జాంబిరెడ్డి అని ఓ కొత్త సినిమా వస్తోంది రేపోమాపో… హీరో సజ్జా తేజ అట… జబర్దస్త్ ఈటీవీషోలో ఓ ప్రమోషన్ స్కిట్ చేశాడు సుడిగాలి సుధీర్ టీంతో కలిసి… దర్శకుడు ప్రశాంత్ వర్మ… హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి కాదు… ఈ జాంబి అంటే ఏమిటి అనేవి కాసేపు పక్కన పెట్టేయండి… కానీ హీరోయిన్ ఆనంది అనే పేరు దగ్గర కాసేపు దృష్టి నిలిచిపోయింది… మన పిల్ల… మన వరంగల్ పిల్ల… మన తెలుగు పిల్ల… మన తెలంగాణ పిల్ల… ఓ సినిమాలో హీరోయిన్… వావ్, బాగుంది… తెలుగు సినిమాలకు హీరోయిన్లుగా తెలుగు ఆడలేడీస్ పనికిరారని ఓ దిక్కుమాలిన అలిఖిత కట్టుబాటు ఏదో ఉన్నట్టుగా… మరీ చీప్ సినిమాలు తీసేవాడికి కూడా ముంబై లేదా కేరళ పిల్లలు కావాలి…
నటన తెలుసు, అందం ఉంది, ఎలాంటి పాత్రనైనా పోషించగలమన్న కాన్ఫిడెన్స్ ఉంది… కానీ ఒక చిన్న పాత్ర ఇచ్చిన నిర్మాత లేడు, దర్శకుడు లేడు… అప్పుడెప్పుడో 2012లో బస్‌స్టాప్ అనే సినిమాతో ఎంట్రీ… ఆ తరువాత రెండుమూడు పాత్రలు… అంతే… అవకాశాల్ని వెతుక్కుంటూ తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది… ఇక అంతే… మళ్లీ ఇప్పటి ఈ జాంబిరెడ్డి వరకు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా పాత్ర లభించలేదు ఆమెకు… మన ఇంటికోడి పప్పుతో సమానం (ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్… ) అని ఊరకే అనలేదు మరి… ఎవరెవరో కేరళ అమ్మాయల్ని, ముంబై అమ్మాయిల్ని వెతుకుతూ, ఎంత డబ్బయినా ఇస్తామని తిరుగుతారు… కేరళ వాళ్లు నటనలో జెమ్స్, అది వోకే గానీ.., మొహంలో ఏ ఉద్వేగమూ పలకని ముంబై యాక్టర్స్ అంటే ఎందుకో మహాపిచ్చి మనవాళ్లకు… (ఎందుకంటే..? డ్యాష్ డ్యాష్… చాలా కమిట్మెంట్లు ఉంటయ్ మరి…)
Ads
మన వరంగల్ పిల్ల దగ్గరకొద్దాం… తమిళంలో కాస్త గుర్తింపు దొరికింది… ఉపాధి దొరికింది… ఏటా ఒకటీరెండు పాత్రలు దొరుకుతున్నయ్… 2018లో వచ్చిన pariyerum perumal సినిమాతో దుమ్మురేపింది… నిజం, తమిళ దర్శకులు తమకు కావల్సిన విధంగా నటీనటుల నుంచి మంచి నటనను రాబడతారు… మన సోది మొహాలకు మట్టిముద్దల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో తెలియదు… ఈ సినిమాలో నటించిన ఆనందికి (అసలు పేరు రక్షిత, కొంతకాలం హాసిక…) బోలెడు అవార్డులు, విమర్శలకు ప్రశంసలు దక్కాయి… ఆమెకేమో తెలుగు చిత్రాలు కావాలి, కానీ ఇచ్చేవాడు లేడాయె… ఇన్నేళ్లకు ఆమెకు తెలుగు చాన్స్…
ఈ ఏడెనిమిదేళ్ల వ్యవధిలో ఆమె పేరు తెలుగు ఇండస్ట్రీలో కాస్త వినబడిందీ అంటే… ఆమె వరంగల్‌లో రహస్య వివాహం చేసుకున్నప్పుడు..! తమిళంలో కోడైరెక్టర్‌గా పనిచేసే సోక్రటీస్‌ను మొన్నామధ్య పెళ్లి చేసుకుంది… ఒకటీ అరా సైట్లలో, యూట్యూబులో చిన్న వార్తలకు నోచుకుంది.,. భారీ కవరేజీలు మాత్రమే తెలిసిన పెద్ద పత్రికలు, పెద్ద టీవీలకు అదీ కనిపించలేదు… పోన్లెండి… జాంబిరెడ్డి గనుక క్లిక్కయితే, మరో నాలుగు పాత్రలు లభించాలని కోరుకుందాం… ఆల్ ది బెస్ట్ ఆనందీ…!!
Share this Article