.
అసంపూర్ణంగా హామీల అమలు… అనుభవరాహిత్యం ప్రభావాలు… ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవడంలో సమన్వయలోపాలు గట్రా రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు సంబంధించి ఎన్ని చెప్పుకున్నా సరే… లగచర్ల, దిలావర్‌పూర్ ప్రజల తిరుగుబాటును ప్రస్తావించకపోతే అది అసంపూర్ణం, అర్థ విశ్లేషణ మాత్రమే…
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వ్యాసం చదివాక అనిపించింది ఇదే… హైడ్రా దూకుడు మొదట్లో ఉన్నంత ఇప్పుడు లేదు… మూసీ పేదల ఇళ్ల కూల్చివేతపై మొదట కనిపించిన కాఠిన్యం ఇప్పుడు లేదు… బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధుల్లో ఆల్రెడీ నిర్మించిన ఇళ్ల కూల్చివేతపై హైడ్రాధీశుడే రోజుకోమాట మాట్లాడుతున్నాడు…
Ads
లగచర్లలో దిద్దుబాటు, ప్రజాగ్రహానికి తలవంచిన తీరు… దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు… ఆదానీ వంద కోట్ల విరాళం వాపస్ వంటి ప్రధాన అంశాల మీద రాధాకృష్ణ ఏ అభిప్రాయమూ వ్యక్తపరచలేదు… (మజ్లిస్ అధినేత ఏకంగా కుంట నడుమ నిర్మించిన భారీ భవంతులను హైడ్రాధీశుడు కూల్చేయగలడా..?)
చాలా విషయాల్లో తాము అనుసరించిన ప్రజావ్యతిరేక పోకడలకు భిన్నంగా ఇప్పుడు పదే పదే ధోరణులు మార్చుకుంటూ బీఆర్ఎస్ ప్రతి చిన్న అంశంలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి, టన్నులకొద్దీ పెట్రోల్ పోయడానికి ప్రయత్నిస్తోంది… నిజంగానే ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేస్తోంది… హరీష్, కేటీయార్ సాగిస్తున్న దాడికి ఇప్పుడిక కవిత కూడా తోడైంది… ఆమె కూడా రంగంలోకి దిగింది…
కౌంటర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ పెద్దగా చేతకావడం లేదు… కారణాలు అనేకం కావచ్చు… కానీ రాధాకృష్ణ ప్రస్తావించిన రెండుమూడు అంశాలు మాత్రం యధార్థం… బీఆర్ఎస్ కోలుకుంటోంది, కానీ ఇంకా జనం పాత గాయాల్ని, ఆ పాలనను మరిచిపోయి వెంటనే కేసీయార్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకునే సీన్ ఇంకా రాలేదు… సారు రాష్ట్రం మీదకు వదిలిన ఎమ్మెల్యేలు తెలంగాణకు, జనానికి చేసిన గాయాలు అంత త్వరగా మానేవి కావు కదా…
రేవంత్ రెడ్డి సర్కారు పట్ల అసంతృప్తి చాలా పెరిగింది… కానీ బలమైన వ్యతిరేకత ఇంకా ఏర్పడలేదు… హైకమాండ్ సపోర్ట్ ఉంది కాబట్టి సీనియర్లు సైలెంటుగా ఉన్నారు గానీ లేకపోతే ఇప్పటికే రచ్చ రచ్చ మొదలై ఉండేది… రేవంత్ రెడ్డి భాష మీద కూడా జ్యోతి సలహా కరెక్టు… కేటీయార్ ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో పిచ్చి భాష, కుసంస్కారం ప్రదర్శిస్తే రేవంత్ రెడ్డి కూడా అదే భాషలో బదులు ఇవ్వడం ఏమిటి..?
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆగింది… కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోంది… మంత్రివర్గ విస్తరణ అలాగే ఉండిపోయింది… ఖజానా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు… మరోవైపు పాలమూరుకు లక్ష కోట్లు పెడతానని ప్రకటన… మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాస్ట్ అత్యంత భారీ… నీటి ప్రాజెక్టులకు డబ్బుల్లేవు… చివరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీకి కూడా జాప్యమే… ఉన్నతాధికారుల మీద అదుపు లేదు…
చాలామంది ఉన్నతాధికారులు తాము ఇంకా కేసీయార్ పాలనలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు… రేవంత్ రెడ్డి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతల్ని ఈరోజుకూ ఏ పాత అక్రమాల కేసుల్లోనూ బలంగా ఫిక్స్ చేయలేకపోయాడు… సో, రెండో ఏడాది రేవంత్ రెడ్డికి అసలైన పరీక్షలు ఆరంభమవుతాయేమో…!!
Share this Article