జస్ట్, ఇన్‌ఫార్మర్ అని తేల్చేసి కాల్చిపడేస్తాడు… ధూర్తం… వీళ్లు జీవించే స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి, జీవితాల గురించి పల్లెల్లో నీతులు చెప్పారు, ప్రజాకోర్టులు పెట్టారు… ఆ శిక్షలకు ఓ అర్థం, ఓ దశ, ఓ దిశ లేవు… గుడ్డెద్దు చేలో పడ్డట్టే… దీనికి ప్రేమ అనే రంగుపూసి, ఈ ప్రేమకథకు ఉదాత్తతను రంగరించి, ఏదో విశేష కథ అన్నట్టుగా వేణు చెప్పబోయాడు… అదీ తప్పు… అదే తప్పు… సాయిపల్లవి, నందితాదాస్‌ల శ్రమ, ప్రతిభ వృథా అయిపోలేదా..?
సినిమా తీయడం చేతకాక కాదు… వేణు మంచి ఎఫిషియెంట్ దర్శకుడు… కానీ కథ ఎంపికే తప్పు… దాని ట్రీట్‌మెంట్ తప్పు… పైగా విప్లవం, ప్రేమ అనే వేర్వేరు ఎమోషన్లను జతచేశాడు… మూర్ఖత్వానికి ఉదాత్తత రంగు పులమడమే బేసిక్ తప్పు… ప్రేక్షకుడికి నచ్చలేదు, నచ్చకపోవడంలో అనౌచిత్యం ఏమీ లేదు… స్టార్ దర్శకులు, స్టార్ హీరోలు ఎలాగూ సినిమాను ధ్వంసం చేశారు, చేస్తున్నారు, చేస్తారు… కానీ తెలంగాణ ‘వేణు’లు కూడా మరోరకం అనౌచిత్యానికి పాల్పడితే ఎలా…
ఊడుగుల వేణుకు నున్నా నరేష్ ఇచ్చిన కామెంటాన్సర్ ఇంట్రస్టింగ్, అదీ చదవండి…
‘‘100 కి 10 మార్కులు కూడా రాని ‘విరాటపర్వం’!… డియర్ వేణు, మీలో `’Metamorphosis’` కి కారణమైన మీ ‘విరాటపర్వం’ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదు.
శ్రీకాకుళ ప్రజాపోరాట వీరుడైన ఆదిభట్ల కైలాసం కథని మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్నానని అట్టహాసంగా ఒక 7 star హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటిస్తాడొక డైరక్టర్. ముహూర్తం షాటుకి తెలుగు/ తమిళ/ హిందీ భారీ తారాగణం తరలివస్తుంది. క్లాపు కొట్టే సెలబ్రిటీ, కెమెరా స్విచ్ఛాన్ చేసే ప్రముఖుడు, తొలి షాటుకి దర్శకత్వం వహించే దిగ్గజం.. మొత్తం a who’s who of film industry/ political gentry కిక్కిరిసి ఉంటారు. ఆదర్శవంతమైన ఆదిభట్ల కైలాసం జీవితం ప్రజాబాహుళ్యంలోకి బాగా చొచ్చుకొని వెళ్ళాలని, తరతరాలనూ ప్రభావితం చేయాలని చిరంజీవి అంతటి పాపులర్ స్టార్ నే ఈ mission లో భాగం చేసేస్తాడు దర్శకుడు. ‘శానా కష్టమొచ్చిందే మందాకిని..” అంటూ ఒక బడుగు మహిళకి వచ్చిన కష్టాన్ని పాటకట్టి, కాలికి గజ్జెకట్టి ఆడి, అందరిలో గొప్ప అవగాహన కల్పించే జనరంజక సన్నివేశాలు సృష్టిస్తాడు.
– సినిమా కొన్ని వేల తెరల మీద, వంద కోట్ల పైచిలుకు బిజినెస్ చేస్తే చేసుండొచ్చు, ఆ మేరకి వసూళ్లు ఉండొచ్చు, లేకపోవచ్చు.
– అయితే, ఏంటి? కథ… కథనం… సిద్ధాంతం… సందేశం… పాత్ర… ఔచిత్యం… వంటి బూతుమాటలు ఆ సినిమా విశ్లేషణ విషయంలో ఎందుకు వాడతాం?
అలాగే, తాను పుట్టిన బంగ్లాదేశ్ లో మొదలెట్టి, దేశదేశాల సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా చిన్నమొత్తాల రుణాలతో మైక్రోఫైనాన్స్ విప్లవం తెచ్చి, నోబెల్ శాంతి బహుమతి గ్రహించిన ముహమ్మద్ యూనస్ జీవిత కథని కొంచెం ఆకర్షణీయంగా మార్చి, ‘కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి …. నువ్వు లేకుంటే అదో గతి…” అని కుర్రకారుని వెర్రెక్కిస్తూ వాళ్లని నేర్పుగా తన ఆదర్శప్రాయమైన దారిలోకి తెచ్చుకునే ఎత్తులతో జిత్తులతో సినిమా తీసి, ‘సరిలేరు నీకెవ్వరు..’ అనిపిస్తాడు మరో దర్శకుడు.
ముహమ్మద్ యూనస్ పాత్రని ‘The Merchant of Venice’ – Shylock కి తమ్ముడిలాగా తీర్చిదిద్దినా, ఆ డైరక్టరుని ఎందుకు ఛీకొడతాం? అంతే కాకుండా, చిప్కో ఉద్యమం, ఇంకా అనేకానేక పర్యావరణ ఉద్యమాలు చేసిన బక్కపలచ సుందర్లాల్ బహుగుణ కథకి జూనియర్ ఎన్టీయార్ సిక్స్ ప్యాక్ కండలతో తెరమీద బలుపెక్కిస్తే, ఈలలో… ఉమ్ములో వేసుకుంటూ వచ్చేస్తాం.
అలాకాకుండా, వేణు – సరళ కథ తీస్తానని ప్రకటించి, ఎంతో నిబద్ధంగా స్క్రిప్క్ రాసుకొని, నానా అగచాట్లు పడి, మొత్తం మీద ‘విరాటపర్వం’ పేరిట సినిమా తీస్తాడు. ఎన్నో ఘోరాల్ని సహించి ఉన్నాం, దారుణమైన సినిమాల్ని భరించి ఉన్నాం, కాబట్టి, విరాటపర్వం సినిమా మీద నోరెత్తకుండా, unconditional గా ఒప్పేసుకోవాలని దబాయిస్తే కుదరదు.
రాఘవేంద్రరావు… దాసరి… కోడి రామకృష్ణ.. రాజమౌళి… పూరి జగన్నాథ్… వీవీ వినాయక్… త్రివిక్రమ్ శ్రీనివాస్… శ్రీను వైట్ల… కొరటాల శివ… ఎన్ని హిట్లు ఇచ్చినా, ఎన్నెన్ని కోట్లు కురిపించినా, వాళ్ల సినిమాల్లో ఒక్క scene కూడా విమర్శకి అర్హమైనది కాదు. సీరియస్ సినిమాగా మీ బోటి వాళ్లు నమ్మిన, ప్రకటించిన, ప్రయత్నించిన ఏ సినిమా అయినా, ఏ ఒక్క scene కి కూడా విమర్శ నుంచి మినహాయింపు ఉండదు.
‘విరాటపర్వం’ సినిమా చూడటానికి (విడుదలకి) ముందు, సిద్దార్థ కవిత్వాన్ని తలుచుకుంటూ ఈ పోస్టు పెట్టాను. https://www.facebook.com/naresh.nunna/posts/5123300484391043 ఒక్క గ్రేసు మార్కు ఇవ్వడానికి కూడా మెత్తబడకుండా ‘విరాటపర్వం’ అనే సినిమాని నేను evaluate చేస్తే 100కి 10 మార్కులు కూడా రాలేదు. ఇది evaluation రిజల్ట్ మాత్రమే. ఎందుకు అన్ని తక్కువ మార్కులు అనే ప్రశ్నకి బదులుగా, నా evaluation పద్ధతిని చెప్పాల్సి ఉంటుంది. అది మరి ఇంకో సందర్భంలో… – నరేష్
Share this Article