క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా అనిపించుకునే రేంజ్ అందగత్తెలు ఎవరు..? ఇద్దరు… ఒకరేమో మహారాణి గాయత్రీ దేవి… వోగ్ పత్రిక ప్రపంచవ్యాప్త టాప్ అందగత్తెల్ని పది మందిని ఎంపిక చేస్తే… అందులో ఒకరు గాయత్రి… మరొకరు లీలానాయుడు… అవును, అక్షరాలా మన తెలుగు మహిళే… చిత్తూరు జిల్లా మదనపల్లె… అబ్బే, అందానిదేముంది..? వీళ్లంతా అందంగా చూపించబడేవాళ్లే తప్ప, సహజమైన అందగత్తెలు కాదు కదా అంటారా..? ఈ లీలానాయుడు మహిళలు అబ్బురపడే రీతిలోనే విశేషజీవనాన్ని గడిపింది… అది ఓసారి చెప్పుకోవచ్చు…
1940… అదీ ఆమె జన్మసంవత్సరం… తండ్రి పత్తిపాటి రామయ్య నాయుడు… న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గొప్ప సైంటిస్టు… నోబెల్ ప్రైజ్ గ్రహీత మేడం క్యూరీ తెలుసు కదా, ఆమె పారిస్ లేబరేటరీకి సైంటిస్ట్ ఇన్‌ఛార్జి… యునెస్కో సైంటిఫిక్ అడ్వయిజర్… తల్లి మాంగే మార్తే యూరప్ మహిళ… భారతీయ వ్యవహారాలపై రీసెర్చ్ చేసేది, ఇండాలజిస్ట్… ఈమె అందం, ఆయన మేధస్సు కలగలిసిన రూపం లీలానాయుడు… ప్లస్ టెంపర్‌మెంట్… 16 ఏళ్ల వయస్సులోనే మిస్ ఫెమినా అందాల పోటీల్లో విజేత… తన తొలిచిత్రం హృషికేష్ ముఖర్జీ తీసిన అనూరాధ… జాతీయ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం… విదేశీపత్రికలు ఆమెను ‘స్టన్నింగ్ క్లాసికల్ బ్యూటీ’ అని పల్లకీ ఎక్కించాయ్…
Ads
సినిమాల్లోకి రాకముందే… అంటే 17వ ఏట… ఒబెరాయ్ హోటల్స్ వారసుడు తిలక్‌రాజ్‌తో ప్రేమలో పడింది… పెళ్లి చేసుకున్నారు… తన వయస్సేమో 33 ఏళ్లు… పెళ్లయ్యాక కవలపిల్లలు… కానీ భర్త పెద్ద శాడిస్ట్… ఈమెకు అభిమానం జాస్తి… దాంతో మూడేళ్లకే విడాకులు ఇచ్చింది, పిల్లల్ని కూడా ఒబెరాయ్‌కే అప్పగించింది… శ్యాం బెనెగల్ త్రికాల్, శశికపూర్‌తో ది హౌజ్ హోల్డర్… చివరగా 1992లో ఎలక్ట్రిక్ మూన్… నటన అంటే ఓ పట్టాన ఇష్టపడేది కాదు… రాజ్‌కపూర్ తెలుసు కదా… నాలుగుసార్లు హీరోయిన్‌గా తీసుకుంటానని ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించింది… అదేమంటే నాకిష్టం లేదుపో అనేసింది…
ఫస్ట్ వివాహం విడాకులతో ముగిసింది, సినిమాలంటే వ్యామోహం లేదు… ఆ విడాకులయ్యాక తొమ్మిదేళ్లకు అప్పట్లో మంచి పేరున్న కవి, గోవాకు చెందిన డామ్ మోరేస్‌ను పెళ్లిచేసుకుంది.,. పారిస్, లండన్, న్యూయార్క్ వంటి కేంద్రాల్లో కొన్నేళ్లు గడిపారు… తరువాత తన నిజరూపం కూడా గ్రహించింది… తండ్రి ద్వారా, తన మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిని చూసే తనను పెళ్లిచేసుకున్నాడని తెలిసి ఆయన్ని కూడా వదిలేసింది… పెళ్లంటే ద్వేషం… రెండు పెళ్లిళ్ల అనుభవాలతో విరక్తి… డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది… జిడ్డు కృష్ణమూర్తి దగ్గర ఆశ్రయం పొంది కొంతకాలానికి స్వస్థత చేజిక్కించుకుంది… ఇక మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా… బొంబాయిలో అత్యంత సంపన్నులు మాత్రమే ఉండే కొలబాలో ఓ ఖరీదైన ఇల్లు కొనుక్కుని ఒంటరి జీవితాన్ని ఆశ్రయించింది… వరల్డ్ ఫేమస్ రచయితల పుస్తకాలే ఆమె ప్రపంచం… పెద్ద పెద్ద దర్శకుల సినిమాల్నే డోన్ట్ కేర్ అని వదిలేసి… ఆమె ఎంచుకున్న ఏకాంత జీవితం ఎవరైనా ఊహించగలరా..? తన జీవితం తనిష్టం… అంతే… ఆమె మీద డాక్యుమెంటరీలు వచ్చాయి… ఆమె బయోగ్రఫీ మీద పుస్తకాలు వచ్చాయి… స్టాంప్స్ కూడా విడుదలయ్యాయి… 69 ఏళ్లు అలాగే బతికింది… 2009లో వెళ్లిపోయింది… ఓ యూరోపియన్ మహిళ బిడ్డ కదా, మరి మన భారతీయ మహిళా సౌందర్యానికి ప్రతీక అని ఎలా వర్ణిస్తారు అంటారా..? క్షేత్రం ఏదయితేనేం..? మన బ్లడ్డు, మన బ్రీడు…!!
Share this Article