Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జై పాలస్తీనా..! ఒవైసీ నినాదంతో కొత్త రగడ… తప్పొప్పులపై చర్చ..!!

June 27, 2024 by M S R

ఈసారే ఈ విపరీత ధోరణి విపరీతంగా కనిపించింది… లోకసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రకరకాల నినాదాలు చేశారు సభ్యులు… రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని అందరికీ చూపిస్తూ ప్రమాణం చేసి, చివరలో జై సంవిధాన్ అన్నాడు… దాన్ని అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు… కానీ..?

ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరమేముంది..? బీజేపీ నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (50 ఏళ్లయిన సందర్భంగా) ని తిట్టిపోస్తోంది… స్పీకర్ కూడా తన ప్రసంగంలో నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించి కాంగ్రెస్ ను తిట్టిపోసాడు… మోడీ మెచ్చాడు… అసలు మోడీయే పెద్ద నియంత, తను రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అంటూ ఇండి కూటమి కౌంటర్ చేస్తోంది… ఈ రాజకీయ సమరం, వాగ్వాదాలు, వ్యూహాలు ప్రమాణస్వీకారాలను ప్రభావితం చేయడం బాగోలేదు…

పార్లమెంటులో ప్రమాణస్వీకారాలు కూడా ఓ రాజకీయ సభలాగా తలపించడం సరికాదనిపిస్తుంది… నవ్వులపాలు చేస్తున్నారు… చాలామంది అసలు మాతృభాషలోనే స్పష్టంగా పదాల్ని పలుకుతూ పలకలేరు… తడబడతారు… ఇంగ్లిషులోనే కాదు, తమకు అలవాటైన మాతృభాషలోనూ పదాల్ని పలకలేకపోగా, ఈ నినాదాలు… ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు ఇంట్లో కాస్త రిహార్సల్ వేసుకుని వేస్తే ఏం నష్టం..?

Ads

తమ గౌరవాన్ని, తమ పార్టీ గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడాలి కదా… మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు మరీ కంట్రవర్సీని క్రియేట్ చేశాయి… జై పాలస్తీనా అన్నాడు… తనను తాను కోట్లాది ముస్లింల గొంతుగా ప్రదర్శించుకోవడం..! కానీ భారత దేశ సార్వభౌమాధికారానికి వేదికవంటి పార్లమెంటులో జరిగే ఈ రాజ్యాంగ బద్ధ ప్రమాణ స్వీకారాల కార్యక్రమాన్ని దానికి ఎంచుకోవడం దేనికి..? అక్కడ వేరే దేశానికి జై కొట్టడం ఏమిటి..?

సరే, పాలస్తీనాకు సంఘీభావం, మద్దతు ప్రకటించదలుచుకుంటే అది బయట ప్రసంగాల్లో, ఇతర కార్యక్రమాల్లో చేసుకోవచ్చు… దాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు… ఇక రేప్పొద్దున అందరికీ ఇదే అలవాటై, ఇంకెవరో జై ఇజ్రాయిల్ అంటే..? మరెవరో జై చైనా అంటే..? ఇది ఎక్కడి దాకా..? ఈ దేశ పార్లమెంటులో ఇతర దేశాలకు జేజేలు ఏమిటి..?

నిజానికి తాము చదవాల్సిన ఫార్మాట్‌ను చదివేసి, స్పీకర్‌కు ఓ దండం పెట్టి వేదిక దిగిపోతుంటారు చాలామంది… ఓవరాక్షన్ అసలు ఉండదు… కొందరు జైహింద్ అంటారు చివరలో… అది మతాన్ని సూచించేది కాదు, హిందుస్థాన్‌ అని మన దేశాన్ని సూచించేది, ఈ దేశం పట్ల విధేయతను ప్రకటించేది… కాకపోతే కొందరు సభ్యులు తమ ప్రాంతాన్ని సూచించేలా ఏరియా స్పెసిఫిక్ దుస్తుల్లో, వాళ్ల మాతృభాషలో ప్రమాణం చేయడానికి ఇష్టపడతారు… (మనవాళ్లు ధోవతులు, తలపాగాలు ధరించినట్టు…)

సరే, ఒవైసీ దగ్గరకొద్దాం… తన జై పాలస్తీనా నినాదాన్ని సమర్థించేవారికీ కొదువ లేదు… తప్పేముంది..? ఇజ్రాయిల్ దురహంకారాన్ని, దాడుల్ని వ్యతిరేకించడానికి ఆ వేదికను వాడుకున్నాడు, అందులో అభ్యంతరపెట్టాల్సింది ఏముందనేది వారి వాదన… కానీ ఇది పార్లమెంటరీ రూల్స్, సంప్రదాయాలకు వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102డీ స్పూర్తికి కూడా వ్యతిరేకం కాబట్టి ఒవైసీని సభ నుంచి బయటికి పంపించాల్సిందే అంటూ కొందరు లాయర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు…

ఆర్టికల్ 102డీ ప్రకారం ఒవైసీ నినాదం తప్పు, పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘన అనేది వారి వాదన సారాంశం… సరే, రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మోడీ అండ్ కో సూచనలే ఆధారం అవుతాయి… ఒవైసీ రాజకీయంగా బీజేపీ హైకమాండ్‌కు పరోక్షంగా రాజకీయ మిత్రుడే గానీ ప్రత్యర్థి కాదనే ప్రచారం చాన్నాళ్లుగా ఉన్నదే కదా… ఆ తెర వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా, ఒవైసీ విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవచ్చు… పైగా 102డీ ప్రకారం వేరే దేశానికి విధేయత ప్రకటిస్తే అనర్హత వేటు ఉంటుంది…

కానీ ఇక్కడ ఒవైసీ పాలస్తీనాకు విధేయతను ప్రకటించలేదు… అది పాలస్తీనాకు మద్దతు, సంఘీభావం… ఆ రెండింటి నడుమ తేడా ఉంది… అయితే బీజేపీ సభ్యులు వ్యతిరేకించడంతో ఒవైసీ నినాదాలను ప్రొటెం స్పీకర్ రికార్డుల నుంచి ఆల్రెడీ తొలగించాడు… ఇక తదుపరి చర్యలు ఏమీ ఉండకపోవచ్చు… మన ఒవైసీయే కదా…! పైగా దీని మీద దేశం మొత్తమ్మీద ఓ చర్చ జరగడం, ఇండి కూటమికి మరో అవకాశం ఇవ్వడం మోడీ సర్కారుకు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి..!!

చివరలో… సరదాగా…. అవునూ, ఒవైసీ మీద నిజంగానే అనర్హత వేటు వేస్తే ఇక మళ్లీ హైదరాబాద్ పాతబస్తీలో మాధవీలత మళ్లీ ప్రచారరంగంలోకి అడుగుపెట్టాల్సిందేనా..? అప్పుడిక అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్ అభ్యర్థి అవుతాడా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions